breaking news
Kanya shulkam
-
'లగ్గసరి'.. కన్యాశుల్కం ఇవ్వాల్సిందే మరి
కర్నూలు (రాజ్‌విహార్): కన్యాశుల్కం.. పెళ్లి సమయంలో వధువుకు వరుడిచ్చే కట్నం. నేటి ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం కనుమరుగైనప్పటికీ.. బుడగ జంగాల్లో మాత్రం నేటికీ కొనసాగుతోంది. ఓలీగా పిలిచే ఈ ఆచారం ప్రకారం.. వివాహం నిశ్చమయ్యాక వరుడు రూ.9 ఎదురు కట్నం (కన్యాశుల్కం)గా సమర్పించుకోవాల్సిందే. ఇందులో రూ.4 వధువుకు, మిగిలిన రూ.5 భవిష్యత్‌లో సమస్య వస్తే పరిష్కరించే ఐదుగురు కుల పెద్దలకు ఇస్తారు. భార్తాభర్తల మధ్య స్పర్థలు వస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్లరు. విడిపోవాలనే నిర్ణయానికి వస్తే కోర్టుకు వెళ్లి భరణం అడగరు. కుల పెద్దల ఎదుట పంచాయితీ పెట్టి సమస్య పరిష్కరించుకుంటారు. భార్య నుంచి భర్త.. భర్త నుంచి భార్య కూడా విడాకులు కోరవచ్చు. విడాకులు పొందాక ఏడు పెళ్లిళ్ల వరకు చేసుకునే ఆచారం వీరిలో ఉంది. విడిపోవాల్సి వస్తే భార్యాభర్త, కులపెద్ద, అమ్మాయి తల్లి సమీపంలోని చెట్టు చాటుకు వెళ్తారు. భర్త మొహంపై భార్య ఊసిన తరువాత పావలా (స్తోమతను బట్టి ఎంత మొత్తమైనా) భార్య చీర కొంగులో కట్టి ఎడమ చేత్తో తాళిని తెంచేస్తాడు. దీంతో విడాకులు (విడుదాంబూలం) పొందినట్టే. ఆధునిక కాలంలోనూ అదే జీవనశైలి నేటి ఆధునిక కాలంలోనూ బుడగ జంగాలు అక్షరాస్యతకు దూరంగా ఆచారాలు, కట్టుబాట్లతో జీవనం సాగిస్తున్నారు. ఊరూరా తిరిగే సంచారజాతికి చెందిన వీరు ఊరి బయట గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. పూర్వం బుర్రకథలు, ఎల్లమ్మ, బాలనాగమ్మ, అరేవాండ్ల, చిన్నమ్మ, దేశంగిరాజు కథలు చెబుతుండేవారు. బుర్రకథలకు కాలం చెల్లడంతో కాళ్లకు గజ్జెకట్టి తంబుర, గుమ్మెట వాయిస్తూ ‘వినరా భారత వీర రాజకుమారా.. బొబ్బిలి రాజు కథ’ అంటూ పాటలు పాడుతూ యాచనతో జీవనం సాగిస్తున్నారు. పండుగలు, జాతరలు, తిరునాళ్లలో వివిధ వేషధారణలతో అలరిస్తున్నారు. కొందరు మాత్రం ఈతాకు చాపలు అల్లడం, పాత బట్టలు, బుడగలు, పిన్నీసులు, ప్లాస్టిక్ బిందెలు విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు. కుల ధ్రువీకరణకు నోచుకోక.. రాష్ట్రంలో 65 వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. రాయలసీమలో 45 వేల కుటుంబాలు ఉండగా.. ఒక్క కర్నూలు జిల్లాలో 27,500 కుటుంబాల వరకు ఉన్నాయి. సంచార జాతికి చెందిన వీరికి 2010 వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ సవరణ చట్టం–2002 అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో మాత్రమే బుడగ జంగాలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో బుడగ జంగాలు లేరంటూ అప్పట్లో జీవో–144 విడుదల చేయడంతో ఏపీలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఆగిపోయింది. దీంతో వీరంతా ఓసీలుగా మిగిలిపోయారు. జగనన్న చేయూత బుడగ జంగాల సమస్యను గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం వీరి సంక్షేమానికి ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. కుల ధ్రువీకరణ స్థానంలో వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని ‘జగనన్న చేయూత’ పథకాన్ని వర్తింప చేస్తోంది. 45 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఏటా రూ.18,750 చొప్పున అందజేస్తోంది. చంద్రబాబు మోసం చేశారు షెడ్యూల్డ్ కులాల జాబితాలో బుడగ/బేడలను ఎస్సీలుగా గుర్తించినా.. ఏపీలో మాత్రం గుర్తించడం లేదు. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా మోసం చేశారు. జేసీ శర్మ కమిషన్ నివేదికను కేంద్రానికి పంపి, కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించి ఆదుకోవాలి. – తూర్పాటి మనోహర్, అధ్యక్షుడు,రాష్ట్ర బుడగ జంగం సంక్షేమ సంఘం కుల ధ్రువీకరణ ఉంటే అభివృద్ధి నేను వెటర్నరీ డిప్లొమా చేశా. కుల ధ్రువీకరణ లేక ఉన్నత విద్య, ఉద్యోగాలకు పోటీ పడలేకపోతున్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తే అక్షరాస్యత పెరిగి, మా కులంలో మూఢ నమ్మకాలు తగ్గి అభివృద్ధి చెందుతాం. – కె.రాజు, ఆర్కే దుద్యాల, కర్నూలు జిల్లా -
తెలుగు సాహిత్యంలో మౌలికత లేదా?
