breaking news
kabban Park
-
డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం పూర్తి
రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : కబ్బన్ పార్క్ నుంచి మహాత్మాగాంధీ రోడ్ (ఎం.జీ రోడ్) వరకు నిర్మిస్తున్న మెట్రో సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారమిక్కడ మెట్రో రైలు అధికారులతో కలిసి సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో సొరంగ మార్గం నిర్మాణంలో ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ట్రాక్ వేసే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో సొరంగ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్ నుంచి బయ్యప్పన హళ్లి, మల్లేశ్వరం నుంచి పీణ్యా మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో వేలాది మంది నగరవాసులకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇక రెండో విడతలోని మెట్రో రైలు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యే హ్యారిస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకధాటిగా..........
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. బుధవారం రాత్రి ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా ఉదయం దాకా కురవడంతో రాష్ట్రంలో పలు చోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది మరణించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వాన నీటితో సహవాసం చేయాల్సి వచ్చింది. తుమకూరు జిల్లాలో అనేక చోట్ల ఇళ్లు కూలాయి. చెరువులు నిండిపోవడంతో దిగువనున్న పంటలు నీట మునిగాయి. తుమకూరులోని 75 ఏళ్ల కారాగార కట్టడం కూలిపోయింది. తురువెకెరె తాలూకాలో అపార పంట నష్టం వాటిల్లింది. అయిదిళ్లు నేల కూలాయి. గుల్బర్గ, యాదగిరి, గంగావతి తదితర చోట్ల భారీ వర్షాలు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. చిత్రదుర్గ జిల్లా హిరియూరులో గతంలో ఎన్నడూ లేని భారీ వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి ప్రారంభమైన వాన తెల్లారి వరకు కురుస్తూనే ఉండడంతో అనేక ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఫైరింజన్ సిబ్బంది ఆయా ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నగరంలో.. బెంగళూరులో బుధవారం రాత్రి నాలుగు గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు వంకలను తలపించాయి. బసవనగుడి, పద్మనాభ నగర, జయనగర సహా పలు చోట్ల చెట్ల కొమ్మలు నేలకొరిగాయి. దరిమిలా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కళ్యాణ నగర, రామూర్తి నగర, లింగరాజపురం, గోకుల్ దాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో బీబీఎంపీ సిబ్బంది రంగ ప్రవేశం చేసి తొలగించాల్సి వచ్చింది. కేజీ హళ్లి, కబ్బన్ పార్కు, హెబ్బాళ ఫ్లైవోవర్, మైసూరు ఫ్లైవోవర్ల వద్ద నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహన చోదకులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఇందిరా నగర, యశవంతపుర, కేఆర్ పురం, మైకో లేఔట్, కళ్యాణ నగర, కబ్బన్ పార్కుల్లో సైతం చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడ్డాయి. కేఆర్ పురంలో రాత్రంతా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎ.నారాయణపుర వార్డులోని పాయ్ లేఔట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇంటి నుంచి బయటకు రావడానికి స్థానికులు నరక యాతన అనుభవించాల్సి వచ్చింది. సీవీ రామన్ నగర, కస్తూరి నగర, విజనాపురల నుంచి నీరు పాయ్ లేఔట్‌కు ప్రవహిస్తుండడంతో వానలు పడినప్పుడల్లా స్థానికులు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.