breaking news
kirandul
-
రైలు పట్టాలపై జారిపడిన కొండ చరియలు
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్ వద్ద) కొండ చరియలు జారిపడటంతో ఓహెచ్సీ విద్యుత్ స్తంభం, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్లో రెండోలైన్‌కు సంబంధించిన పనులు జరుగుతుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 82వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. దీంతో ఓహెచ్సీ విద్యుత్‌లైన్ స్తంభం విరిగిపడింది. పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్ పాసింజర్ రైలును కొంతసేపు బొర్రా రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం బయలుదేరింది. ఈ కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. మంగళవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్, అదే రోజు విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైళ్ల రద్దు చేశారు. సోమవారం రాత్రి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. -
విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్ కోచ్
సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు. దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్ సుందరీకరణ చేపడతామని వాల్తేర్ డివిజన్ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
అరకు అందాలు 'డబ్లింగ్'
రైల్లో అరకు ప్రయాణం.. ఓ అందమైన అనుభవం. కొండలెక్కుతూ.. గుహల్లోంచి సాగిపోతూ.. ఒంపులు తిరిగి ప్రయాణించే కిరండూల్ పాసింజర్ ఎన్నో అనుభూతుల కలబోత. అయితే కేకే లైన్లో రోజుకు ఒక్క రైలే తిరుగుతుంది. ఆ రైలు మిస్సయితే మళ్లీ మర్నాడు ఉదయం వరకు ఆగాల్సిందే. ఐదు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైల్లో వివిధ పనుల మీద విశాఖ వచ్చే ప్రయాణికులూ ఎక్కువే. ఈ లైన్ మీదుగా సాగే రవాణాయే ప్రధాన ఆదాయ వనరన్న సంగతి తెలిసిందే. అందుకే మరిన్ని రైళ్లు తిరిగేందుకు వీలుగా మరో లైన్ నిర్మించాలన్నది చిరకాల డిమాండ్. ఈ కలను నిజం చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ రెండో రైల్వే లైన్‌కు ఆమోదముద్ర వేసింది. కేకే రైల్వే మార్గంలో రెండో లైన్ వేసేందుకు ఆమోదం పెరగనున్న రవాణా సదుపాయం.. పర్యాటకానికి ఊతం విస్టాడూమ్ బోగీ వచ్చే మార్చిలో.. విశాఖపట్నం : కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు వెళ్లే రైలు.. వచ్చే రైలు మాత్రమే ప్రయాణించే ఈ మార్గంలో డబ్లింగ్ పనులకు కేంద్రం బుధవారం పచ్చజెండా ఊపడంతో రైల్వే ట్రాఫిక్ ఇకపై ఈ మార్గంలోనూ పెరగనుంది. ఇప్పుడున్న ఒకే ఒక్క ప్యాసింజర్ స్థానంలో రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు నడిపే అవకాశాలున్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం విస్టా డూమ్ బోగీని ఈ మార్గంలో నడుస్తున్న అరకు ప్యాసింజర్‌కు జత చేసేందుకు ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వే ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అధునాతన పర్యాటక బోగీ వచ్చే మార్చినాటికి రానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ బోగీ ఒక్కటే కాదు. డబ్లింగ్ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తయితే మరిన్ని రైళ్లు అరకు, కోరాపుట్, జగదల్పూర్ వరకు నడిచే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన మారుమూల గిరిజన గ్రామాల నుంచి విశాఖ వచ్చే ప్రజలకు ఈ కొత్త రైళ్లు ఎంతో ఉపయోగపడతాయి. విద్య, వైద్యం కోసం అక్కడి నుంచి వచ్చే వారెందరో ఉన్నారు. దక్షిణాదిన ప్రకృతి సౌందర్యరాశిగా ప్రఖ్యాతిగాంచిన అరకు అందాలను తనివితీరా చూడాలనుకునే రైల్వే మార్గమిది. ఎత్తయిన కొండలను చీల్చుకుంటూ...కొండ గుహల్లోంచి దుముకుతూ... కాల్వలు, సెలయేళ్లు, నదులను అమాంతంగా దాటేస్తూ... పిల్ల పర్వతాల నుంచి తల్లి పర్వతాల మీదకు ఎగబాకుతూ చూపరులను కట్టి పడేసే దృశ్యాలతో ఈ మార్గం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాధారణంగా 100 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే రైళ్లు చేరుకుంటుంటే ఈ మార్గంలో మాత్రం నాలుగు గంటలైనా ప్రయాణికులు ఏ మాత్రం విసుగు చెందరు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులోంచి ప్రయాణించే ఈ రైలులోంచి అంతా ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ప్రకృతి ప్రేమికులు కెమెరా పట్టుకుని, సెల్ఫోన్లో సెల్ఫీలు దిగుతూ గుహల్లోంచి రైలు దూసుకుపోయే ప్రతిసారీ అరుపులతో సందడి చేస్తుంటారు. ఈ రైల్వే మార్గాన్ని 1974-76 మధ్య కాలంలో ప్రారంభించారు. అరకు అందాలను రైల్లోంచే చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఈ రైల్వే లైన్ బంగారు బాతు కొత్తవలస-కిరండూల్ రైల్వే లైన్ అంటే తూర్పు కోస్తా రైల్వేకి బంగారు బాతులాంటిది. పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఏటా రూ. 5 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఈ మార్గం అంటే భారతీయ రైల్వేకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్యాసింజర్ రైలు ఒక్కటే రోజుకు రాకపోకలు సాగిస్తుంది. మిగిలిన రోజంతా ఈ మార్గంలో సరకు రవాణా రైళ్లే తిరుగుతుంటాయి. దాదాపు 463 కిలోమీటర్ల మేర సింగిల్ ట్రాక్‌తోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న ఈ మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రైల్వే ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఒకే ట్రాక్ కావడంతో ఈ సమస్య ఉంది. అందుకే ఎప్పటి నుంచో డబ్లింగ్ చేయాలని వాల్తేరు రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ నివేదికలకు మోక్షం కలిగింది. డబ్లింగ్‌కు రూ.7,178 కోట్లు కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గాన్ని (కేకే లైన్) డబ్లింగ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ బుధవారం ఆమోదముద్ర వేసింది. గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ రైల్వే లైన్ ఆధునికీకరణకు ఆర్థిక వ్యవహారాల మంత్రి త్వ శాఖ పచ్చజెండా ఊపడంతో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మార్గం డబ్లింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ రైల్వే మార్గం ఆధునికీకరణకు రూ.7,178.40 కోట్ల మొత్తా న్ని కేంద్రం ప్రకటించింది. కిరండూల్-జగదల్పూర్ మధ్య కొన్ని కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు పూర్తయిన నేపథ్యంలో జగదల్పూర్ నుంచి కొత్తవలస మధ్య నూతన రైల్వే మార్గాన్ని అదనంగా నిర్మించాల్సి ఉంది. దాదాపు 463 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఒక్క ప్యాసింజర్ రైలు (1వీకే/2వీకే) రోజుకు నడుస్తుండగా సరకు రవాణా రైళ్లు మా త్రం 12 వరకు నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ మార్గం ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు రవాణా చేస్తుంటాయి. వచ్చే ఏడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేకే లైన్ విశేషాలు జగదల్పూర్-కోరాపుట్ మధ్య 110 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించడానికి రూ.1,839 కోట్లు కేటాయించారు. ఈ మార్గం పూర్తిగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే ఉంది. ఐరన్ ఓర్, బొగ్గు రవాణా ప్రధాన ఆదాయ మార్గం. కోరాపుట్-సింగపూర్ మధ్య 164 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి రూ.2,361 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని కోరాపుట్, రాయగడ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మార్గంలో మినరల్స్ అండ్ మైన్స్ ఎగుమతికి అవకాశాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. కోరాపుట్-కొత్తవలస మధ్య 189 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 2977 కోట్లు కేటాయించారు. ఈ మార్గం నిర్మించడం వల్ల ఒడిశాలోని కోరాపుట్ జిల్లాతోపాటు ఆంధ్రాలోని విజయనగరం, విశాఖ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పడుతుందని, అందుకు 12, 13 ఆర్థిక ప్రణాళికల నుంచి నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.