breaking news
kamalananda Bharti
-
పట్టుబడకుండా ఉంటే.. ఆ బంగారం టీటీడీకి చేరేదా!?
సాక్షి, తిరుపతి : తమిళనాడులో పట్టుబడ్డ కోట్ల రూపాయలు విలువ చేసే టీటీడీ బంగారం భాగోతం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పట్టుబడ్డ బంగారానికి సంబంధించి టీటీడీ ఇంతవరకు నోరు మెదపకపోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. కమలానంద భారతీ స్వామిజీ ఆదివారం టీటీడీ ఈఓ, జేఈఓపై చేసిన ఘాటు విమర్శలు కూడా అనుమానాలను బలపరుస్తున్నాయి. తమిళనాడులో పట్టుబడ్డ బంగారం టీటీడీదా? ఎవరైనా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని బంగారాన్ని సక్రమం చేశారా? అన్నది ఇప్పుడు తిరుమల, తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో ఎన్నికల ముందు రోజు అంటే బుధవారం రాత్రి రూ.400 కోట్లకు పైగా విలువచేసే 1,381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ బంగారం టీటీడీకి చెందినదని ప్రకటించారు. అన్ని కోట్లు విలువచేసే బంగారం తరలించే సమయంలో ఎటువంటి భద్రత లేకుండా తీసుకురావటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా.. కమలానంద భారతీ స్వామిజీ సైతం బంగారంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ టీటీడీ ఈఓ, జేఈఓపై ఘాటు విమర్శలు చేశారు. ఆ బంగారం నిజంగా టీటీడీదే అయితే.. ఆ పెట్టెలపై టీటీడీ, బ్యాంకు సీలు ఎందుకు లేదని.. విదేశీ సీలు ఎందుకు ఉందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. హడావిడిగా ట్రెజరీకి తరలింపు కాగా, పట్టుబడ్డ బంగారం శనివారం రాత్రి తిరుపతి ట్రెజరీకి చేరింది. ఈ విషయంలోనూ ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా తిరుపతిలోని టీటీడీ ట్రెజరీకి తరలించారు. మరోవైపు.. ఒకవేళ ఆ బంగారం పట్టుబడకుండా ఉంటే అదంతా నిజంగా టీటీడీకి చేరేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. గతంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శేఖర్‌రెడ్డి వద్ద భారీ నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అటువంటి బడా బాబులు ఎవరైనా విదేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకొస్తుండగా పట్టుబడితే.. టీటీడీ బంగారం అని చెప్పారా? అని అనుమానిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని టీటీడీ పేరు చెప్పి సక్రమం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను, నగదును జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయటంపై గతంలోనే ఆరోపణలొచ్చాయి. ఇదిలా ఉంటే.. కమలానంద భారతీ స్వామీజీ టీటీడీ ఈఓ, జేఈఓలపై ఘాటైన విమర్శలు చేయడంతో ఆయనకు కొందరు టీటీడీ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో టీటీడీ ఈఓ, జేఈఓలను తప్పుబట్టటంలేదని ఆయన అరగంటలోనే మాట మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనంతటి కథ వెనుక అసలు నిజాలను బయటపెట్టాలని టీటీడీ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆ ‘బంగారం’పై సీబీఐ విచారణ
సాక్షి, అమరావతి : తమిళనాడు పోలీసుల తనిఖీల్లో పెద్దఎత్తున పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదిగా అని చెబుతున్న దాంట్లో నిజాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీబీఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలని దేవాలయ పరిరక్షణ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి డిమాండ్ చేశారు. అది చాలా పెద్ద కుంభకోణమని, ఇందులో దొంగతనం దాగి ఉందని అయన అనుమానం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించిన 1,381 కిలోల బంగారాన్ని ఒక డొక్కు వ్యానులో తరలిస్తారా? ఎన్నికల సమయంలో తనిఖీలు ఉంటాయని తెలిసీ దేవుడి బంగారాన్ని తరలిస్తూ కనీసం పోలీసు భద్రత తీసుకోకపోవడం.. అందుకు సంబంధించిన పత్రాలు కూడా దగ్గర ఉంచుకోకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. టీటీడీ బంగారాన్ని ప్రైవేట్ వ్యక్తులు మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? అంటూ ఆయనే స్వయంగా ఆదివారం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశారు. వీడియో పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.. దేవుడే పోలీసులకు పట్టించాడు రాష్ట్ర గవర్నర్ గారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గారికి.. సీఎం గారికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారికి.