breaking news
Land Invaded
-
కబ్జా భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆక్రమణలకు గురైన భూముల క్రమబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా 500 గజాల వరకు ఆక్రమిత భూములను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు సబ్ కమిటీ తెలిపింది. 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31వరకు ఆక్రమణలో ఉన్న భూములకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ మేరకు వచ్చే ఏపీ కేబినెట్ సమావేశానికి సబ్ కమిటీ క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలు అందజేయనుంది. -
ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలి
వడమాలపేట: భూ ఆక్రమణకు పాల్పడి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని ఏఎంపురం గ్రామస్తులు శుక్రవారం తిరుపతి- చెన్నై జాతీయ రహదారిలో ధర్నా, రాస్తారోకో చేశారు. ఎస్బీఆర్ పురం రెవెన్యూ పరిధిలోని 542 ఎకరాల భూమికి సంబంధించి సుదర్శనరాజు(వర్మరాజు), నారాయణరాజు కుటుంబ సభ్యులకు 20 సంవత్సరాలుగా వివాదం జరుగుతోంది. మూడు రోజుల క్రితం వర్మరాజు తన మనుషులతో వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించి కంచె ఏర్పాటు చేయడంతో మనస్తాపానికి గురైన సుబ్రమణ్యంరాజు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం తెలిసిందే. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వర్మరాజుతో పాటు మనోహర్ (చంద్ర), శ్రీనివాసులు, నల్లశీను, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏఎం పురం గ్రామస్తులు శుక్రవారం ఉదయం తడుకు ఆర్ఎస్ వద్ద జాతీయ రహదారిలో టెంట్లు వేసుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ అక్కడికి చేరుకుని వర్మరాజు తమ కస్టడిలోనే ఉన్నాడని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.