'హేమను తెలిసిన వారే చంపేశారు'
ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్‌ను ఎవరో ఆమెకు బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని ఆమె తల్లి బీనా మనుభాయ్ హిరాని (72) అభిప్రాయపడ్డారు. హత్యకు గురవడానికి ముందురోజు తన కూతురు హేమ ఫోన్ చేసి.. తెలిసిన వారిని కలవడానికి వెళుతున్నాను, మర్నాడు మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిందన్నారు. అయితే కూతురి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న తనకు ఆమె మరణవార్త తెలిసిందని బీనా మనుభాయ్ వాపోయారు.
హేమ మృతివార్తను తాను నమ్మలేకుండా ఉన్నానని, తన ఆరోగ్యం పట్ల హేమ ఎంతో శ్రద్ధ తీసుకునేదని బీనా తెలిపారు. హేమ భర్త చింతన్ గానీ, ఆమెతో కలిసి పనిచేసిన విద్యాధర్ రాజ్‌భర్ గానీ హత్యకు పాల్పడినట్లు నమ్మకంగా చెప్పలేనంది. అయితే తన కూతుర్ని హత్య చేసినవారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించబడాలని ఆమె డిమాండ్‌చేశారు. హేమా, చింతన్ల మధ్య సుదీర్ఘ కాలంగా విభేదాలున్నాయని తెలిపింది. అయితే ఆ విభేదాలు తన కూతురు హత్యకు కారణం అవుతాయని ఊహించలేదని బీనా తెలిపిపారు.