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ.. వెంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా పూజించుకునే భక్తులందరికీ ఒక విన్నపం. తమిళనాడులో ఒక డొక్కు వ్యాన్, అనాథ శవాలను తరలించుకుని పోయేటటువంటి ఒక వ్యానులో 1,381 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలించారు. తమిళనాడు పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే.. అందులో ఈ బంగారం బయటపడితే, ఆ తర్వాత ఈ బంగారం మాది అని టీటీడీ ప్రకటించుకుంది. ఆ తర్వాత టీటీడీ ఈవో కొన్ని కాగితాలు పంపి, ఆ బంగారం మాది అని విడిపించుకొచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. టీటీడీ నుంచి బంగారం కానీ, డబ్బులు కానీ బయటకు వెళ్లవని నాకైతే విశ్వాసం ఉంది. నేనెప్పుడూ ఎవరినీ అనలేదు. కానీ, ఇప్పుడు అనడానికి నూరు శాతం అవకాశం దొరికింది. ఒక బ్యాంకు నుంచి 1,381 కిలోల బంగారం విడుదల చేస్తే, దానిని చెన్నై నుంచి తిరుపతికి తీసుకొస్తుంటే.. దానికి పోలీసు బందోబస్తు లేదు.. దానికి సంబంధించిన పత్రాల్లేవు. బ్యాంకు వాళ్లు అక్కడ దానిని నిర్ధారించడం లేదు. టీటీడీ ఈవో కాగితాలు ఇచ్చి పంపారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసుకుపోతుంటే, టీటీడీ పేరుతో బయటేసుకుని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా? లేదా టీటీడీ బంగారాన్నే మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? దీంట్లో ఉండే నిజానిజాలను బయటకు తీయాలి. దేవుడికి చెందిన బంగారాన్ని తీసుకుపోతుంటే దేవుడే పోలీసులకు పట్టించాడు. ఎవరైనా నాశనం కావాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే వారు ఎవరైనా నాశనమైపోతారు. ఏం తమాషాలు పడుతున్నారా? ఎన్నికల నేపథ్యంలో ప్రతి దగ్గరా పోలీసు చెకింగ్ ఉందని తెలుసు. పోలీసు పహారా లేకుండా, పత్రాలు లేకుండా 1,381 కిలోల బంగారాన్ని దిక్కుమాలిన బంగారం అనుకున్నారా? వెంకటేశ్వరస్వామి దిక్కుమాలిన వారు అనుకున్నారా. ఇంత దిక్కుమాలిన, పనికిమాలిన, తెలివి తక్కువ ఈవో టీటీడీకి ఎప్పుడూ రాలే. ముందు అరెస్టుచేసి లోపల పారేయాలి! తిరుమలలో అన్ని రకాల వీఐపీ ట్రీట్మెంట్ పొందే మీడియా కూడా స్వామికి ద్రోహం జరుగుతుంటే చర్చించదా? దీనికి నూటికి నూరు శాతం ఈవో, జేఈవో సమాధానం చెప్పాలి. సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజును భరించిన పాపానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతిపరుడ్ని, ఆయన లాంటి హిందుమత వ్యతిరేకిని.. ఇతర మతాలను ప్రోత్సహించే ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం ఇది. వెంకటేశ్వరస్వామి ఏడో కన్ను, పదో కన్ను తెరిచారు.. ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు? ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1,381 కిలోల బంగారాన్ని, బయటకు తీశారో సింఘాల్ సమాధానం చెప్పాలి. దీనికి వెనుక ఖచ్చితంగా దొంగతనం ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి ద్రోహం చేసిన వారు ఎవరూ బాగుపడల. నాశనమై పోతారు పాపాత్ములారా.. నాశనమైపోతారు రా, నాశనమై పోతారు. ఒళ్లు మండిపోతోంది. వందల కోట్లు టీటీడీ డబ్బులు పందికొక్కుల్లా తింటున్నారు. ఈ టీటీడీ ఈవో, జేఈవో, దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు వీళ్లందరూ కుమ్మక్కై టీటీడీని దోచుకుతింటున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎంతమందిపై కేసులు పెడతారు. నాపై కేసులు పెట్టండి. నేను జైలుకు పోతా. పట్టుబడకుండా ఇంకెంత దేవుడి బంగారం తిన్నారో? ప్రజలూ టీటీడీ అవినీతి యంత్రాంగం మీద తిరగబడాలి. ఎక్కడికక్కడ టీటీడీ ఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేయండి. ఆ అధికారులు కడుపుకు కూడు తింటున్నారా? గడ్డి తింటున్నారా? బంగారం ఈ రోజు పట్టుబడింది.. పట్టుబడకుండా వీళ్లు ఎన్ని కిలోల బంగారాన్ని ఈ దేశాన్ని దాటించారన్నదే తేలాలి. అదే బాధ. ఎన్ని వందల కిలోల బంగారాన్ని తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు. ఇవన్నీ విచారణలో తేలాలి. ఈవోను సస్పెండ్ చేసి విచారణ జరపాలి టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై టీటీడీ అధికారులు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు వాదించడానికి లాయర్ల కోసం దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు 1,381 కిలోల బంగారం బ్యాంకు నుంచి వస్తూ పట్టుబడితే, కేసులో మొదటి ముద్దాయి ఎవరు? ఎవరిని అరెస్టు చేయాలి? దీనిపై సీబీఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా సీబీఐ విచారణ ద్వారా దీని వెనకాల ఉన్న నిజాలు నిగ్గుతేల్చాలి. సీబీఐ విచారణ కాకపోతే రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా జరిపించాలి. వెంకటేశ్వరస్వామి వారి బొక్కసానికే కన్నం వేసే ఇంటి దొంగలను ఖచ్చితంగా