breaking news
L B stadium
-
సెమీస్‌లో ఆంధ్రాబ్యాంక్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇంటర్ డిపార్ట్మెంటల్ ‘ఎ’ డివిజన్ లీగ్ కబడ్డీ టోర్నమెంట్లో ఆంధ్రాబ్యాంక్, దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్లు సెమీఫైనల్లోకి చేరాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పోస్టల్, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లు కూడా సెమీస్‌కు అర్హత సాధించాయి. హైదరాబాద్ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి లీగ్ పోటీల్లో ఆంధ్రాబ్యాంక్ జట్టు 26-13 స్కోరుతో రాష్ట్ర పోస్టల్ జట్టుపై విజయం సాధించింది. ఆంధ్రాబ్యాంక్ జట్టు ప్రథమార్థభాగం ముగిసే సమయానికి 13-5తో ఆధిక్యాన్ని సాధించింది. ఆంధ్రాబ్యాంక్ జట్టులో సూర్య నాయక్, శివరామకృష్ణ, వెంకటేశ్‌లు చక్కటి రైడింగ్ చేస్తూ తమ జట్టుకు ఎక్కువ పాయింట్లను అందించారు. మరో లీగ్ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు 28-20 స్కోరుతో సాయ్ జట్టుపై గెలిచింది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఆర్టీసీ జట్టు 20-18తో ఎస్బీఐ జట్టుపై నెగ్గింది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టుతో సాయ్ జట్టు, ఎస్సీఆర్ జట్టుతో రాష్ట్ర పోస్టల్ జట్టు తలపడుతుంది. -
ఒక్కటే లక్ష్యం.. ముమ్మరంగా ఉద్యమం
సాక్షి: ఒక్కటే లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం.. 39రోజులుగా విరామం లేకుండా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ శనివారం సమైక్య పోరాటాన్ని పతాకస్థాయిలో చేపట్టింది. హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంఘీభావంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రదర్శనలు మిన్నంటాయి. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడులకు నిరసనగా వాడవాడలా నిరసనలు చేపట్టారు. చెప్పులు కుట్టి, భిక్షాటన చేసి.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి, చెప్పులు కుట్టి నిరసన వ్యక్తం చేశారు. పాతపట్నంలో మానవహారం, టెక్కలిలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన, పలాసలో వైశ్యుల ర్యాలీ జరిగింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాగర్జనను 10 వేల మందికిపైగా సమైక్యవాదులు హోరెత్తించారు. గజపతినగరంలో విశ్వబ్రాహ్మణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో వైద్య ఉద్యోగులు ధర్నా, మున్సిపల్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో సమైక్యవాదులు సముద్రంలో పడవలపై నిరసన చేపట్టారు. ఏయూలో దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)ను శనివారం ముట్టడించారు. ఈ నెల 10లోగా జీసీఏస్, రిఫైనరీ, గెయిల్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకపోతే 11న మూడింటినీ ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉప్పలగుప్తంలో మేకలు, గొర్రెలతో రాస్తారోకో చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకం కలిగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారంతా ట్యాంక్ దిగి వచ్చారు. ఏపీఎన్జీవోలకు సంఘీభావంగా పలుచోట్ల బంద్ నిర్వహించారు. విజయవాడలో దుర్గ గుడి ఉద్యోగులు శాంతి హోమం నిర్వహించారు. పొక్లెయిన్ యజమానులు మానవహారం నిర్మించారు. గెజిటెడ్ అధికారులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రోడ్లపై వంటవార్పు నిర్వహించారు. మంగళగిరిలో రిలేదీక్షలు చేస్తున్న పద్మశాలీ సంఘాలకు పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఉద్యోగులు, న్యాయవాదులు, సాక్షర భారత్ కోఆర్డినేటర్లు గుండ్లకమ్మ నదిలో నిలబడి నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాలలో న్యాయవాదులు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఉలవపాడులో ఆర్యవైశ్య సంఘం ర్యాలీ చేపట్టింది. సింగరాయకొండలో యూటీఎఫ్ ర్యాలీ, మానవహారం జరిగాయి. సమరయోధుడి దీక్ష భగ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాళెంలో స్వాతంత్య్ర సమరయోధుడు అంకయ్య చౌదరి చేపట్టిన ఆమరణదీక్షను శనివారం పోలీసులు భగ్నం చేశారు. చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగుతల్లికి పాలాభిషేకం చేశారు. పలమనేరులో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్డుపై పాఠాలు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో డీసీఎంస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోట నరసింహారావు, బీకోడూరు మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణదీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. హైదరాబాద్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా రాజంపేట, జమ్మలమడుగులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉరితాళ్లు వేసుకుని నిరసన అనంతపురంలో లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో దళిత గర్జన హోరెత్తింది. రొద్దంలో వృద్ధులు రిలే దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా ఎస్కేయూలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన పొదుపు లక్ష్మీ గ్రూపు మహిళలు రాస్తారోకో చేశారు. ఎమ్మిగనూరులో సకల జనుల సింహగర్జనను విశేష స్పందన లభించింది. కాగా, సమైక్య సభకు సీమాంధ్ర ఉద్యోగులు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేయడం వంటి దృశ్యాలను టీవీల్లో చూస్తూ ఉద్వేగానికి గురై శనివారం గుండెపోటుతో ఆరుగురు మరణించారు. -
తైక్వాండో ‘గ్రాండ్ చాంప్’ యూనిక్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో యూనిక్ అకాడమీ సత్తా చాటింది. అత్యధిక పతకాలు సాధించి ‘గ్రాండ్ చాంపియన్‌షిప్’ను సొంతం చేసుకుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ పురుషుల విభాగంలో సాయి బ్రహ్మ (బాంటమ్ వెయిట్), గౌతమ్ (ఫెదర్ వెయిట్), విక్రమాదిత్య (లైట్ వెయిట్), ప్రశాంత్ కుమార్ (వెల్టర్ వెయిట్), భరత్ (మిడిల్ వెయిట్)లు వివిధ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో సుభాషిణి (ఫెదర్ వెయిట్)కి పసిడి పతకం లభించగా... సంగీత మౌర్య (ఫెదర్ వెయిట్)కు రజతం దక్కింది. జూనియర్ బాలికల హెవీ వెయిట్లో శ్రీలేఖ స్వర్ణం సాధించింది. ఇతర విభాగాల ఫలితాలు సబ్ జూనియర్ బాలురు: హర్ష (స్వర్ణం), ఫాల్గుణ రెడ్డి (స్వర్ణం), అరవింద్ (స్వర్ణం), అజయ్ కుమార్ (స్వర్ణం), సాయి వరుణ్ (స్వర్ణం), విమల్ (రజతం), ఆశ్రయ్ రెడ్డి (కాంస్యం), ఉదయ్ (కాంస్యం). బాలికలు: సంప్రీతి (స్వర్ణం), తేజస్విని (స్వర్ణం), అశితా చౌదరి (కాంస్యం), మీరా (కాంస్యం).