breaking news
Lashkar eToiba
-
కశ్మీర్లో భారీ ఆపరేషన్
శ్రీనగర్: ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం కశ్మీర్లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా వద్ద ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిజ్బుల్, లష్కరేలకు భారీ ఎదురుదెబ్బ భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఎన్కౌంటర్ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్కౌంటర్లలో గాయపడ్డారు. 25 మంది పౌరులకు పెల్లెట్ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేçహాలు లభించాయి. కాగా కచుదూరా ఎన్కౌంటర్ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఎస్పీ అభినందనీయం: కశ్మీర్ డీజీపీ అనంత్‌నాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాది లొంగిపోయేందుకు ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) చేసిన ప్రయత్నాన్ని డీజీపీ అభినందించారు. ‘ ఒక ఉగ్రవాదికి చెందిన కుటుంబ సభ్యుల్ని సంఘటనా స్థలానికి రప్పించి అతను లొంగిపోయేలా ఎస్ఎస్పీ ప్రయత్నించారు. కుటుంబసభ్యులు ఉగ్రవాదితో 30 నిమిషాలు మాట్లాడారు. అయితే వారి మాటల్ని వినేందుకు ఆ ఉగ్రవాది ఒప్పుకోలేదు. అతను కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్లో ఆ ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు’ అని డీజీపీ తెలిపారు. ద్రాగద్ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదులు స్థానికులేనని, మృతదేహాల్ని బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు. ద్రాగద్‌లో ఉగ్రవాదులు నక్కిన ఇంటి యజమాని కాల్పుల్లో మరణించాడు. కశ్మీర్లో అప్రమత్తం ఎన్కౌంటర్ల నేపథ్యంలో కశ్మీర్ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హురియత్ నేతలు సయద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, యాసిన్ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు. ప్రతీకారం తీర్చుకున్నాం షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రే జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్, ఆర్మీతో కలిపి ఈ ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించారు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల్లో ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్, ఒకరు లష్కరే తొయిబాకు చెందినవారని, మరో ఐదుగురు వివరాల్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. కచుదూరా ఎన్కౌంటర్ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పలువురు గాయపడ్డారని సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. కచుదూరా, ద్రాగద్‌లో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు. గతేడాది షోపియాన్‌లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ హత్యకు ఈ ఎన్కౌంటర్లతో ప్రతీకారం తీర్చుకున్నామని 15వ కోర్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఏకే భట్ తెలిపారు. ఫయాజ్ హత్యలో కీలక సూత్రధారులైన ఇష్ఫక్ మాలిక్, రయీస్ తోకర్లు ఈ ఎన్కౌంటర్లలో హతమయ్యారని ఆయన తెలిపారు. -
ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది
వీడియో కాన్ఫరెన్స్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి * ఈ విషయాన్ని లఖ్వీయే చెప్పాడన్న డేవిడ్ * ‘బాబ్రీ’కి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ ముంబై: 2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2004లో గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్.. లష్కరే తోయిబా ఉగ్రవాదని గురువారం జరిగిన వీడియో లింక్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడించాడు. ‘భారత్‌లో పోలీసులపై కాల్పులు జరిపే వ్యూహంతో.. లష్కరే ఉగ్రవాది ముజమ్మిల్ భట్ ప్రయత్నాలు చేస్తుండగానే ఓ మహిళా ఉగ్రవాది ఎన్కౌంటర్ అయిందని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పారు’ అని హెడ్లీ పేర్కొన్నారు. ఆమె భారతీయురాలే అయినా.. లష్కరేలో క్రియాశీలకంగా పనిచేసినట్లు లఖ్వీ మాటలతో తెలిసిందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా అక్షర్ధామ్ మందిరంపై దాడికి లష్కరే ఉగ్రవాది అబూ కఫా ప్రయత్నించాడన్నారు. భారత్‌లో దాడులకు లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఆర్థికంగా ఏవిధంగా తోడ్పడ్డాయనే విషయాన్ని హెడ్లీ కోర్టుకు వెల్లడించారు. కోర్టు బయట ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కరేతోయిబాలో.. మిలటరీ, నేవీ, మహిళ, ఆర్థిక విభాగాలున్నాయని పేర్కొన్నారు. 2004లో ఏం జరిగింది? గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలో 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్‌తోపాటు నలుగురిని గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ.. బూటకపు ఎన్కౌంటర్ అని, క్రైమ్ బ్రాంచ్, ఎస్ఐబీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని 2013లో విడుదల చేసిన చార్జిషీటులో పేర్కొంది. అప్పటి గుజరాత్ అదనపు డీజీపీ, డీఐజీ డీజీ వంజారాతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారుల పేర్లను చార్జిషీటులో చేర్చింది. ఐబీ స్పెషల్ డెరైక్టర్ రాజిందర్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఐబీ అధికారులను విచారించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించాలని చూశారని.. అయినా వారి రాజకీయానికి పావుగా మారలేదని రాజిందర్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్కౌంటర్లన్నీ రాజకీయ జోక్యం కారణంగానే బూటకంగా మారిపోతాయని డీజీ వంజారా అన్నారు. ఇది సాక్ష్యం కాదు: ఇష్రత్ లాయర్ అయితే.. హెడ్లీ వెల్లడించిన అంశాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇష్రత్ కుటుంబం తరపు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. నలుగురు పేర్లు చెబితే.. అందులోనుంచి ఒకరి పేరును హెడ్లీ వెల్లడించటం సాక్ష్యం కాదన్నారు. ఇష్రత్ కుటుంబ సభ్యులు కూడా హెడ్లీ ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ప్రణేశ్ కుమార్ అలియాస్ జావెద్ షేక్ తండ్రి పిళ్లై కూడా.. హెడ్లీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ముంబై దాడుల కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవటంతో.. తదుపరి విచారణను పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. సోనియా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ప్రధాన మంత్రి మోదీపై కోపంతో.. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా చూపించేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. తాజాగా హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ వ్యాఖ్యలు తప్పని తేలిందని బీజేపీ విమర్శించింది. మోదీపై తప్పుడు ప్రచారం చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. హెడ్లీ వ్యాఖ్యలు నమ్మలేం: కాంగ్రెస్ ఇష్రత్ ఎన్‌కౌంటర్‌పై హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను కాంగ్రెస్ ఖండించింది. హెడ్లీ సాక్షం ఆధారంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిర్ధారించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తెలిపారు.