breaking news
laxman yele
-
తూనీగ డిజిటల్ డైలాగ్ విడుదల
హైద్రాబాద్ : వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ చిత్రానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ డైలాగ్‌ను ప్రముఖ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే విడుదల చేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వినూత్న రీతిలో సాగుతున్న చిత్ర ప్రచార సంరంభం తననెంతో ఆకట్టుకుందన్నారు. మొదటి నుంచి సినిమాకు సంబంధించిన అన్ని ప్రచార కార్యక్రమాలూ నవ్యతతో, ఆలోచనలు రేకెత్తించేలా రూపొందిస్తున్న తన మిత్రుడు, ప్రచార బృంద సారథి రత్నకిశోర్ శంభుమహంతిని ప్రశంసించారు. దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రేమ్ సుప్రీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. డిజిటల్ డైలాగ్‌ను ఆవిష్కరించిన లక్ష్మణ్ ఏలేకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. తూనీగ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందిస్తుండగా, ఎడిటర్‌గా ఆర్కే, డీఓపీగా హరీశ్ ఎదిగ పనిచేశారు. త్వరలోనే చిత్రం విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు యూనిట్ వెల్లడించనుంది. -
ఏలే డిజైనర్!
లక్ష్మణ్ ఏలే. కుంచె గురించి కొంచెమైనా తెలిసినవారికి పరిచయం అక్కరలేని చిత్రకారుడు. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. డిజైనింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అంతా ఇంతా కాదు, చరిత్రలో నిలిచిపోయేలా. ఆ కుంచె చేసే విన్యాసం తెలియందెవరికి! ముంబైలోని ప్రతిష్టాత్మకమైన జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఆయన బొమ్మల కొలువు పెట్టింది. ఈ మధ్య ఆయన బొమ్మలతో కన్నా లోగోలతో బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి రూపు ఇచ్చారు. తాజాగా రాష్ట్ర పోలీస్ కోసం లోగో డిజైన్ చేసి తన ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. ఆర్టిస్టులు ఎట్లా చేస్తారు లోగోలు? అది డిజైనర్స్ పనికదా... ఆయనకేం అర్హతుంది.. అనే విమర్శలే చాలా వినిపించాయి. దానికి ఏలే లక్ష్మణ్ చెప్పే సమాధానం ఒకటే! ‘ఆర్టిస్టు అనే పదం చాలా విస్తృతమైంది. అందులో పెయింటర్, డిజైనర్ అనే పదాలూ కలుస్తాయి.’ ఇంకా ‘నేను బేసిక్‌గా జర్నలిస్ట్‌ని, టెక్స్టైల్ డిజైనర్‌ని. ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశాను. లోగోలు చేశాను. కాబట్టి ఆ విమర్శలకు నా ట్రాక్ రికార్డే జవాబు’ అని అంటున్నాడు. తెలంగాణ ఆర్ట్ చరిత్రను రికార్డ్ చేయడం కోసం ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆ పని మీదే తరచూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు పాపారావును కలుస్తుండేవాడు. ఒకరోజు. ‘ స్టేట్ లోగోల గురించి చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా.. మీరూ నాలుగైదు డిజైన్లు చేయండి’ అన్నారు ఫోన్లో పాపారావు. అట్లా రాష్ట్ర లోగో చేసే అవకాశం అనుకోకుండా రావడం, ఆయన చేసిన లోగోను సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదించడమూ జరిగిపోయింది. పోలీస్ లోగో.. ఎలాగంటే! ఒకరోజు సాయంత్రం కుటుంబంతో కలసి ఏదో ఫంక్షన్‌కి వెళ్లడానికి లక్ష్మణ్ రెడీ అవుతుండగా డీజీపీ ఆఫీస్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెళ్లి అనురాగ్‌శర్మను కలవగా ‘పోలీస్‌లోగో కూడా మీరే చేయాలి. మీతోనే చేయించమని సీఎం చెప్పారు కాబట్టి ఆ పనిలో ఉండండి’ అని చెప్పారు. ఈ లోగో రూపకల్పనలో ఆస్కీవాళ్లూ ఇన్వాల్వ్ అయ్యారు. హానర్, డ్యూటీ, కంపాషన్ లాంటివి ఆరు పాయింట్లను సూచించారు. ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్, ఆస్కీవారు డిస్కస్ చేసి వాటిని మూడింటికి కుదించారు. వాటిని లక్ష్మణ్ సింబలైజ్ చేస్తూ ఓ డిజైన్నిచ్చాడు. డే అండ్ నైట్, రౌండ్ ది క్లాక్ పోలీసులు పనిచేస్తారనే అర్థమొచ్చేటట్టు షీల్డ్‌ని, ఇతరాలకూ ఆయన ఓ రూపమిచ్చాడు. బ్లూ, రెడ్, గోల్డ్ కలర్లనూ ఇచ్చి ప్రతి కలర్‌కూ ఓ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అంతేకాదు లోగోకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి వర్ణన, వివరణ ఇస్తూ లాజిక్ ఆఫ్ లోగో అనే కాన్సెప్ట్‌నూ తయారు చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సలహాలు, సూచనలను సమన్వయపరుస్తూ ఓ రెండు లోగోలు తయారు చేశాడు లక్ష్మణ్. మిగిలిన వాళ్లూ పంపించిన దాంట్లోంచి కొన్నింటిని తీసి మొత్తం పది లోగోలను ఎంపిక చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అందులోంచి మళ్లీ మూడింటిని ఫైనల్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపించారు. ఆ మూడింట్లో రెండు లక్ష్మణ్‌వే. వాటిల్లోంచి లక్ష్మణ్ ఏలే చేసిన ప్రస్తుత లోగోనే పోలీస్ అధికారిక లోగోగా ఎంపికైంది. ఇదీ పోలీస్ లోగో కథ! కొసమెరుపు ఏంటంటే.. కేసీఆర్ సెలెక్ట్ చేసే వరకు ఆయనకు తెలియదు ఆ లోగో లక్ష్మణ్ ఏలే చేసినట్టు! ‘ఓ పొయెట్ పోయెమ్‌కి బొమ్మ వేసినట్టుగానే ఆ రెండు లోగోలను డిజైన్ చేశాను. వీటికి ఇంత రెస్పాన్స్ ఉంటదని, వాటితో నాకింత హానర్ వస్తుందని తెలియదు. కేసీఆర్‌కు మంచి విజువల్ సెన్స్ ఉండడం.. ఆయన చేసిన సూచనలు ఆ లోగో పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ చేసింది. నేను ఈ లోగోలతో మొత్తం తెలంగాణ ప్రజలకూ తెలిశాను. ఇది నాకు డిఫరెంట్ ఎక్స్పోజర్. చాలా సంతోషంగా ఉంది.’ అని చెబుతున్నాడు లక్ష్మణ్ ఏలే! - శరాది -
సంస్కృతి, చరిత్రకు ప్రతిరూపమే అధికారిక చిహ్నం
భువనగిరి: సంస్కృతి, చరిత్ర, పాడిపంటలతో కూడిన బంగారు తెలంగాణకు ప్రతిరూపంగా అధికారిక చిహ్నం రూపొందించినట్టు ప్రఖ్యాత కుంచె చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ తెలిపారు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్.ఎం మండలం కదిరేనిగూడెం గ్రామానికి చెందిన ఏలె లక్ష్మణ్ రూపొందించిన లోగోను తెలంగాణ అధికారిక చిహ్నంగా ప్రభుత్వం ఆమోదించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తెలంగాణ అధికారిక చిహ్నం ప్రాముఖ్యతను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... తెలంగాణ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కాకతీయుల పరిపాలన.. వారి శిలాతోరణం... 11, 12 శతాబ్దాల నాటి సంస్కృతి, చరిత్రకు తోరణం అద్దం పడుతుంది. అలాగే, హైదరాబాద్‌లోని చార్మినార్. 423 ఏళ్ల చరిత్రతోపాటు అనేక భిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ నగరానికి ఉంది. అద్భుత కట్టడం చార్మినార్ లేని హైదరాబాద్‌ను, హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించలేం. ఈ రెండు అంశాలు మన సంస్కృతికి, చరిత్రకు అద్దం పడతాయి. వాటికి ప్రతిరూపంగా కాకతీయ తోరణం, చార్మినార్‌ను లోగోలో పొందుపర్చాను. అదే విధంగా భారత ప్రభుత్వం అధికారిక చిహ్నం నాలుగు సింహాల రాజముద్రను పెట్టాను. తెలంగాణ రాష్ర్టం పాడిపంటలతో తులతూగాలని ఆకుపచ్చ రంగును ఎంచుకున్నా. చుట్టూ ఉన్న బంగారం రంగు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే బంగారు తెలంగాణకు ప్రతిరూపం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించగానే అధికారిక చిహ్నం రూపొందించాలనే ఆలోచన వచ్చింది. పలు అంశాలను చేర్చడం వల్ల అందులో స్పష్టత ఉండదని భావించి, ప్రధానమైన రెండు అంశాలను మాత్రమే చేర్చాను. పది రోజుల్లోనే పూర్తి చేయగలిగాను. పూర్ణకుంభం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధికారిక చిహ్నంగా ఉంది. అందుకే దానిని తీసుకోలేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది.. కేసీఆర్ మనసులో ఉన్న విధంగా లోగోను తయారు చేయగలిగాను. నేను రూపొందించిన చిహ్నం సులభంగా అందరికీ అర్థం కావడం నా ఆశయం. అది నెరవేరినందుకు సంతోషంగా ఉంది.