breaking news
Jaspal Rana (Shooter)
-
చాంపియన్లను తీర్చిదిద్దిన చాంపియన్
తుపాకీ ఎక్కుపెట్టగానే లక్ష్యానికి చేరుకున్నట్లు కాదని... స్టార్ షూటర్‌గా ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన కఠోర సాధన అవసరమని నిరూపించిన దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూశారు. గన్ పట్టుకోగానే ఫలితాలు వచ్చేయవని... అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే తప్ప అంతర్జాతీయ స్థాయిలో మెరవలేమని యువ షూటర్లకు దిశానిర్దేశం చేసిన జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని వీడారు. గురి పెడితే లక్ష్యం తప్ప మరేదీ కళ్ల ముందు కనిపించకూడదనే ప్రాథమిక సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన జస్పాల్... తన కెరీర్లో ఎన్నో మరపురాని విజయాలు సాధించడంతో పాటు... తన శిష్యులను కూడా ప్రపంచ స్థాయి షూటర్లులుగా తీర్చిదిద్దారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌ను మలిచిన ఆ శిల్పి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడా విభాగం‘ఈ లోకంలో జస్పాల్ రాణా లాంటి వారు మరొకరు ఉండరు’... రాణా మృతి సందర్భంగా భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) సంతాపం తెలుపుతూ ఈ వ్యాఖ్య చేసింది. ముమ్మాటికి ఇది వాస్తవం. షూటర్‌గా ఆసియా క్రీడల్లో 8 పతకాలు (4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు), కామన్వెల్త్ గేమ్స్‌లో 15 పతకాలు (9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్న రాణా... ఆ తర్వాత కోచ్‌గా అంతకుమించి ఘనతలు సాధించారు.క్రమశిక్షణకు మారుపేరైన జస్పాల్ రాణా... ప్లేయర్‌గా ‘అర్జున’ అవార్డు, శిక్షకుడిగా ‘ద్రోణాచార్య’ పురస్కారం సొంతం చేసుకున్నారు. దేశంలో షూటింగ్‌కు పెద్దగా ఆదరణ లేని సమయంలోనే గన్ ఎక్కుపెట్టిన జస్పాల్... ఎందరో యువ షూటర్లకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాణా... 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించారు. అంతకుముందు 1978 ఆసియా క్రీడల్లో రాజా రణ్‌దీర్ సింగ్ పతకం సాధించగా... 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీనేజ్ వయసులోనే జస్పాల్ పసిడితో మెరిశారు. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో అగ్రస్థానం దక్కించుకున్న జస్పాల్... అదే ఏడాది మిలాన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిశారు. ఆ తర్వాత ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో జస్పాల్ బరిలోకి దిగితే పతకం ఖాయం అనేలా ఎదిగారు. ముఖ్యంగా 2006లో దోహా ఆసియా క్రీడల్లో అయితే జస్పాల్ పట్టిందల్లా బంగారంలా మారింది. ఆ క్రీడల్లో 3 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన రాణా... ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పారు. కోచ్‌గా ఎనలేని కీర్తి... ‘అత్యుత్తమ ఆటగాడు... అంతే మంచి కోచ్ కాలేడు’ అన్న నానుడిని అసత్యమని నిరూపిస్తూ... కోచ్‌గా మారిన తర్వాత భారత షూటింగ్‌కు జస్పాల్ మరింత వన్నె తెచ్చారు. ప్రతిభను వెతికి పట్టడం ఎంత ముఖ్యమో దాన్ని సానబెట్టాల్సిన అవసరం కూడా అంతే ప్రధానమని బలంగా విశ్వసించి... దానిపైనే అహర్నిశలు కష్టపడిన జస్పాల్ ఎందరో యువ షూటర్లను తీర్చిదిద్దారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ భాకర్ వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. మనూ భాకర్ భావోద్వేగం చిన్నతనం నుంచి మనూను గమనిస్తూ వస్తున్న జస్పాల్... ఆమె ఏ విభాగంలో అయితే రాణించగలదో కూడా ముందే నిర్ణయించారు. అయితే ఇద్దరి మధ్య పొరపొచ్చలు రావడంతో కొన్నాళ్లు వేరుపడినా... ఆ తర్వాత జస్పాల్ శిక్షణతోనే ఒలింపిక్ పతకం సాధ్యమని బలంగా నమ్మిన భాకర్... పారిస్ ఒలింపిక్స్‌కు ముందు తిరిగి తన గురువు చెంతకు చేరింది. దీంతో శిష్యురాలిని మెరుపులాగా తీర్చిదిద్దిన జస్పాల్... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిపారు. సౌరభ్ చౌధరీ, అనీశ్ భన్వాల్, చింకీ యాదవ్ వంటి పులువురు షూటర్లు వెలుగులోకి రావడం వెనక జస్పాల్ కృషి ఎంతో ఉంది. ‘ విజయం సాధిస్తే లోకం మొత్తం నిన్ను భుజాల మీద మోసేందుకు సిద్ధంగా ఉంటుంది... కానీ నువ్వు ఓడిపోయినా నీ వెంట నిలబడేందుకు నేను ఉన్నాను’ అని తన శిష్యులలో మనో ధైర్యం నింపిన జస్పాల్ చిన్న వయసులోనే మృతిచెందడం భారత షూటింగ్‌కు పెద్ద వెలితి! తుదిశ్వాస వరకు... మ్యూనిక్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొన్న అనంతరం తిరిగి వస్తున్న సమయంలో జస్పాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ఢిల్లీలో దిగగానే నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో... షూటర్లను మెరుగ్గా తయారు చేయాలనే సంకల్పం మధ్య జస్పాల్ పెద్దగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదు. షూటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం జాతీయ జూనియర్ కోచ్‌గా పనిచేసిన రాణా... భవిష్యత్తులో సత్తా చాటగల షూటర్లను ముందే పసిగట్టి వారిని సానబెట్టడంతోనే... ప్రస్తుతం ఎక్కడ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్ జరిగినా భారత షూటర్లు పతకాలు సాధించగలుగుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి 25 మీటర్ల పిస్టల్ విభాగానికి హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న జస్పాల్ శిక్షణ ధోరణి భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో రాణించే విధంగా సాధన చేయించే జస్పాల్... ఒలింపిక్స్‌ను తలపించే ఒత్తిడిలో షూటర్లతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టారు. తీరని లోటు...జస్పాల్ రాణా మరణం భారత క్రీడా లోకానికి తీరని లోటు. షూటింగ్లో ఆయన సాధించిన ఘనతలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. షూటర్‌గా ఎంత పేరు సంపాదించారో... కోచ్‌గా యువ షూటర్లను తీర్చిదిద్దడంతో అంతకుమించి కీర్తి పొందారు. ప్రతిక్షణం మరింత మెరుగవ్వాలనే ఆయన నిబద్ధత ఎనలేనిది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రిజస్పాల్ రాణా మరణవార్త విని గుండె ముక్కలైంది. భారత షూటింగ్ రూపురేఖలు మార్చిన అతడు నాకు ఆప్తమిత్రుడు. రేంజ్లో అడుగుపెడితే చాలు అతడితో పోటీ పడటం ఎవరికైనా కష్టం. మన క్రీడాలోకానికి ఈ లోటు తీర్చలేనిది. – అభినవ్ బింద్రా, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతకొంతమంది లోటు ఎప్పటికీ పూడ్చలేం. అలాంటి జాబితాలో అగ్రగణ్యుడు జస్పాల్ రాణా. నేను షూటింగ్ కెరీర్ ప్రారంభించిన కొత్తలో అప్పటికే జస్పాల్ స్టార్ షూటర్. 1994 ఆసియా క్రీడల్లో టీనేజ్ వయసులోనే స్వర్ణం సాధించి... భారతీయులు షూటింగ్‌ను ఏలగలరని నిరూపించారు. ఆయనను రోల్‌మోడల్‌గా భావించే షూటింగ్‌లోకి వచ్చా. అలాంటి నా చిన్ననాటి హీరోతో ఆ తర్వాత కలిసి బరిలోకి దిగే అవకాశం లభించింది.ఆసియా క్రీడల్లో 8 పతకాలు, కామల్వెల్త్ గేమ్స్‌లో 15 మెడల్స్... ప్రపంచ రికార్డులు ఇలా లెక్కకు మిక్కిలి సాధించినా జస్పాల్ నిత్య విద్యార్థిలాగే కష్టపడేవారు. మనూ భాకర్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించడం వెనక ఆ కష్టం ఉంది. భారత్ షూటింగ్ భారాన్ని భుజస్కందాలపై మోసిన జస్పాల్ ఇక లేరంటే నమ్మశక్యంగా లేదు. – గగన్ నారంగ్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత -
