విదేశీ విద్యపై అవగాహన పెంచుకోవాలి
మొయినాబాద్, న్యూస్‌లైన్: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడి ప్రదేశాలు, విశ్వవిద్యాలయాలపై అవగాహన పెంచుకోవాలని గ్యానె డాట్‌కామ్ ప్లానింగ్ హెడ్ సీఈఓ జయ్ ఈపెన్ అన్నారు. మండలంలోని హిమాయత్‌నగర్‌లోని అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘విదేశీ విద్య- ఉత్తమ ఎంపిక’ అంశంపై చివరి సంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ దౌత్య మర్యాదలు, నిర్వహణ నియమాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సమాచారమంతా ఇటర్నెట్లో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రైవేటు కన్సల్టెన్సీల మాయమాటలు నమ్మవద్దని, వాటి మోసపూరిత ప్రకటనలతో మోసపోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం నార్వే, ఆస్ట్రియన్ యూనిువర్సిటీలకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయని నార్వేలోని జోవిక్ యూనివర్సిటీ అధ్యాపకుడు ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐలెట్స్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం నుంచే సిద్ధం కావాలన్నారు. సదస్సులో ప్రిన్స్టన్ రివ్యూమానియా హెడ్ ఫజల్ హాసన్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భాస్కరన్, మేనేజర్ మృణాల్ చక్రవర్తి, గ్యానెడాట్కామ్ వైస్ ప్రెసిడెంట్ శశికిరణ్, అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునంద యాదవ్, హెచ్ఓడీ కృష్ణప్రియ, ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.