ఆమెను సజీవంగా దహనం చేశారు!
ఆమెను ఇంటిపై నుంచి కిందకు తోసేశారు. రాళ్లతో కొట్టారు. నడివీధులో కారుతో తొక్కించారు. నిప్పుపెట్టి నిలువునా తగులబెట్టారు. ఆ తర్వాత బొగ్గులా మారిన ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి కాబూల్ నదిలో పారేశారు. గత గురువారం జరిగిన ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. సామాజిక వెబ్సైట్లలో అప్లోడ్ చేసి ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. కళ్లముందే ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. అక్కడే ఉన్న పోలీసులు కూడా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. ఈ పాపం చేసిందీ ఎవరో కాదు అఫ్ఘాన్ ప్రజలు. వాళ్లను రాక్షసులను చేసింది ‘మాబ్ సైకాలజీ’.
ఇస్లామిక్ మతానికి చెందిన ఆమె పేరు 27 ఏళ్ల ఫర్ఖుంద. ఇస్లామిక్ స్టడీస్‌లో పట్టభద్రురాలు. టీచరుగా పనిచేస్తోంది. ఖురాన్ పట్ల ఆమెకు ఎంతో గౌరవం. రోజుకు ఐదుసార్లు నిష్టగా నమాజ్ చేయడం అమెకు అలవాటు. మరి ఆమె చేసిన పాపం ఏమిటి? తాయెత్తుల పేరిట పేదలను దోచుకుంటున్న ఓ స్థానిక వివాదాస్పద ముస్లిం గురువును పట్టుకొని నిలదీయడం. ఆందుకు ఆగ్రహించిన ఆ గురువు ‘పవిత్ర గ్రంధం ఖురాన్’ను తగలబెట్టిందంటూ ఆమెపై దుష్ర్పచారం చేశాడు. అంతే ‘ఇదిగో పాము అంటే అదిగో తోక’ అనే మాబ్ సైకాలజీని వంటబట్టించుకున్న ప్రజలు వివేచనకు తావివ్వకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు. నాగాలాండ్‌లో కూడా ఇటీవల ఓ అమాయకుడిని రేపిస్టు అనగానే వెనుకాముందూ ఆలోచించని వారు వీధుల్లోకి వచ్చి కొట్టి చంపారు.
ఇప్పుడు వాస్తవం తెలిసిన అఫ్ఘాన్ మహిళ ఫర్ఖుందా పక్షాన అఫ్ఘాన్ సాలిడారిటీ పార్టీకి చెందిన మహిళలు న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో అఫ్ఘాన్ ప్రభుత్వం కదిలొచ్చి ఆ రోజు ప్రేక్షక పాత్ర వహించిన 13 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. దారుణానికి పాల్పడినవారిలో 18 మందిని అరెస్టు చేసింది. వివాదస్పద మత గురువునూ అరెస్టు చేసింది. బాధితురాలి తండ్రి, సోదరుడు నజీబుల్లా మాలిక్ జాదా పోలీసుల ముందుకు వచ్చి ఆ రోజు జరిగిన వాస్తవ సంఘటనను వివరించారు.
బాధితురాలు ఖురాన్‌ను తగులబెట్టినట్టు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని దర్యాప్తు అధికారి మొహమ్మద్ జహీర్ మీడియాకు తెలియజేశారు. పలువురు ప్రత్యక్ష సాక్షులు బాధితురాలి తరఫున పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో దోషులకు శిక్షపడవచ్చు. అనవసర ఆగ్రహావేశాల వల్ల ఓ నిండుప్రాణం పోయిందికదా! సామాజిక వెబ్సైట్లలో భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ సుప్రీం కోర్టు ఐటీ చట్టంలోని వివాదాస్పదమైన 66ఏ సెక్షన్‌ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పుచెప్పింది.ఈ శుభ సందర్భంలో భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయమనే సంకల్పానికి మనం కట్టుబడాలి.