జస్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జస్పాల్ రాణా న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా గురువారం రాత్రి వరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం, మరునాడే ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు విడవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మరి జస్పాల్ రాణా ఆకస్మిక మృతి వెనుక కారణం ఏమై ఉంటుందనేది కార్డియాక్ సైన్సెస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ బల్బీర్‌సింగ్ వివరించారు. 'జస్పాల్ రాణా మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో జాయినయ్యారు. అయితే విమాన ప్రయాణంలో ఉండగానే ఛాతిలో నొప్పి వచ్చింది. అత్యంత విషమ పరిస్థితిలో ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే జస్పాల్ గుండెలో రక్త ప్రసరణ జరిగే ధమని పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల అతడి గుండె పంపింగ్ సామర్థ్యం పూర్తిగా బలహీనపడిపోయింది. ఆయన కోలుకున్నట్లే కనిపించినప్పటికీ ధమని మూసుకుకపోవడం వల్ల హార్ట్ ఫెయిలయ్యింది. గుండెపోటు తర్వాత కూడా కొంతమందికి మైల్డ్, మరికొంతమందికి తీవ్రమైన హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశముంటుంది. అయితే జస్పాల్ రాణా గుండె పరిస్థితి మొదట సాధారణ స్థితికి రావడంతో ఆయన కోలుకున్నట్లే కనిపించారు. డాక్టర్లు కూడా శుక్రవారం ఆయన్ను పరీక్షించి డిశ్చార్జ్ చేయాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తూ శుక్రవారం ఉదయం నిద్రలో ఉండగానే మరోసారి గుండెపోటు రావడంతో జస్పాల్ మరణించారు.' అని చెప్పుకొచ్చారు.జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా, స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు.చదవండి: అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక! -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జాన్ క్యూజక్ (హాలీవుడ్ నటుడు), జస్పాల్ రాణా (షూటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన అంకె. కుటుంబ పరమైన బాధ్యతలకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పిల్లలకోసం పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతసామానులు, వాహనాల స్థానంలో కొత్తవి కొంటారు. విలాస జీవనానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. గతంలో కన్నా ఎంతో రిలాక్స్డ్గా కనిపిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. మీడియా రంగంలోని వారికి, కళాకారులకు, సంగీతవిద్వాంసులకు మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా భర్త ఒక చోట, భార్య ఒక చోట పని చేస్తూ, బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ బర్త్ నంబర్ 28 కాబట్టి మీ పేరును న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకుని గ్రాఫాలజీ ప్రకారం సంతకం చేస్తే తొందరగా అదృష్టాన్ని అంది పుచ్చుకోవచ్చు. లక్కీ నంబర్స్: 1,2,5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: భృగుపాశుపత హోమం చేయించుకోవడం, అనాథలను ఆదుకోవడం, మదరసాలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు


