breaking news
kalvakurthi Project
-
వానాకాలానికి కల్వకుర్తి పనులు పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ వచ్చే వానాకాలానికి పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం ఇక్కడ జలసౌధలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి పనులను ఆయన సమీక్షించారు. నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దనరెడ్డి ఇటీవల జరిపిన జల విజయయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను మంత్రి పరిశీలించా రు. 60కి పైగా వచ్చిన ఈ విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2016–17 లో మొత్తం కల్వకుర్తి కింద 280 చెరువులను నింపగా, ఈ ఏడాది 350 చెరువులను నింపినట్టు అధికారులు తెలిపారు. ఇందులో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 120 చెరువులు ఉన్నట్లు చెప్పారు. కల్వకుర్తి కింద మొత్తం ఆయకట్టు 4.25 లక్షల ఎకరాలు ఉండగా.. గతేడాది 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది యాసంగిలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసినట్టు చెప్పారు. ప్యాకేజీ–29, 30ల్లో మిగిలిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు వానాకాలానికి పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయని ఏజెన్సీని తొలగించి వేరే ఏజెన్సీతో పనులు చేయించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సీఈ కె.రావు, ఎస్ఈ భద్రయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి పనులు: మల్లు
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేసి, తామే కల్వకుర్తి ప్రాజె క్టును తెచ్చినట్లు టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ భవ న్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెట్టెంపాడు, కోయల్ సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు నిధులిస్తే పనులు పూర్తవు తాయని వివరించారు. రైతుల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుంటే.. రైతులకు వ్యతి రేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించడం హాస్యా స్పదంగా ఉందన్నారు. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ అనవసరం!
- కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం అనవసరమని కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనను తిప్పికొట్టింది. నదీ జలాల వినియోగంలో ఎక్కడా, ఎలాంటి చట్టాల ఉల్లంఘనలకు తాము పాల్పడలేదని... తమకున్న వాటాలను వాడుకునేలా మాత్రమే ప్రాజెక్టులను చేపట్టామని వివరించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు లేఖలు రాశారు. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. కేంద్ర జల సంఘం, బోర్డుల అనుమతి లేకుండానే కృష్ణా, గోదావరి నదులపై 200 టీఎంసీల నీటిని వాడుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని కేంద్ర జల వనరుల శాఖ, బోర్డులకు గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జీ-5 బేసిన్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో కలిపి కాళేశ్వరం, జీ-9 బేసిన్లో తమ్మిడిహెట్టి, జీ-7 బేసిన్లో ఛనాకా-కొరట, పింపార్డ్, రాజాపేట, జీ-9లో తుపాకులగూడెం, జీ-10లో సీతారామ ప్రాజెక్టులను చేపడుతున్నారని.. కృష్ణాలోని కే-7 బేసిన్లో పాలమూరు, డిండి లతోపాటు కల్వకుర్తి ప్రాజెక్టు నీటి వినియోగాన్ని పెంచారని అందులో పేర్కొంది. ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, అప్పటి వరకూ ఆయా ప్రాజెక్టుల పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం, బోర్డులు అభిప్రాయం చెప్పాల్సిందిగా వారం కింద తెలంగాణకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులపై వివరణ ఇస్తూ ప్రభుత్వం లేఖలు రాసింది. ఏపీ ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. గోదావరిలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 954.23 టీఎంసీల మేరకే నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని తెలిపింది. ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు’కు కేటాయించిన 23.76 టీఎంసీల నీటిని సైతం గోదావరిలో పారిశ్రామిక, గృహ అవసరాల కోసం కేటాయించిన 66.24 టీఎంసీల్లోంచే వాడుకుంటున్నామని వివరించింది. లేఖలోని ఇతర ప్రధానాంశాలు.. - కాళేశ్వరం ఎత్తిపోతల, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమే. దీనికి సంబంధించి ఉమ్మడి ఏపీలో 2008లో ఇచ్చిన జీవో నం.238 ప్రకారమే నడుచుకుంటూ... వెనుకబడిన ఏడు జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించాలని నిర్ణయించాం. - ఉమ్మడి ఏపీలో చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను సమీకృతం చేసి సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టాం. రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ సహాయ నిరాకరణ చేయడంతోనే సమీకృతం చేయాల్సి వచ్చింది. - పెన్‌గంగ దిగువన చేపడుతున్న ఛనాకా-కొరట, పింపార్డ్, రాజాపేట బ్యారేజీల నిర్మాణం సంయుక్తంగా చేపట్టాలని 2013 జూలైలోనే ఒప్పందాలు జరిగాయి. ఆ ప్రక్రియే ప్రస్తుతం ముందుకెళుతోంది. - తుపాకులగూడెంను ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో కంతనపల్లికి బదులుగా చేపడుతున్నాం. రాష్ట్రానికి ఉన్న గోదావరి జలాల వాటా మేరకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నాం. - పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు, కల్వకుర్తి సామర్థ్యం పెంపు అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ కేసులో ఏపీ సైతం ప్రతివాదిగా ఉంది. అందువల్ల వాటిపై ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు.