breaking news
labour organisations
-
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
కొత్త రవాణా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
రాజ్‌విహార్(కర్నూలు జిల్లా): రవాణా రంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం స్థానిక సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, అనుబంధ కార్మిక, ఆటో డ్రైవర్స్, వర్కర్స్, మోటర్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో బంద్ పాటించారు. రవాణా శాఖ ఎంవీఐల సంఘం పిలుపు మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఏఎంవీఐలు, ఇతర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆందోళనకారులు రవాణా శాఖ కార్యాలయంలోకి వచ్చి ఉద్యోగులను బయటకు పంపేయడంతో పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో 12 శాతం (68 బస్సులు) సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో సంస్థకు సుమారు రూ.30లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. బంద్ కారణంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పెరుగుతున్న ప్రైవేటు సెగ
- కార్మిక సంఘాల కన్నెర్ర.. - ఏప్రిల్ 28న పార్లమెంటు ముట్టడికి పిలుపు సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ దిశగా నడుస్తోందా? రైలు మార్గాల నిర్మాణంలోనూ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రకటన తో ఈ అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికులను అభద్రతా భావం వెంటాడుతోంది. ఇప్పటికే రైల్వేలోని పలు విభాగాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలోని రైల్వే కేటరింగ్ వ్యవస్థ, ఏసీ రైళ్లలో బెడ్ రోల్స్ పంపిణీ ఎప్పుడో ప్రైవేటు పరమయ్యాయి. అలాగే రైల్వే కాలనీల నిర్మాణం, ఫ్లాట్ ఫామ్‌ల నిర్వహణ, స్టేషన్ల పరిధిలోని అన్ని కార్యాలయాల పార్కింగ్ సేవలను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇంజన్లు, బోగీలు, వ్యాగన్ల నిర్వహణలో కాంట్రాక్టు సేవలు పెంచారు. డీజిల్ లోకో షెడ్లో దాదాపుగా అన్ని పనులు ప్రైవేటు సిబ్బందితోనే చేయిస్తున్నారు. ఇలా రైల్వేలో ఒక్కో విభాగాన్నీ ప్రైవేటు పరం చేస్తూ వెళుతుండటంతో కార్మిక సంఘాల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో 48 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత ఏకతాటి పైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఏప్రిల్ 28న పార్లమెంట్ ముట్టడికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేందుకు కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు.