తాజా సంస్కరణ లకు బాట
బెంగళూరు: దశాబ్దపు కనిష్ట స్థాయిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో తాజా సంస్కరణలకు బాట పడుతుందని రాయిటర్స్ సర్వే పేర్కొంది. అయితే ఆదాయపు పన్ను మినహా మిగిలిన పన్నులు, సుంకాల్లో ప్రధాన మార్పులు ఉండకపోవచ్చని తెలిపింది. వస్తు సేవల పన్ను సంస్కరణలను అమలుచేయకపోవొచ్చని, ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలుకు టైమ్ టేబుల్ ప్రకటించవచ్చని సర్వేలో పాల్గొన్న ఎకానమిస్టులు అంచనావేశారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మోడీ సారథ్యంలోని బీజేపీ సంపూర్ణ విజయం సాధించిన అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టించాయి. వాణిజ్య రంగ మిత్రుడిగా పేరొందిన మోడీ ఆర్థిక ప్రగతి పరుగులు తీసే సంస్కరణలను తెస్తారని పలువురు భావిస్తున్నారు.
ఆశలు తీరుస్తుందా?
ఈ నేపథ్యంలో ఈ నెల 3-7 తేదీల్లో 24 మంది ఆర్థిక నిపుణులతో రాయిటర్స్ వార్తాసంస్థ సర్వే నిర్వహించింది. మోడీపై దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలను బడ్జెట్ సాకారం చేస్తుందని ఆశిస్తున్నట్లు వీరిలో 17 మంది తెలిపారు. ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమైన సంస్కరణలకు తగిన ముందస్తు ఏర్పాట్లు బడ్జెట్లో ఉండవచ్చని మిజుహో బ్యాంక్ (సింగపూర్) సీనియర్ ఎకనామిస్ట్ విష్ణు వర్ధన్ అన్నారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో సహా పన్ను సంస్కరణలను ప్రస్తుతానికి అమలు చేయకపోవచ్చనీ, బహుశా వచ్చే ఏడాది అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం వివిధ రకాల ఇంధనాలపై ఏటా ఇస్తున్న 4 వేల కోట్ల డాలర్ల సబ్సిడీలే. ద్రవ్యలోటు తగ్గించడానికి సబ్సిడీలకు జైట్లీ కోత పెట్టవచ్చని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పెట్రోలు ధరలపై కంట్రోలును ప్రభుత్వం ఇప్పటికే తొలగించగా డీజిలు, వంటగ్యాసు, కిరోసిన్ ధరలపై కంట్రోలు కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అరకొరగా కురిసే అవకాశం ఉన్నందున ఎరువులు, ఆహారంపై సబ్సిడీలను తగ్గించడం కష్టసాధ్యం. సబ్సిడీలను కుదిస్తే ఆహార ఉత్పత్తుల ధరలు భగ్గుమంటాయని ఎకనామిస్టులు పేర్కొన్నారు.
పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాల విక్రయం జోరు?
స్టాక్ మార్కెట్లలో ర్యాలీ నుంచి దేశం లబ్ధి పొందేందుకు జైట్లీ యత్నించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఊహిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికీ, వ్యయానికీ మధ్య అగాధాన్ని కొంత పూడ్చేందుకు కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను విక్రయించవచ్చని భావిస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 900 కోట్ల డాలర్ల నుంచి 1,100 కోట్ల డాలర్లకు పెంచాలని ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. జీఎస్టీ అమలుతో ధరల పెరుగుదలకు కళ్లెం పడుతుందనీ, అయితే ప్రస్తుత బడ్జెట్లో జీఎస్టీ అమలుకు చర్యలు చేపట్టకపోవచ్చనీ ఎకనామిస్టులు తెలిపారు.
జీఎస్టీ అమలు ప్రస్తుతానికి లేనట్లే...
జీఎస్టీ అమలుకు సంబంధించిన కొంత సమాచారాన్ని కేంద్రం వెల్లడించవచ్చనీ, పన్నుల్లో ప్రధాన సంస్కరణలేవీ ఉండకపోవచ్చనీ 16 మంది ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ‘జీఎస్టీ అమలుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే బడ్జెట్లో జీఎస్టీ గురించి కొంత ప్రస్తావన ఉండవచ్చు..’ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిస్టు జితేందర్ కుమావత్ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డీటీసీ) ప్రవేశపెట్టడానికి సంబంధించిన టైమ్ టేబుల్‌ను బడ్జెట్లో ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్పారు.
ద్రవ్యలోటు 4.3 శాతం?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.3 శాతంగా అరుణ్ జైట్లీ నిర్ణయించవ్చని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. తాము గతంలో అంచనా వేసిన 4.8% కంటే ఇది తక్కువని ఓ ప్రకటనలో తెలిపింది. పన్నుల ఆదాయం 21% పెరుగుతుందన్న మునుపటి ప్రభుత్వ అంచనా అతి ఆశావాదంతో కూడినదని వ్యాఖ్యానించింది. అధిక ద్రవ్యలోటును కట్టడిచేయడానికి మూడేళ్లు పడుతుందనీ, భారత్ రేటింగ్ తగ్గిస్తామని విదేశీ రేటింగ్ ఏజెన్సీలు చెప్పడానికి ఇదొక కారణమనీ పేర్కొంది.
వేతన జీవులకు ఉపశమనం?
మోడీ సర్కార్ తొలి బడ్జెట్ వేతన జీవులకు ఉపశమనం కలిగిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. పెట్టుబడులను, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించే చర్యలు బడ్జెట్లో ఉంటాయని కూడా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ. 2 లక్షలుగా ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచుతారని పలువురు ఊహిస్తున్నారు.
పెన్షన్లు, జీవిత బీమాలో చేసే పెట్టుబడులు, కొన్ని రకాల వ్యయాలపై ఇస్తున్న పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను, పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే విధంగా పన్ను ప్రోత్సాహకాలతో పాటు మరిన్ని చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని వారి అంచనా. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొన్నట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.