breaking news
Land Rights Committee
-
అర్ధరాత్రి అరెస్టులు దారుణం
ఒంగోలు టౌన్: భూ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జరగాల్సిన ర్యాలీ, ధర్నాలో జిల్లా నుంచి నాయకులు పాల్గొనకుండా పోలీసులు అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఒక ప్రకటనలో విమర్శించారు. భూ బ్యాంకు పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటుందని విమర్శించారు. పట్టాదారు రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పకుండా, 2013 భూసేకరణ చట్టాన్ని ప్రస్తావించకుండా అన్ని గ్రామాల్లో సర్వేలు పూర్తి చేసిందన్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ రైతాంగం ఐక్యమై విజయవాడలో ర్యాలీ, ధర్నా చేసేందుకు సిద్ధమైతే అర్ధరాత్రి పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేసేలా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఈ చర్యలను ప్రజాతంత్రవాదులు ఖండించాలని పూనాటి ఆంజనేయులు కోరారు. -
9న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి
ఏపీ కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్ నూజివీడు : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంత భూసేకరణను నిరసిస్తూ ఈనెల 9న భూ హక్కుల పరిరక్షణ కమిటీ సారథ్యంలో వేలాదిమందితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అనుబంధ సంఘం ఏపీ కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్ తెలిపారు. నూజివీడులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంక్ పేరుతో జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున 13 జిల్లాల్లో 13 లక్షల ఎకరాలను రైతులు, పేదల నుంచి లాక్కుంటున్నారని, వీటిలో పట్టా భూములు, అసైన్డ్డ, సీలింగ్ తదితర భూములున్నాయన్నారు. వీటన్నింటినీ సింగపూర్, జపాన్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తున్నం దున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూకుంభకోణంపై విచారణ జరిపించాలి రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మద్దతుతో జరుగుతున్న భూ ఆక్రమణ, కుంభకోణాల దందా వెలుగులోకి రావడం మంచి పరిణామమని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అమరావతికి బడ్జెట్లో నిధులు కేటాయించనందున చంద్రబాబు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.