breaking news
jayaram dies
-
శుభకార్యానికి వెళ్తుండగా..
- వెంటాడిన మృత్యువు - రోడ్డు ప్రమాదంలో వాయిద్య కళాకారుడి దుర్మరణం - పండుగ పూట విషాదం తలుపుల : శుభకార్యాల్లో వాయిద్యాన్ని వాయిస్తూ.. వచ్చిన సొమ్ముతో జీవనం సాగించే ఓ వాయిద్య కళాకారుడిని మృత్యువు వెంటాడింది. సీతారాముల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని పొరుగూరిలో జరిగే కార్యక్రమంలో వాయిద్యాన్ని వాయించేందుకు బయలుదేరగా.. మార్గమధ్యంలోనే మృత్యువు కబళించి, కాటికి పంపింది. పండుగ పూట విషాదం మిగిల్చిన ఈ ఘటన తలుపుల మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. జరిగిందెలాగంటే... తలుపుల మండలం నూతనకాల్వకు చెందిన వాయిద్యకళాకారుడు జయరాం(47) సహా మరికొందరు ఓబులరెడ్డిపల్లెకు చెందిన మరో ఎనిమిది మంది వైఎస్సార్ జిల్లా భూమయ్యగారిపల్లెలో జరగనున్న సీతారాముల కల్యాణంలో బ్యాండు వాయించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఓదులపల్లి సమీపానికి రాగానే ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో జయరాం తలకు బలమైన దెబ్బలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వారిలో బాబాఫకృద్దీన్, మహేశ్, రాజు గాయపడ్డారు. మిగిలిన వారు అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, జయరాం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య యశోదమ్మ, కుమారులు విజయ్‌కుమార్, అనిల్‌కుమార్ ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని ఓపెన్ ఎయిర్ జైలులో ఓ జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం, కస్తూరి రాజుగారిపల్లికి చెందిన రంగయ్య కుమారుడు జయరాం (39)కు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. జనవరి–16న కడప జైలు నుంచి ఓపెన్ ఎయిర్ జైలుకు తీసుకొచ్చారు. అయితే జయరాం కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. నాలుగు రోజుల క్రితం జైలులో అస్వస్థతకు గురికావడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. జయరాంకు ఇంకా పెళ్లి కాలేదన్నారు.