breaking news
Khalifa Hazrat Umar
-
నాలుగు ఫిర్యాదులు
ఖలీఫా ఉమర్ (రజి) పరిపాలనా కాలమది. అరబ్బు సామ్రాజ్యంలోని ఒక ప్రాంతానికి సయీద్ ఆమిర్‌ను గవర్నర్‌గా నియమించారాయన. కొన్ని నెలల తరువాత గవర్నర్ల పాలనా తీరును పరిశీలించే క్రమంలో ఖలీఫా ఉమర్ (రజి) సయీద్ ఆమిర్ (రజి) ప్రాంతానికి వెళ్లారు. ఖలీఫా తనిఖీ చేయడానికి వచ్చారని తెలిసి ప్రజలంతా మస్జిదులో హాజరయ్యారు. ఖలీఫా... పక్కనే ఉన్న గవర్నర్ సయీద్ బిన్ ఆమిర్ గురించి ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని ప్రజలనుద్దేశించి అడిగారు. కొంతమంది కలగజేసుకుని గవర్నర్ గురించి నాలుగు ఫిర్యాదులు చేశారు. ‘‘గవర్నర్ గారు ఫజర్ నమాజు తరువాత కలవరు’’ అన్న ఫిర్యాదుకు సంజాయిషీ ఇవ్వమని కోరారు. అందుకు సయీద్ బిన్ ఆమిర్ ‘‘అయ్యా, మా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంటి పనులన్నీ నేనే స్వయంగా చేయాలి. ఉదయాన్నే నమాజు తరువాత ఇల్లు ఊడ్చి, అంట్లు కడిగి, రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేస్తున్నాను. మంచానికే పరిమితమైన నా భార్య అవసరాలు తీరుస్తున్నాను. బట్టలు ఉతుకుతున్నాను. ఇంటిపనులన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ వేళలో ప్రజలకోసం సమయం కేటాయించలేకపోతున్నాను. నౌకరును పెట్టుకునేంత స్థోమత నాకు లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘వారంలో ఒకరోజు ప్రజలను కలవరు’ అన్నది మరో ఫిర్యాదు. దానికి సయీద్ బిన్ ఆమిర్ ‘‘ఈ విషయం నేనెంతో రహస్యంగా ఉంచదలుచుకున్నాను. ప్రజలు మీముందు ఫిర్యాదు చేశారు కాబట్టి చెప్పక తప్పడం లేదు. నాకున్నది ఒకే ఒక్క జత బట్టలు. వాటిని వారానికోసారి ఉతికి ఆరేస్తాను. అవి ఆరేదాకా నా భార్య బట్టలు తొడుక్కుంటాను. అందుకే వారంలో ఒకరోజు బయటికి రాను’ అని చెప్పారు. ‘నువ్వు రాత్రుళ్లు ఎవ్వరినీ కలవవు’ అన్నది మూడో ఫిర్యాదు. ‘‘నా తల వెంట్రుకలు, గెడ్డం అన్నీ నెరసిపోయాయి. ప్రభువు పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు. నా పాపాల చిట్టా చాంతాడంత ఉంది. పగలంతా ప్రజాసేవలో గడపడం మూలాన దైవారాధనకు తీరిక దొరకడం లేదు కాబట్టి రాత్రుళ్లు అల్లాహ్ ఆరాధనలో లీనమవుతాను’ అని చెప్పాడు. ‘ఒక్కోసారి స్పృహతప్పి పడిపోతాడు’ అన్నది నాలుగో ఫిర్యాదు‘నేను నలభై ఏళ్ల వయస్సులో కలిమా చదివి విశ్వాసినయ్యాను. నలభై ఏళ్ల వరకూ నేను చేసిన పాపాలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్పృహ తప్పిపడిపోతున్నాను. ప్రళయం రోజు నా పాపాల గురించి అల్లాహ్ నిలదీస్తే నేనేం జవాబు చెప్పాలన్నదే నా భయమంతా. నాకోసం ప్రార్థించండి’’ అని అన్నాడు. అలాగే, ‘ఖలీఫా గారూ ఈ నాలుగు ఫిర్యాదులకు మీరేం శిక్ష వేసినా నేను భరించేందుకు సిద్ధమే’ అని చెప్పాడు. ‘‘ఓ అల్లాహ్ ఇలాంటి మరింతమంది గవర్నర్లను నాకివ్వు’’ అంటూ రోదిస్తూ ఖలీఫా ఉమర్ తన రెండు చేతుల్ని పైకెత్తి అల్లాహ్‌ను వేడుకున్నారు. – ముహమ్మద్ ముజాహిద్ -
బీదరాలికి పురుడుపోసిన మహారాణి
