Konda Laxman Telangana University of Horticulture
-
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885 -
ఉద్యాన పరిశోధనలు పెరగాలి
సాక్షి, సిద్దిపేట: ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన కోర్సులు ఎంచుకుంటుండటం సంతోషకరమని.. ఔషధ పంటలపైనా పరిశోధనలు విస్తృతం కావాల్సి ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు కూడా భాగమని గవర్నర్ పేర్కొన్నారు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి వ్యవసాయ రంగానికి ఉద్యాన విభాగం మూలస్తంభం లాంటిదని గవర్నర్ పేర్కొన్నారు. పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకున్నారని, అప్పట్లో జీవనశైలి వ్యాధులైన బీపీ, మధుమేహం వంటివి లేవని గుర్తు చేశారు. ‘‘తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అదే తెలుగు నేలపై పాలిష్డ్ రైస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. కోవిడ్ సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత ఏమిటో చూశాం. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉపయోగపడే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన పట్టభద్రులు నిరంతరం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని గవర్నర్ తమిళిసై చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మంచి ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచాలి పర్యావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికతల భాగస్వామ్యం అవసరమని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) ఆనంద్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. మార్కెట్ ఉన్న పంటలు సాగు చేయడం, కోత అనంతర నష్టాలను తగ్గించడంతోపాటు రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీనోమ్ ఎడిటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ నీరజ ప్రభాకర్ వర్సిటీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను, జరిగిన పరిశోధనలను వివరించారు. దేశంలోనే మొదటి మహిళా వీసీగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 11 మందికి గోల్డ్ మెడల్స్ స్నాతకోత్సవం సందర్భంగా 11 మంది విద్యార్థులకు గవర్నర్ తమిళిసై బంగారు పతకాలను అందించారు. పి.సాయి సుప్రియ మూడు మెడల్స్, ఎద్దుల గాయత్రి మూడు మెడల్స్, సంధ్యారాణి, స్నేహప్రియ, మిట్టపల్లి కిశోర్, హరిక, తేజస్విని ఒక్కో గోల్డ్ మెడల్ అందుకున్నారు. మొత్తంగా 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పీజీ, 17 పీహెచ్డీ పట్టాలను అందజేశారు. నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించా.. మాది జగిత్యాల జిల్లా. ఉద్యాన కళాశాలలో 2018–2020 ఎమ్మెస్సీ (వెజిటబుల్స్) చేశాను. 92.9 శాతం మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. ప్రస్తుతం అగ్రికల్చర్ ఆఫీసర్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. యూజీలో ఒకటి, ఇప్పుడు మూడు.. మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇదే స్ఫూర్తితో పీహెచ్డీ పూర్తి చేస్తాను. – పి.సాయి సుప్రియ, పీజీ విద్యార్థిని చంటి బిడ్డలతో వచ్చి పీహెచ్డీ పట్టా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కె.దివ్య పీహెచ్డీ పూర్తిచేసి శుక్రవారం పట్టా అందుకుంది. మూడు నెలల కవల పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్నాతకోత్సవానికి వచ్చారు. పట్టా అందుకుని రాగానే పిల్లలను దగ్గరికి తీసుకుని, ఆనందంతో మురిసిపోయింది. -
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రతాప్ గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేయడం వల్ల ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు ఇస్తూ లేఖ పంపిందన్నారు. వర్సిటీలో ప్రస్తుతం వంద సీట్లు ఉండగా 2016-17 సంవత్సరానికి అదనంగా 50 సీట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఉద్యానవర్సిటీలో ఈ సంవత్సరానికి ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు 150 బీఎస్సీ హార్టికల్చర్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ ఆఫీసర్లు (హెచోఓ), హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(హెచ్‌ఈవో) ఉద్యోగాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్ జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు.