breaking news
kapra pond
-
గుర్రపు డెక్కతో సేంద్రియ ఎరువు!
సరస్సులు, చెరువులు, సాగు నీటి కాలువల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్కతో చక్కని సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతిని హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ(ఐ.ఐ.సి.టి.) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ టెక్నాలజీతో తొట్టతొలిగా హైదరాబాద్‌లోని కాప్రా చెరువులో నుంచి తొలగించిన గుర్రపు డెక్క మొక్కలతో సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఖాన్ ఎనర్జీ సంస్థ సఫలీకృతమైంది. గుర్రపు డెక్క మొక్క మురుగు నీటిలో నుంచి విషపూరిత పదార్థాలను గ్రహిస్తుంది. అయితే, ఇది చెరువు మొత్తాన్నీ ఆక్రమించెయ్యడం వల్ల నీటి నాణ్యతకు, జలచరాల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ నేపధ్యంలో ఈ సమస్యాత్మక మొక్కలను పునర్వినియోగించడంపై ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. నీటిలోని విషపూరిత పదార్థాలను గుర్రపుడెక్క మొక్క తన వేర్లలోనే నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి, ఈ వేర్లతో తయారు చేసిన సేంద్రియ ఎరువు కేవలం పూల మొక్కలకు వాడుకోవాలి. అదేవిధంగా, గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులతో తయారు చేసే సేంద్రియ ఎరువును అధికాదాయాన్నిచ్చే కూరగాయలు, ఉద్యాన పంటలకు వాడుకోవచ్చని ఖాన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధి కె. లక్ష్మీనారాయణ(93923 75756) ‘సాక్షి’కి తెలిపారు. గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులను సేకరించి ముక్కలు చేసి.. ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు తయారు చేసిన బాక్టీరియల్ కల్చర్, పేడ కలిపి 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువుగా మారుతుంది. భారతీయ ఎరువుల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సేంద్రియ ఎరువులో సాధారణ వర్మీకంపోస్టులో కన్నా అనేక రెట్లు ఎక్కువగా పోషకాలున్నాయని ఆయన తెలిపారు. ఫాస్ఫేటు తప్ప ఇతర పోషకాలన్నీ ఉన్నాయన్నారు. పది కిలోలు వర్మీ కంపోస్టుకు బదులు ఈ ఎరువును కిలో వాడితే సరిపోతుందని, సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉందన్నారు. దుర్వాసన ఉండదని, తయారైన ఎరువు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందన్నారు. కిలో ఎరువు తయారీకి రూ. 18 వరకు ఖర్చయిందని, కిలో రూ. 25 చొప్పున విక్రయించనున్నామని తెలిపారు. బస్తాల్లోకి నింపే ముందు ఆరబెట్టిన కంపోస్టు –కంచికట్ల శ్రీనివాస్, సాక్షి, ఉప్పల్ -
అధికారుల ఉదాసీన వైఖరిపై హైకోర్టు అసంతృప్తి
- తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై మండిపాటు - 17న చెరువులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని తమ రిజిస్ట్రార్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చెరువుల దురాక్రమణలు, వాటి సరిహద్దుల ఖరారు విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. మేడ్చల్ జిల్లా, కాప్రా పరిధిలోని ఊర చెరువు (కాప్రా చెరువు) యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఆక్రమణలను తొలగించాలని తాము ఆదేశాలు జారీ చేసినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు తమ రిజిస్ట్రార్‌నే రంగంలోకి దింపింది. ఆక్రమణదారులతో అధికారులు కుమ్మక్కయ్యారన్న పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో, చెరువు ఆక్రమణలను గుర్తించి, దాని పూర్తిస్థాయి నీటి మట్టం నిర్ధారించే బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు అప్పగించింది. ఊర చెరువు బఫర్ జోన్లో జరిగిన నిర్మాణాల వివరాలను తమ ముందుంచాలంది. ఈ నెల 17న స్వయంగా ఊర చెరువును సందర్శించి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కాప్రా చెరువులో వ్యక్తి మృతదేహం
కుషాయిగూడ: హైదరాబాద్ శివార్లలో ఉన్న కాప్రా చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం బయటపడింది. మృతదేహం బాగా దెబ్బతిన్న స్థితిలో ఉండడంతో దానిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.