breaking news
kanaganapalle bye election
-
'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'
చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థ మీద తాము నమ్మకం ఉంచి.. ఇక్కడ ఏదో జరుగుతోందన్న విషయాన్ని డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్‌కు ముందుగానే చెప్పామని ఆయన అన్నారు. కానీ అసలు ఎన్నిక అన్నది జరగకుండానే ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని.. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంపీపీ ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని.. వాళ్లు తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యం చేశారని అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ తరఫున ఉన్న బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ కొట్టారని చెప్పారు. సాక్షాత్తు సీఐ కూడా లోపలే ఉండి దౌర్జన్యం చేశారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తమ జీపు ఎక్కేందుకు వస్తున్నా కూడా పోలీసులు వాళ్లను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతిచ్చిందని, కానీ మంత్రి పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టి, బలవంతంగా నెరవేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. -
'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'