breaking news
Kurdistan
-
మనిషిని నిలువెల్లా కాల్చేసే తెల్ల భాస్వరం
బాంబుల వర్షం, గ్రెనేడ్ల దాడులు, క్షిపణి ప్రయోగాలు.. రసాయన దాడులు ఏ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వచ్చినా వీటి గురించే మనం వింటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా తెల్ల భాస్వరంతో (వైట్ ఫాస్పరస్) దాడులు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్నాయి. మనిషిని నిలువెల్లా కాల్చేసే ఈ తెల్ల భాస్వరం అంటే ఏమిటి? దాడుల్లో దీన్ని వినియోగించడంతో మానవాళికి వచ్చే ముప్పేంటి ? ఉత్తర సిరియాలో కుర్దులపై టర్కీ చేస్తున్న ఏకపక్ష దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి. స్వతంత్ర కుర్దిస్తాన్ కోసం వీరు చేస్తున్న పోరాటానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా హఠాత్తుగా తమ బలగాల్ని ఉపసంహరించింది. దీంతో రెచ్చిపోయిన టర్కీ సేనలు ఉత్తర సిరియాలో సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్‌పై గత కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాయపడిన వారిని పరీక్షిస్తే వెల్లడైన నిజాలు అంతర్జాతీయ సమాజం తెల్లబోయేలా చేస్తున్నాయి. తెల్ల భాస్వరం అంటే.. తెల్ల భాస్వరం ఒక రసాయనం. దీనికి స్వతహాగా మండే గుణం ఉంటుంది. చర్మాన్ని, బట్టల్ని, ఇంధనాన్ని, మారణాయుధాల్ని మండించగలదు. దీని నుంచి దట్టమైన పొగ కూడా వ్యాపిస్తుంది. గ్రెనేడ్లు, లాంచర్లు, మోర్టార్లు వంటి ఆయుధాల్లో పేలుడు కోసం దీనిని వాడతారు. కదన రంగంలో సైనికుల కదలికలు ప్రత్యర్థులకు కనిపించకుండా పొగ వ్యాపించడం కోసం కూడా తెల్ల భాస్వరంతో తయారు చేసిన పొగ బాంబుల్ని విసురుతుంటారు. ఇవాళ రేపు ఎన్నో దేశాలు దాడుల సమయంలో ఈ తరహా రసాయన దాడులకు దిగుతున్నాయి. టర్కీ కూడా ఇప్పుడు నేరుగా కుర్దులపై తెల్ల భాస్వరంతో రసాయన దాడులు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. టర్కీ దాడుల్లో కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన బాధితుల్ని చూస్తూ ఉంటే మనసు పిండేస్తోంది. మనుషులపై పడే ప్రభావం తెల్ల భాస్వరం రసాయన దాడులు ప్రాణాంతకమైనవి. మూడు రకాలుగా ఇది మనిషి ప్రాణాలు తోడేస్తుంది. శరీరంలో కణజాలాన్ని కాల్చి మనిషిని ఒక మాంసం ముద్దగా మార్చేస్తుంది. ఇక దీని నుంచి వెలువడే దట్టమైన తెల్లని పొగ పీల్చడం వల్ల శరీరంలో ఊపిరితిత్తుల వ్యవస్థ సర్వనాశనమై ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నోటి నుంచి శరీరంలోకి వెళ్లినా కిడ్నీ, కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నుంచి వచ్చే ఆవిరి కొన్నేళ్లు పీలిస్తే దవడలన్నీ వాచిపోయి నోరు తెరవడానికి వీలు కాదు. దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గతంలో ఎప్పుడు వాడారు ? 19వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా అమెరికా, ఐర్లాండ్‌కు చెందిన తిరుగుబాటు జాతీయ సంస్థ , ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్హుడ్గా పిలిచే ఫెనియన్ పోరాటదారులు తెల్ల భాస్వరంతో బాంబులు చేసి వాడారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ తర్వాత కొరియా, వియత్రాం యుద్ధాల్లో కూడా దీనిని వినియోగించారు. 1988లో సద్దాం హుస్సేన్‌ను నిర్బంధించడానికి అమెరికా చేసిన దాడుల్లో తెల్ల భాస్వరం వినియోగించారు. మళ్లీ ఇన్నేళ్లకు టర్కీ తెల్ల భాస్వరం బాంబులతో కుర్దుల స్థావరాలపై దాడులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. టర్కీ దీనిని ఖండిస్తున్నప్పటికీ క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం కాలిన గాయాలకు తెల్లభాస్వరమే కారణమని తేల్చి చెబుతున్నారు అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయ్! జెనీవా ఒప్పందంలోని ప్రోటోకాల్ త్రీలో