మళ్లీ ‘లక్ష్యం’ కాంబినేషన్
గోపీచంద్ కెరీర్లో ‘లక్ష్యం’ సినిమా ప్రత్యేకైమైనది. ఏడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం గోపీ కెరీర్లోనే నంబర్‌వన్ విజయంగా నిలిచింది. దర్శకునిగా శ్రీవాస్కిదే తొలి సినిమా. మళ్లీ.. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ‘లక్ష్యం’ కాంబినేషన్ సెట్ అయ్యింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘గోపీచంద్‌తో గతంలో మేం నిర్మించిన ‘శౌర్యం’ చిత్రం ఓ సంచలనం. అలాగే... గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసింది.
సక్సెస్ఫుల్ కాంబినేషన్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం తప్పకుండా ఓ మంచి విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు’’ అని తెలిపారు. ‘‘గోపీచంద్‌తో పనిచేయడంలో మంచి సౌలభ్యం ఉంటుంది. ఆయనతో నేను చేసిన ‘లక్ష్యం’ నా కెరీర్‌కి శుభారంభాన్నిచ్చింది. గోపీచంద్ వ్యవహార శైలికి తగ్గ కథ ఇది. మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టాలనే కసితో అడుగులు వేస్తున్నాం’’ అని శ్రీవాస్ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్.