గరిమెళ్ల భావజాలాన్ని యువతకు అందించాలి
శ్రీకాకుళం కల్చరల్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు, జాతీయ కవి, గరిమెళ్ల సత్యనారాయణ భావజాలం నేటి యువతకు చేరాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విశాఖ ఏ కాలనీలోని కథానిలయంలో శ్రీకాకుళ సాహితీ ఆధ్వర్యంలో గరిమెళ్ల జయంతిని పురస్కరించుకొని ‘గరిమెళ్ల సాహిత్యం–జీవితం’పై చర్చా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ అధ్యక్షుడు బీవీఏ రామారావు నాయుడు మాట్లాడుతూ తన గళంతో బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించారన్నారు. ఆయన సాహిత్యాన్ని సేకరించి పదిలం చేసినట్టు తెలిపారు. గరిమెళ్ల స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో గ్రంథాలయాన్ని ఆయన పేరున ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాసాహితీ నాగరాజు మాట్లాడుతూ గరిమెళ్ల సాహిత్యం యువత తప్పక చదవాలని కోరారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు, ప్రదాన ఆదినారాయణ, అధికార్ల నీలకంఠం, కేవీ జగన్నాథరావు, బుసకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.