breaking news
junior line man
-
యువకుడి ఉసురుతీసిన జేఎల్ఎం నిర్లక్ష్యం
పుల్లలచెరువు(ప్రకాశం): విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. ఓ కుటుంబానికి చేతికందివచ్చిన కుమారుడిని దూరం చేసింది. పుల్లలచెరువు మండలంలోని సిద్దనపాలెం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం... సిద్దనపాలెం గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాసులు (23) ఐటీఐ చదివి వినుకొండలోని ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. వినాయకచవితి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్న నారాయణ అయ్యగానిపల్లి విద్యుత్‌లైన్ పనులు చేయాల్సి ఉండగా, అదే సమయంలో గేదెలను తోలుకుని అటుగా వెళ్తున్న వెంకట శ్రీనివాసులుతో ఉన్న పరిచయం మేరకు పిలిచి స్తంభం ఎక్కించాడు. ఆ స్తంభంపై అయ్యగానిపల్లి, మానేపల్లి గ్రామాలకు వెళ్లే రెండు ఫీడర్లు ఉన్నాయి. నారాయణ సూచన మేరకు అయ్యగానిపల్లి ఫీడర్ ఎల్సీ తీసి విద్యుత్ సరఫరాను షిప్ట్ ఆపరేటర్ నిలిపివేశాడు. కానీ, మానేపల్లి ఫీడర్‌కు విద్యుత్ సరఫరా ఉంది. అయితే, స్తంభం ఎక్కిన శ్రీనివాసులు అయ్యగానిపల్లి ఫీడర్‌కు బదులు మానేపల్లి ఫీడర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై తీగలకు కరుచుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఎదిగిన కొడుకు అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాసులు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాయుడు తెలిపారు. జేఎల్ఎం నిర్లక్ష్యంపై మండల విద్యుత్ శాఖాధికారి ప్రసన్నకుమార్‌ను వివరణ కోరగా, జేఎల్ఎం నారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. -
పోస్టుకు రూ.3 లక్షలట !
వినుకొండ, న్యూస్‌లైన్: జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీతో జిల్లాలోని పలు విద్యుత్ ఉప కేంద్రాల్లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు భారీగా ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్లగా విధులు నిర్వహిస్తున్న వారికి 20 శాతం రిజర్వేషన్ ప్రకారం జేఎల్‌యం పోస్టులు దక్కడంతో జిల్లాలో సుమారు 100 వరకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇదే అదనుగా భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ వినుకొండ ప్రాంతంలో పలువురు నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వినుకొండ, మాచర్ల ప్రాంతాల్లో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి 2010లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కోర్టు ఆదేశాలతో నియామకాలకు బ్రేక్ పడింది. రెండు రోజుల క్రితం తిరిగి కోర్టు అదేశాలతో ఆ పోస్టులను భర్తీ చేశారు. జిల్లాలో సుమారు 230 మందికి జేఎల్‌యం పోస్టులు దక్కగా వీరిలో సగం మంది షిష్ట్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా ఈనెల 18న విధుల్లో చేరారు. దీంతో వినుకొండ ప్రాంతంలోని నమాజ్కుంట విద్యుత్ ఉపకేంద్రంలో-1, చీకటీగలపాలెం సబ్ స్టేషన్లో-2, రేమిడిచర్ల-1. పమిడిపాడు-1, నూజెండ్ల-2, వెల్లటూరు-1 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్‌కు నెలకు రూ. 8150ల వేతనంతో పాటు ఈపీఎఫ్ కింద రూ. 799లు చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలను ట్రాన్స్‌కో సీఎండి మార్గదర్శకాల మేర భర్తీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు తప్పని సరిగా ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి. స్తంభం ఎక్కగలగాలి. రిజర్వేషన్ ప్రకారం నియామకం ఉంటుంది. సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆరోపణలు వస్తున్నాయి... షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో వినుకొండ ప్రాంతంలో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. - ఏడీఈ విశ్వేశ్వరప్రసాదు, వినుకొండ.