సెప్టెంబర్ 19న ‘పద్మభూషణ్’ బోయి భీమన్న జయంతి మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం. బోయి భీమన్న 19 సెప్టెంబర్ 1911 16 డిసెంబర్ 2005 తెలుగు సాహిత్యంలో మౌలికత లేదా? నిజంగా లేదేమో! ఉంటే ఏదీ? ఎక్కడా కనిపించదేం? ఎక్కడ దాక్కుంది? నన్నయగారి ఐతిహాసిక యుగం నుంచి పెద్దనగారి ప్రబంధం వరకు అన్నీ తత్సమాలు. కృష్ణశాస్త్రిగారి భావకవితాయుగం నుంచి శ్రీశ్రీగారి అభ్యుదయ కవితాయుగం వరకు ఆంగ్ల తద్భవాలు, అన్యదేశ్యాలు. మరి మనదని మురిసిపోగల మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం. సాహిత్యానికి ప్రధాన గుణమైన సర్వజనీనత కన్యాశుల్కంలో లేదు. మరి బ్రహ్మంగారు, వేమన, కవిరాజు, జాషువా వంటి పేర్లు సాహితీరంగ రింగుమాస్టర్లకు పనికిరావు. ఆ పేర్లవాళ్ళు పంక్తిబాహ్యులైన శూద్రులూ వర్ణబాహ్యులైన హరిజనులూను! మరి చెప్పండి? ఎంకి పాటలున్నై అయితే అవి నాయుడుబావతో ముడిపడి వున్నై. నాయుడు పంక్తిబాహ్యుడు కాడా? ‘కందం వ్రాసినవాడే కవి, తినుచున్న అన్నమే తినుచుంటిమిన్నాళ్ళు, వయస్సుమళ్ళిన సోమరులారా చావండి, తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’ ఇటువంటి పాక్షిక ప్రగతినిరోధక, మత్తుమందు మాత్రలను ప్రజలకు తినిపించడం వల్లనే మౌలికసాహిత్యం ముందుకు రాలేకపోతున్నదన్న వాస్తవాన్ని ఎవరైనా గుర్తించారా. మౌలికసాహిత్యానికి వుండవలసిన ప్రధానగుణం సమకాలీనత. సమకాలీనత లేని రచన ఎంత గొప్పదైనా, అది సాహిత్యమనిపించుకోదు. వేద పురాణాలు, రామాయణ మహాభారతాలు ఆనాటి జీవిత సరళికి కళాత్మక చిత్రణలు. అందుకే వాటికి కాలదోషం లేదు. ఏ కాలంలో ఏ దేశంలో ఏ భాషలో వెలువడినప్పటికీ అవి అన్నికాలాలకు అన్నిదేశాలకు అన్నిభాషలకు చెందినవే అవుతాయి. అట్టి విశ్వసాహిత్యాన్ని ఎవరైనా ఎప్పుడైనా తమభాషలోకి అనువదించుకోవచ్చు. అనువదించుకోవాలికూడ. అయితే అట్టి అనువాదాలు మౌలికసాహిత్యం కాదు. పాలేరంటే ఎవరు? యజమాని కింద బానిసలా పనిచేసే ప్రతి అస్వతంత్రుడూ పాలేరే. అట్టి ప్రతివాడూ తన బానిసతనాన్ని తొలగించడానికి నిరంతరం కృషి చేయవలిసివుంది. వాల్మీకికి రాముడు సమకాలీకుడు, వ్యాసుడికి ధర్మరాజు సమకాలీకుడు, నాకు పాలేరువెంకన్న సమకాలీకుడు. పాలేరును నిష్పాక్షిక దృష్టితో చూసేవారికి అది ఎంతో రసవంతంగా, రమణీయంగా కనిపిస్తుంది. అలా కనిపించబట్టే లక్షలాదిజనం దాన్ని అభిమానించారు. వేలకొలది ప్రదర్శనలిచ్చారు. అయితే ఈ నాటకానికి పండితలోక సన్మానాలెందుకు జరగలేదంటే పండితులు దళితవర్గాలలోని ప్రతిభను గుర్తించరు కనుక. సత్యహరిశ్చంద్ర నాటకం చూచి ఎందరు సత్యవ్రతులయ్యారో తెలియదుకానీ పాలేరు నాటకం చూచి వేలమంది పాలేళ్ళు పాలేరుతనాలు వదిలేసి పాఠశాలలో చేరడం మాత్రం వాస్తవంగా జరిగింది. నాటకప్రయోజనం అది ఏ లక్ష్యాన్ని సాధించదలచిందో దాన్ని సాధించినప్పుడే సిద్ధించినట్లు. పాలేరు నాటకలక్ష్యం సాంఘిక విప్లవం. అది సాధించబడింది. (పాలేరు నాటకానికి భీమన్న రాసుకున్న పీఠిక నుండి సంక్షిప్తంగా...) (భీమన్న సాహితీ నిధి ట్రస్టు-కవి సంధ్య నిర్వహణలో భీమన్న జయంతి సభ సెప్టెంబర్ 19న సాయంత్రం 5:30కి బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాలులో జరగనుంది.)