ఇస్లాం వెలుగు రేయింబవళ్ళు ప్రజాసంక్షేమం కోసమే పరితపించిన పాలకుల్లో ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) అగ్రగణ్యులు. చక్రవర్తిగా రాజ్యంలో ఏమూల ఏం జరుగుతోందో ఇంట్లోనే కూర్చొని తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఖలీఫా ఉమర్ ఒకరిమీద ఆధారపడలేదు. మారువేషంలో రాజ్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం, ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు అలవాటు. ఒకసారి ఖలీఫా హ.ఉమర్ మారువేషం ధరించి వివిధప్రాంతాలను సందర్శిస్తూ ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. ఊరి చివరన విసిరేసినట్లున్న ఓ ఇంట్లో గుడ్డిదీపం మిణుకుమిణుకుమంటోంది. ఖలీఫా ఉమర్ ఆ ఇంటివద్దకు చేరుకున్నారు. ఇంట్లోంచి బాధాతప్త మూలుగులు వినిపిస్తున్నాయి. ఇంటిముందు ఓవ్యక్తి దిక్కుతోచనివాడిలా నిస్సహాయంగా అటుఇటూ పచార్లుచేస్తున్నాడు. ఖలీఫా ఉమర్ కాసేపు అక్కడే నిలబడి ఇదంతా గమనించారు. అంతకంతకూ స్త్రీ మూలుగులు అధికమవుతున్నాయి. హ..ఉమర్ ఇక ఉండబట్టలేక ఆవ్యక్తిని సమీపించారు. విషయం ఏమిటని ఆరాతీశారు. అప్పుడావ్యక్తి, తన భార్య నిండునెలల గర్భిణి అని, పురుటి నొప్పులతో బాధపడుతోందని, ఇంట్లో తనూ తనభార్య తప్ప మరెవరూలేరని, ఈ అర్ధరాత్రివేళ ఏంచెయ్యాలో, ఎటువెళ్ళాలో దిక్కుతోచడం లేదని ఆవేదన, ఆందోళన చెందాడు. అంతా సావధానంగా విన్నఖలీఫా, ‘‘సరే నువ్వేమీ కంగారుపడకు, నేనిప్పుడే వచ్చేస్తాను’’ అంటూ ఆఘమేఘాలపై ఇంటికి చేరుకున్నారు. శ్రీమతికి విషయమంతా వివరించారు. వెంటనే మహారాణి కాన్పుకు కావలసిన అన్ని వస్తువులూ సర్దుకొని భర్తవెంట బయలుదేరారు. కొద్దిసేపట్లోనే భార్యాభర్తలు ఆ ఇంటికి చేరుకున్నారు. ఖలీఫా సతీమణి తానొక చక్రవర్తి భార్యనన్న ఆలోచనే లేకుండా, కేవలం సాటి మహిళగా ఆమెకు అన్నివిధాలా సపర్యలూ చేశారు. మంత్రసాని అవతారమెత్తి ఆ బీదరాలికి పురుడు పోశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సుఖప్రసవం జరిగింది. మహారాణి పురుడుపోసే పనిలో ఉంటే, ఖలీఫా పొయ్యి రాజెయ్యడం, నీళ్ళు వేడిచేయడం లాంటి సహాయక పనుల్లో పాలుపంచుకున్నారు. అంతలో లోపలినుండి, ‘మహారాజా! మీ మిత్రుడికి పండంటి మగబిడ్డ కలిగాడు’ అంటూ శుభవార్త అందజేశారు మహారాణి. కొడుకు పుట్టాడన్న సంతోషంతోపాటు, ‘మహరాజా’ అని తమకు సహాయం చేస్తున్న వ్యక్తిని సంబోధించడంతో అతడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆవ్యక్తి తన చెవుల్ని తానేlనమ్మలేకపొయ్యాడు. అంటే ఇప్పటివరకూ తమకు సపర్యలు చేసింది, తనభార్యకు పురుడుపోసింది స్వయంగా ఖలీఫా దంపతులని తెలియడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పొయ్యాయి. కృతజ్ఞతాభావంతో హృదయం పులకించిపోయింది.ఈ విధంగా ఆనాటి పాలకులు ఇలాంటి ఆదర్శాలను నెలకొల్పి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొయ్యారు. ఇలాంటి అనేక సుగుణాలరీత్యానే జాతిపిత మహాత్మాగాంధీ ఖలీఫా ఉమర్‌ని ‘ఉమర్ ది గ్రేట్’ అని సంబోధించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్