'రెండున్నరేళ్లకే బాయ్ ఫ్రెండ్ లొల్లి'
లండన్: పిల్లల పెంపకం విషయంలో రోజుకో కొత్త సమస్య ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మున్ముందు రోజుల్లో తమ పిల్లలతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇప్పటికే రోజంతా బిజీగా గడుపుతూ సాయంత్రంలోగా తలపట్టుకునే వారికి మరింత తలపోటు తప్పదేమో. ఎందుకంటే సాయంత్రం ఇంటికొచ్చేసరికి నాన్నా నాకు ఇది తెచ్చావా.. అది తెచ్చావా అనే తమ పిల్లలు.. చెక్లెట్, ఐసీక్రీం, బెలూన్, టాయ్స్ కావాలి అని డిమాండ్ చేస్తుంటారు. ఇలాంటి డిమాండ్లు అయితే పెద్ద సమస్య ఉండకపోవచ్చుగానీ, ఏకంగా బాయ్ ఫ్రెండ్ కావాలని కోరితే.. అది కూడా రెండున్నారేళ్ల కూతురు ఈ రకమైన డిమాండ్ చేస్తే..
సరిగ్గా ఇదే అనుభవం కాలేబ్ అనే తండ్రికి ఎదురైంది. అమెరికాలో కెన్నెడీ కిర్క్లాండ్ అనే రెండున్నారేళ్ల పసిపాపాయి.. తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని డిమాండ్ చేసింది. అది కూడా కొత్తగా తీసుకురావాలని కాదు. తాను ఇప్పటికే చూసుకున్నానని, అతడి పేరు జేర్డ్ అని, అతడినే ఫైనల్ చేయాలని. దీంతో అవాక్కయిన కాలేబ్ తేరుకుని ఘాటుగా ఆ పాపను మందలించాడు. ఈ క్రమంలో వాడివేడి మాటలు కూడా ఆ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగాయి. అసలు విషయం ఏమిటంటే..
కెన్నడీ మేనమామకు జేర్డ్ రూమ్ మేట్. అతడు మంచి ఫుట్ బాల్ ప్లేయర్. పోటీల్లో ఆడుతున్న సమయంలో కెన్నడీ మామ, కెన్నడీ తల్లి చెలిసా కలిసి వెళ్లి చూసేవాళ్లు.. అలా ఆట చూస్తుండగా మధ్యలో ఓ సారి ఇక నుంచి నా బాయ్ ఫ్రెండ్ జేర్డ్ అని చెప్పింది. అప్పుడు వారు నవ్వుకుంటూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ ఆలోచనను మనసులోనే ఉంచుకున్న చిట్టిపాప ఓ రోజు తండ్రి దగ్గరకు వెళ్లి తనకు జేర్డ్ బాయ్ ఫ్రెండ్ అని అతడు కావాలని మారాం చేసింది.
తొలుత నువ్వు చిన్నపిల్లవని, ఇప్పుడే బాయ్ ఫ్రెండ్‌కు అనుమతించడం కుదరదని సర్దిచెప్పేయత్నం చేశాడు. దీంతో బుంగమూతి పెట్టుకున్న కెన్నడీ వెంటనే ఏడుపు అందుకుంది. జేర్డ్ కావాలని ఏడ్చింది. దీంతో కోప్పడిన తండ్రి నీకు బాయ్ ఫ్రెండ్ లేడు ఏమిలేడు పో దెబ్బలు పడతాయ్ అంటూ గదమాయించాడు. దీంతో ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పగా ఆమె పకపకా నవ్వేస్తూ కూతురును ఒడిలోకి తీసుకుంది. ఈ సందర్భంగా ఫేస్బుక్ వారి సరదా విషయాలు పోస్ట్ చేస్తూ సాధారణంగా ఏ తల్లిదండ్రులకైనా కూతుర్ల నుంచి బాయ్ ఫ్రెండ్ పోరు తప్పదని తమకు మాత్రం ఇప్పుడే ఆ పోరు మొదలైందంటూ పోస్ట్ చేసింది.