breaking news
KU jac
-
సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతులు.. అడ్డగింతలు
సాక్షి నెట్వర్క్/ వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను ఆదివారమే ముం దస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నగరవ్యాప్తంగా బారికేడ్లు ఏర్పాటుచేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సీఎం వస్తుండగా.. సుబేదారి ప్రాంతంలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం వద్ద కాకతీయవర్శిటీ విద్యార్థి నాయకులు కాన్వాయ్కి అడ్డుపడ్డారు. ‘సీఎం కేసీఆర్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డు తప్పించి అరెస్టు చేశారు. తమ భూమికి పట్టా పాస్‌బుక్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ వరంగల్ కొత్తవాడకు చెందిన వృద్ధ దంపతులు గాదెం ఓదెమ్మ, కట్టయ్య సెంట్రల్ జైల్ పెట్రోల్ బంకు ముందు అత్మహత్య యత్నానికి సిద్ధపడ్డారు. రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి చేదు అనుభవం సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు కాకతీయ వర్సిటీ క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ సర్క్యూట్ హౌజ్ వరకు వచ్చారు. తర్వాత ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు కేసీఆర్ రాగా.. అక్కడికి కూడా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. మనస్తాపానికి గురైన ఆయన కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా కారణాల దృష్ట్యా ఇబ్బంది కలగకూడదని నడిచి వెళ్లానని సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. -
సీఎం వ్యాఖ్యలపై ఓరుగల్లులో ఆగ్రహ జ్వాల
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఓరుగల్లు రగిలింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన గళం వినిపించారు. సీఎం రాజీనామా చేయూలని, లేనిపక్షంలో కేంద్రం స్పందించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు సెంటర్లలో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. కిరణ్... తెలంగాణ వ్యతిరేకిగా మారారని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలను ఇప్పటికైనా మానుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడెక్కడ.. ఎలా.. కేయూ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రెండో గేటు వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్, డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. విద్యార్థుల నిరసనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేయూ జంక్షన్ వద్ద యువజన, ప్రజాసంఘా లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశాయి. హన్మకొండ అమరవీరుల స్థూపంవద్ద బీసీ జేఏసీ నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో వినూత్న నిరసన తెలిపారు. కిరణ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చెట్టుకు ఊరితీశారు. వరంగల్ పోచమ్మమైదాన్ , కురవి, నర్సింహులపేట, పాలకుర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, పరకాల, గీసుగొండ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు మండల కేంద్రాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, బోడ డిన్నా, చాగంటి రమేష్, కిషన్, దామోదర్, లంక రాజగోపాల్, సైదిరెడ్డి, తిరునహరి శేషు, కేయూ జేఏసీ, టీజేఏసీ, బీసీ జేఏసీ, టీఎస్‌జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం తెలంగాణపై కుట్రలను ఆపకుంటే మరోసారి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధం. ఇప్పటికైనా అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలి. సీఎం లాంటివారు కుట్రలు చేస్తే సహించేదిలేదు. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలి. మంత్రులు స్పందించి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలవాలి. ఇప్పటికే టీజేఏసీ ఈ అంశంపై చర్చించింది. ఒకటి, రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశముంది. - ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీ జేఏసీ చైర్మన్