breaking news
jc brothers support
-
నీ దూకుడు.. తాడిపత్రి చూడు!
సాక్షి, అనంతపురం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సత్య యేసుబాబు విధినిర్వహణలో తనదైన దూకుడు కనబరుస్తున్నారు. ఈనెల 9న విధుల్లో చేరిన ఆయన ఇప్పటి వరకు ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే వంద మందికి పైగా అసాంఘిక శక్తులను అరెస్టు చేయించారు. వీళ్లందరిపైనా గతంలో కేసులు నమోదైనా అక్కడి ‘బ్రదర్స్’ కొమ్ముకాశారు. అయితే సత్య యేసుబాబు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో అరెస్టుల పర్వం మొదలైంది. రాప్తాడు, ధర్మవరం తదితర సమస్యాత్మక ప్రాంతాలపైనా ఆయన గట్టి నిఘా సారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాడిపత్రిలో వేళ్లూనుకున్న ‘మట్కా.. పేకాట.. బెట్టింగ్’ ఎస్పీకి ఓ సవాల్ అనే చెప్పాలి. జేసీ బ్రదర్స్ కనుసన్నల్లో తాడిపత్రి నాలుగు దశాబ్దాలకు పైగా నలిగిపోయింది. ఆ ప్రాంతంలో వాళ్లు చెప్పిందే వేదం.. చెసిందే శాసనం. అలా మొదలైన కథ.. ఏ అధికారి వచ్చినా ఆ కనుసన్నల్లో మెలగాల్సిందే. పోలీసులదీ అదే దారి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి జూద గృహంగా మారిపోయింది. డీఎస్పీలు.. సీఐలు.. ఎస్ఐలు.. ఎవరు మారినా ఆ మహమ్మారికి ముకుతాడు వేయలేకపోయారు. పైగా ఆ ఊబిలో కూరుకుపోయారు. అక్కడి నేతలు ప్రజలకు కనీస అవసరాలైన మంచినీటిని అందించలేకపోయినా.. వాళ్ల అనుచరులు పేకాట, మట్కా, బెట్టింగ్‌ను మాత్రం వీధివీధికీ విస్తరించారు. ఏ స్థాయిలో అంటే.. అడ్డొస్తే పోలీసులైనా దాడులకు తెగబడేంతగా. గత ఏడాది ఓ సీఐపై మట్కా డాన్ రషీద్ దాడులకు పాల్పడినా అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతను విస్మరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసులకు వ్యతిరేకంగా, మట్కారాయుళ్లకు అండగా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇలాంటి పాలనలో పోలీసులు కూడా మౌనం దాల్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసినా.. బదిలీకి సిద్ధపడాల్సిందే. ఈ కారణంగా అసాంఘిక శక్తులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు శాఖలోని కీలక అధికారుల కొత్త వాహనాలకు నెలవారీ కంతులు, ఇతర ఖర్చులకు ఈ ముఠాలే సర్దుబాటు చేస్తుండటంతో ప్రతినెలా జూదం ‘కోట్లు’ దాటింది. జూద కేంద్రంగా తాడిపత్రి తాడిపత్రిలో పేకాట ఆడేందుకు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ రూ.లక్ష, రూ.2లక్షల బ్యాంకు ఆట కూడా జరుగుతుంది. మునిసిపాలిటీలోని పాలకవర్గం సభ్యుడు ఒకరు ఇక్కడ పేకాటక్లబ్‌లకు ఇన్చార్జి. ఇతను జేసీ బ్రదర్స్‌కు నమ్మిన బంటు. గతంలో ఇతని ఇల్లే పేకాట క్లబ్బు. తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు అధికం. అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్‌తో పాటు గెర్డావ్ స్టీల్‌ప్లాంట్ ఉంది. వీటిలో పనిచేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా సిబ్బంది వస్తుంటారు. ఆర్థికలావాదేవీలు కూడా ఎక్కువే. దీన్ని ఆసరగా చేసుకుని అక్కడి కొంతమంది నేతలు తమ అనుచరులతో పేకాట నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా స్థానిక నేతలు ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఇక పక్కనే ప్రొద్దుటూరు ఉండటంతో క్రికెట్ బెట్టింగ్ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్ తాడిపత్రి కేంద్రంగానే సాగుతోంది. అదేవిధంగా మట్కా సంగతి చెప్పక్కర్లేదు. గతంలో అశోక్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 72మంది మట్కారాయుళ్లను తాడిపత్రి నుంచి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత నేతల ఒత్తిడి పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. పోలీసుల నిస్సహాయత ఇక్కడ పేకాట, మట్కా ఎవరు నిర్వహిస్తున్నారు? