పీజీ పాఠ్యాంశంగా ‘రాత్రి సూర్యుడు’
రాయదుర్గం అర్బన్: రాయదుర్గం పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ కెరె జగదీష్ రాసిన ‘రాత్రిసూర్యుడు’ దీర్ఘకావ్యాన్ని పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేశామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ జి.నరసింహన్, బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు చైర్మన్ ప్రొఫెసర్ జి.బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు వీరు కెరె జగదీష్‌కు లేఖ పంపారు. అంధుల జీవితాలపై రచించిన ‘రాత్రిసూర్యుడు’ దీర్ఘకావ్యాన్ని ఎంఏ తెలుగు మూడవ సెమిస్టర్ నాల్గవ పేపర్లో (ఆధునిక సాహిత్యం)పాఠ్యాంశంగా ఉంచినట్లు తెలిపారు. పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంచడంపై ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, సాహితీ స్రవంతి రాయదుర్గం శాఖ కన్వీనర్ జి.శివకుమార్, సాహితీ మిత్రులు డాక్టర్ శాంతినారాయణ, డాక్టర్ రాధేయ, జూపల్లి ప్రేమ్‌చంద్, మల్లెల నరసింహమూర్తి, వి.వెంకటేశులు తదితరులు తమ హర్షం వ్యక్తం చేశారు.