ఆర్టికల్ 1 ప్రకారం రసాయన ప్రక్రియ ద్వారా మంటలు రేగే గుణం కలిగే ఆయుధాలతో దాడి జరపడం నిషిద్ధం. అయితే తెల్ల భాస్వరంతో తయారయ్యే రసాయన ఆయుధాలు ఆ నిషిద్ధ జాబితాలో లేవు. అంతే కాకుండా సైనిక స్థావరాలను లక్ష్యంగా జరిపే దాడుల్లో తెల్ల భాస్వరం ప్రయోగం నిషేధంపైన అంతర్జాతీయంగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే 1993 నుంచి రసాయ ఆయుధాల తయారీ, సరఫరా వంటి వాటిపై అంతర్జాతీయ సమాజం నిషేధం విధించింది. మనుషులపైనా, పౌరులు నివసించే ప్రాంతాలపైనా రసాయన దాడులు జరపకూడదని తీర్మానించింది. -
బర్త్ డే: కేక్ తీసి సింహం ముఖానికి కొట్టాడు
అతను ఓ సింహాన్ని పెంచుకున్నాడు. ఆ సింహానికి పుట్టినరోజు చేయాలనుకున్నాడు. అందుకోసం స్నేహితులను కూడా పిలిచాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత మూర్ఖంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న సింహమే కదా? దాని పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ తాను తెచ్చిన కేక్‌ను సింహం ముఖానికి కేసి కొట్టాడు. దాంతో ఆ సింహం అదిరిపదింది. ముఖానికి అంటిన కేక్‌ను దులుపుకుంటూ.. అసహనంగా కదిలింది. పెంపుడు సింహం ఇలా ఇబ్బంది పడుతుంటే.. సదరు యజమాని, అతని స్నేహితులు మాత్రం ఇదేదో వినోదమైనట్టు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్దీస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దంటూ జంతుప్రేమికులు ఒకవైపు ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం ఇలా మూర్ఖంగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల పట్ల జాలి చూపండ్రా అంటూ.. సదరు కుర్దీస్తానీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
'అత్యాచారాలకు ఆనవాళ్లు'
ఇస్లామిక్ రాజ్యం స్థాపన లక్ష్యంగా ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సభ్యులు సాగిస్తున్న లైంగిక అకృత్యాలు నివ్వెరపరుస్తున్నాయి. బాలికలు, మహిళలను లైంగిక బానిసలుగా చేసుకుని వారు చేస్తున్న దారుణాలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ కామాంధులకు చేతికి చిక్కి నరకయాతన అనుభవిస్తున్న ఏ యువతి వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఇజ్ది తెగకు చెందిన మయత్(ఇది ఆమె అసలు పేరు కాదు) అనే 17 ఏళ్ల యువతిని సింజార్ ప్రాంతం నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించారు. కిడ్నాపర్ల కన్నుగప్పి ఆమె తన బాధను ఫోన్ లో వెళ్లబోసుకుంది. తాను పేరు మాత్రం రాయొద్దని దీనంగా వేడుకుంది. తన పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరుతో సిగ్గుతో చచ్చిపోతున్నానని చెప్పింది. ఇప్పటికిప్పుడే చనిపోవాలని ఉన్నా మళ్లీ తన తల్లిదండ్రులను కలుసుకుంటానన్న ఏకైక ఆశే తనను బతికిస్తోందని తెలిపింది. ఆ అభాగ్యురాలి ఆమె మాటల్లోనే.... '40 మంది మహిళలు, బాలికలను తీవ్రవాదులు ఇక్కడికి ఎత్తుకొచ్చారు. వారి వయసు 12 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. మా పట్ల వాళ్లు ప్రవర్తించే తీరు చెప్పడానికి నోరు రావడం లేదు. ఆ నరకయాతనను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఓ ఇంట్లో బంధించి సాయుధులను కాపలా పెట్టారు. ఈ ఇంట్లో ఉన్న మూడు గదులు నరకానికి నకళ్లు, అత్యాచారాలకు ఆనవాళ్లు. మమ్మల్ని బానిసలుగా చూస్తారు. కిమ్మనకుండా మానాన్ని రోజుకో మగాడికి అర్పించుకోవాల్సివుంటుంది. ప్రతిఘటిస్తే బెదిరిస్తారు. ఒక్కోసారి కొడతారు. ఇలాంటప్పుడు ప్రాణాలు పోతే పీడ వదులుతుందని అనుకుంటాం. కాని పిరికిపందలు.. మేము ఎదుర్కొంటున్న నరకాన్ని తప్పించే ధైర్యం ఎవడికీ లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం- ఇప్పటికే నా దేహాన్ని చంపేశారు. ఇప్పుడు నా ఆత్మను హత్యచేస్తున్నారు' అంటూ మయత్ ముగిసించింది.