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు తెలియనిది కాదు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఏమాత్రం జోక్యం చేసుకున్నా అక్కడి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పీఏ నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణం. పోలీసులతో రాయ‘బేరాలు’ నడిపి నెలమామూళ్లు కట్టిపడేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే బదిలీ కంటే బహుమానాలే ఉత్తమమనే భావన ఉన్నట్లు కనిపిస్తుంది. పోలీసులే మౌనం దాలిస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తాడిపత్రిలో అధిక భాగం వ్యసనాలకు బానిసైంది. అప్పుల ఊబిలో ఎన్నో కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి కాగా.. హత్యలు, ఆత్మహత్యలు కోకొల్లలు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అసాంఘిక శక్తుల నుంచి తాడిపత్రికి విముక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే తనదైన ముద్ర కనపరుస్తున్న నూతన ఎస్పీ చేతుల్లో తాడిపత్రి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. డిసెంబర్ 30, 2018 మట్కా డాన్ రషీద్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సీఐ హమీద్‌ఖాన్‌పై ఆయనతో పాటు అనుచరులు దాడి చేశారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. సీఐతో పాటు పోలీసులు గాయపడ్డారు. -
జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలో జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డిని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు. వారి అండచూసుకుని కొందరు ‘పచ్చ’ నేతలు ఏడీ మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగుతున్నారని, అలాగే ఎమ్మెల్యే ఫోన్లో బెదరించాన్నారు. ఆ అధికారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రతాప్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై దాడులు చేపట్టి ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని, ఇలాంటి ఆధికారిని అధికారిని బెదిరించడం దారుణమన్నారు. ప్రాణహాని ఉందని ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఆయనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రాంతం నుంచి రోజూ 300 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోందని రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకుని మాఫియాను సాగిస్తున్నారని విమర్శించారు. ఎస్పీ ఆశోక్‌కుమార్ స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తాగునీటి ఎద్దడిని కాపాడాలని తెలిపారు. -
జేసీ అండతోనే అసాంఘిక కార్యకలాపాలు
- తాడిపత్రిలో అభివృద్ధి శూన్యం - వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి టౌన్ : తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అండతోనే తాడిపత్రిలో మట్కా, జూదం, రౌడీజం, భూకబ్జాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమస్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రిలోని భగత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోనే పలు అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు. వాస్తవంగా మట్కా, జూదం. రౌడీజం, భూకబ్జలనే ఇక్కడ అభివృద్ది చేశారని మండిపడ్డారు. కేవలం తప్పులు కప్పి పుచ్చుకోవడానికి పట్టణ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి వచ్చిన డీజీపీని కలిసి వాటిని అదుపు చేయాలని ఎమ్మెల్యే జేసీ కోరారని చెప్పారు. అదేరోజు ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి తమ అనుచరులను అరెస్టు చేయవద్దని హుకుం జారీ చేశారని తెలిపారు. జేసీ అనుచరులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. వీటిపై ఎన్నోసార్లు డీజీపీ, డీఐజీ, ఐజీ, ఎస్పీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో వెంటనే పట్టణ పోలీసు స్టేసన్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేయాలని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే మా మిత్ర పక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలతో పట్టణ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని సంజీవనగర్, పాతకూరగాయాల మార్కెట్ సమీపంలోని ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యాలయం, సీబీ రోడ్డులోని ప్రైవేటు కార్యాలయం, వాటర్ వర్క్‌రోడ్డు వీధిలోని జూద గృహంపై గతంలో పోలీసులు చేసిన దాడుల్లో అధికార పార్టీకి చెందిన వారు దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిళ్లతో స్థానిక పోలీసులు కేవలం అమాయకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండతోనే తాడిపత్రి రూరల్‌తో పాటు పెద్దపప్పూరు మండలాల నుండి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోందన్నారు. గ్రానేటుకు సంబంధించి ఒక లారీకి రాయిల్డీ తీసుకొని అదే నెంబర్ మీదగా కొన్ని లారీలు తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.