breaking news
Kenichiro Yomura
-
దీపావళికల్లా డాట్సన్ గో ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ నిస్సాన్ మోటార్ భారత మార్కెట్లో తన బ్రాండ్‌ను సుస్థిరపరచాలని కృతనిశ్చయంతో ఉంది. నంబర్లు(మార్కెట్ వాటా) ముఖ్యం కాదని కంపెనీ స్పష్టం చేస్తోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ విస్తృతం చేయడం ద్వారా కస్టమర్ల మది దోచుకుంటామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా చెబుతున్నారు. మోటార్ రేసింగ్ ప్రతిభను గుర్తించడానికి నిస్సాన్ ప్లే స్టేషన్ జీటీ అకాడమీ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. నిస్సాన్ కొత్త మోడళ్లు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలు.. ఇటీవల ప్రవేశపెట్టిన నిస్సాన్ డాట్సన్ గో మోడల్‌కు స్పందన ఎలా ఉంది? నెల రోజుల క్రితమే భారత్‌లో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విడుదల చేశాం. స్పందన అనూహ్యంగా ఉంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తొలిసారిగా కారు కొనేవారు 40 శాతం మంది ఉంటారు. వీరికి ఈ మోడల్ కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే రూ.3.12 లక్షల (ఎక్స్‌షోరూం) ధర నుంచి ఇది లభించడమే. అంతేకాదు మైలేజీ లీటరుకు 20.63 ఇస్తుంది. ఇప్పటికే 3,500 కార్లను విక్రయించాం. మార్కెట్ వాటా పెరిగేందుకు డాట్సన్ దోహదం చేస్తుంది కూడా. సంస్థ అమ్మకాల్లో డాట్సన్ వాటా 2016కల్లా 50 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం. కొత్త మోడళ్లు ఏమేం తేబోతున్నారు? దేశంలో బి సెగ్మెంట్(చిన్న కార్లు), కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(సీఎస్యూవీ) విభాగానికి మంచి డిమాండ్ ఉంది. మా ఫోకస్ కూడా వీటిపై పెట్టాం. మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) డాట్సన్ గో ప్లస్ మోడల్‌ను దీపావళి నాటికి భారత మార్కెట్లోకి తేనున్నాం. డాట్సన్ ప్లాట్‌ఫాంపై మూడో మోడల్ 2015లో రానుంది. కాన్సెప్ట్ మోడల్ అయిన డాట్సన్ రెడీ గో రావడానికి రెండేళ్లకుపైగా సమయం తీసుకుంటుంది. మార్కెట్ అవకాశాలనుబట్టి క్రాస్ ఓవర్ ఎస్యూవీ ‘మురానో’ ప్రవేశపెడతాం. జూలైకల్లా కొత్త సన్నీ సెడాన్, డిసెంబర్‌లోగా రీడిజైన్ చేసిన ఎవాలియా రాబోతున్నాయి. భారత్‌లో నిస్సాన్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? మార్కెట్లో వృద్ధి ఆశిస్తున్నారా? 2012-13లో దేశీయంగా 36,975 కార్లను విక్రయించాం. గత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 38,217కు చేరింది. ప్రస్తుతం మా వాటా 2 శాతం లోపే. 2017కల్లా 10 శాతానికి చేరుకోవాలని భావించినప్పటికీ లక్ష్యానికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఇక 2013-14లో 1.2 లక్షల కార్లను ఎగుమతి చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక లక్షకుపైగా ఉండొచ్చు. రెనాల్ట్, నిస్సాన్ భాగస్వామ్యంలోని చెన్నై ప్లాంటులో సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 4 లక్షల నుంచి 4.8 లక్షల కార్లకు ఈ ఏడాదే పెంచుతున్నాం. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ వృద్ధి బాటన పయ నిస్తుంది. ఈ సంవత్సరం పరిశ్రమ 5 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. బ్రాండెడ్ యూజ్డ్ కార్ల మార్కెట్లోకి వచ్చే ఆలోచన ఉందా? భారత్ వంటి దేశాల్లో సెకండ్ హ్యాండ్ కార్లకూ గిరాకీ ఎక్కువ. కొత్తగా అమ్ముడవుతున్న కార్లతో పోలిస్తే సగం వాటా వీటిదే. భవిష్యత్తులో ఈ విభాగంలోకి రానున్నాం. డీలర్లకు మంచి ప్రయోజనం కలుగుతుంది. మాస్టర్ ఫ్రాంచైజీ అయిన హోవర్ ఆటోమోటివ్‌తో పంపిణీ ఒప్పందం రద్దు అయింది. మేమే నేరుగా డీలర్లతో లావాదేవీలు నెరుపుతున్నాం. మాస్టర్ ఫ్రాంచైజీకి చెల్లిస్తున్న మొత్తాన్ని ఇక నుంచి ప్రకటనలకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు వెచ్చిస్తాం. కస్టమర్ల తీరు ఎలా ఉంది? తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న కారును కస్టమర్లు కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. భారతీయ కస్టమర్లు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. కారు చక్కగా అందంగా ఉండాలంటారు. మైలేజీ ఎక్కువగా రావాలంటారు. కారు లోపల ఎక్కువ స్థలం ఉండాలని చూస్తారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ నిస్సాన్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం డీలర్ల సంఖ్య 130 ఉంది. మార్చికల్లా 200లకు పెంచుతాం. -
2016-17 నాటికి 10% వాటా లక్ష్యంయం : కెనిచిరో యోమురా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనరంగ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా 2016-17 నాటికి ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కంపెనీకి ప్రస్తుతం 1-2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కార్ల మార్కెట్ మందగమనంలో ఉన్నా, ఎన్నికల తర్వాత పుంజుకుంటుందని నిస్సాన్ భారత కార్యకలాపాల ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా సోమవారం తెలిపారు. కార్ల కంపెనీలకు దేశంలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి నాగో ల్లో లక్ష్మీ నిస్సాన్ 3ఎస్ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వినూత్న మోడళ్లతో కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు. 2012-13లో దేశీయంగా 37,000 కార్లు విక్రయించామని, ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డాట్సన్ గో.. గ్రూపు కంపెనీ డాట్సన్ తయారీ ‘గో’ మోడల్ కారును నిస్సాన్ 2014 తొలి నాళ్లలో దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ధర రూ.4 లక్షలలోపే ఉంటుంది. కంపెనీ నుంచి ప్రస్తుతం మైక్రా యాక్టివ్ ఒక్కటే రూ.4 లక్షల లోపు ధర ఉంది. ఎస్యూవీ కాష్కై కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఏటా 1 లక్ష కార్లను ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తామని లక్ష్మి నిస్సాన్ డెరైక్టర్ కె.జైరామ్ ఈ సందర్భంగా తెలిపారు.