శిక్షించాలి. టీటీడీ ఈవోనే ఈ రోజు మనం వేలెత్తి చూపించే స్థితిలో ఇరుక్కున్నాడు. ఆయనది ఒంటెద్దు పోకడ. ఆ బంగారు ఎవరిదో నీకు తెలిసో తెలియదో.. ఆ బంగారం టీటీడీది అవునో కాదో.. టీటీడీదని చెబుతూ నువ్వు కాగితాలు ఇచ్చి పంపావు. ఆ కాగితాలు ముందు ఎందుకు చేరలేదు? పోలీసు పహారా లేకుండా ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ బంగారం ఎక్కడ ఉంది? కనీసం ఈవో వెళ్లి చూసి వచ్చాడా? తక్షణం ఈవోను సస్పెండ్ చేసి, విధుల నుంచి తప్పించి విచారణ చేయాలి. అసలు మోకాలు కాదు, అరికాలులోనైనా ఈవోకు బుర్ర ఉందా అని అడుగుతున్నాను. వీళ్లను అరెస్టు చేయాలి. టీటీడీలో ఉండే అధికారులు, రాజకీయ నాయకులు తమాషా పడుతున్నారు. వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా.. ఒళ్లు మండిపోతోంది. వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా నేను. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. మరలా హిందూ సమాజం రోడ్లపైకి వస్తోంది. తమాషాలు చేస్తున్నారేమో. తిరుపతిలో కూర్చునేది. పెత్తనం చేసేది.. వందల, వేల కోట్లు సంపాదించుకునేది. ఏం తమాషానా? అందుకే చెబుతున్నా.. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం, ఏపీ ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి. ఓం నమో వెంకటేశాయా.. -
‘టీటీడీ చరిత్రలో ఇంత అసమర్ధుడైన ఈఓను చూడలేదు’
సాక్షి, తిరుమల : శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే బ్యాంకు నుండి తీసుకొచ్చారని స్వామి కమలానంద భారతి మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో సింఘాల్ లాంటి అసమర్ధుడైన ఈఓను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. తిరుమల జేఈవో శ్రీనివాస రాజు హిందూ మత వ్యతిరేకి అని, అవినీతి పరుడని నిప్పులు చెరిగారు. 400 కోట్ల రూపాయల బంగారం స్కాంలో ప్రధాన పాత్రదారులైన టీటీడీ ఈఓ, జేఈఓలను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. బంగారం స్కాంపై సీబీఐతో లేదా న్యాయమూర్తులతో కానీ విచారణ జరిపించాలన్నారు. -
తిరుమల పవిత్రతకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్ల తరబడి ఆలయాల్లో సంప్రదాయంగా కొనసాగుతున్న అనువంశిక వ్యవస్థలను కాపాడుకునేందుకు వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. తిరుమల తిరుపతిలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆలయాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యాన్ని నివారించాలంటూ హైదరాబాద్‌లో వారు సమావేశమయ్యారు. మీడియాకు దూరంగా ఉదయం నుండి సాయంత్రం వరకూ సుదీర్ఘంగా చర్చించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి స్వామీజీతో పాటు పీఠాధిపతులు ప్రణవాత్మానంద సరస్వతి , మాతా నిర్మలా యోగి భారతి, స్వరూపానందగిరి, చిన్మయానందగిరి , స్థైర్యానంద సరస్వతి , విద్యా గణేషానందస్వామీజీలు పాల్గొన్నారు. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రాంత కార్యదర్శి గాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం
కోరుట్లటౌన్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు కమలానంద భారతీస్వామి అన్నారు. కోరుట్లలో ఈనెల 30న భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్ర పోస్టర్‌ను ఆదివారం స్థానిక మహాదేవస్వామి ఆలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీరామునిచరిత్ర, హనుమాన్దీక్ష విశిష్టతను వివరించారు. ఆలయ అధ్యక్షుడు గెల్లె గంగాధర్, మంచాల జగన్, గట్ల శివ, అర్చకులు పాలెపు వెంకటరమణశర్మ, కార్తీక భరధ్వాజశర్మ, గెల్లె శ్రీనివాస్, నరేందర్, నరేశ్, రోహిత్ పాల్గొన్నారు. -
ఖర్చు తప్ప ఆధ్యాత్మిక భావన ఏదీ?
పుష్కరాల ఏర్పాట్లపై కమలానంద భారతి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు గుమ్మరించినా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను నింపలేకపోయిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. పుష్కరాల ఏర్పాట్లంటూ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆలయాలను కూల్చడం ప్రభావం చూపుతోందని, మున్ముందు ఇదే ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా కమలానంద భారతి, బీజేపీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ బుచ్చిరాజు తదితరులతో కలసి మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించినట్టు పీఠం బుధవారం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు పడిన ఇక్కట్లను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలా మంది ఈసారి ఘాట్లకు రావడానికి వెనుకాడుతున్నారని కమలానంద పేర్కొన్నారు.