breaking news
Jandani
-
జాంధానీ జరీ..మెరిసింది మళ్లీ
ఉప్పాడ చేనేత కళాకారుల అద్భుతసృష్టి జాంధానీ.. ఏళ్లు గడిచినా తరగని విలువ దీని ప్రత్యేకత. ఎటు నుంచి చూసినా కళాత్మకత ఉట్టిపడే ఈ చీరలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. జాంధానీ డిజైన్లతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయనుండడంతో ఈ చీర సోయగాల గొప్పతనం మరోసారి మార్మోగుతుంది. ఇప్పటికే పేటెంట్ హక్కుతో పాటు ఇండియన్ హ్యాండ్లూమ్స్లో ఉప్పాడ జాంధానీకి స్థానం లభించగా.. తాజాగా దక్కిన గౌరవంతో తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని చేనేత కళాకారులు ఆశిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన వెండి జరీ, అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగు చేతితో పేర్చే నేతన్న పనితనంతో ప్రపంచపటంలో జాంధానీకి అరుదైన స్థానం లభించింది. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తరతరాలుగా ఈ జాంధానీ చీరల తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవి అంత అందంగా కనిపించడానికి పూర్తిగా చేతితో నేయడమే కారణమని చెబుతారు. పాడై చిరిగిపోయినా.. కొన్న డబ్బులో సుమారు 30 శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది. వెండి జరీలో సన్నని పట్టు, ఎర్రటి దారం ఉంటుంది. ఇది తొందరగా కాలదు, బూడిద కాదు. గీటురాయితో వెండి జరీ నాణ్యతను çపరీక్షించుకోవచ్చు. జరీని ఎన్ని పోగులు ఉపయోగిస్తే చీరకు అంత విలువ పెరుగుతుంది. నేతలో ఎక్కడా వదులు లేకుండా కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా లోపాన్ని పట్టుకోలేం.ఒక చీరపై ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తారు. డిజైన్‌ను బట్టి పూర్తికావడానికి 20 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. గతంలో రోజుకు ఒకట్రెండు చీరల కంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి 100 చీరలు తయారుచేస్తున్నారు. ముందు పేపరుపై డిజైన్ గీసుకుని నేత ప్రారంభిస్తారు. జరీని బట్టి చీర ధర నిర్ణయం చీరలో వాడే జరీని బట్టి విలువ నిర్ధారిస్తారు. చీరలో 240 గ్రాములు జరీ వాడితే దాని విలువ రూ 5 వేల వరకూ ఉంటుంది. డిజైన్ల కనుగుణంగా 500 గ్రాముల వరకూ జరీ వినియోగిస్తారు. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు నేతన్నల కళాత్మకతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొత్తపల్లి మండలంలోనే కొత్తపల్లి, కుతుకుడుమల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకు ఉండే మగ్గాలు నేడు 500కు చేరాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి తదితర గ్రామాల్లోను వీటి తయారీ ఉంది. అన్ని కులాల వారు చీరలు నేయడం విశేషం. పోస్టల్ కవర్లపై ముద్రించేందుకు డిజైన్ల ఎంపిక రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే చీరల్ని ఇక్కడి నేతన్నలు తయారుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాషింగ్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇటీవల కాలంలో వ్యాపారం ఊపందుకుంది. జాంధాని పేటెంట్ హక్కు సాధించుకున్నాక అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు కూడా పొందింది. ఇప్పుడు వీటిపై పోస్టల్ కవర్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ చేనేత కళాకారులకు వర్తమానం పంపింది. కవర్లపై ప్రింట్ చేసేందుకు చీరల డిజైన్లను పంపమని సూచించడంతో.. ఎంపిక చేసిన కొన్ని డిజైన్లకు ఢిల్లీకి పంపారు. నేతన్న శ్రమకు దక్కని విలువ మార్కెట్లో ఈ చీరలకు మంచి ధర పలుకుతున్నా.. నేత కార్మికుడికి దక్కే మజూరీ అంతంతమాత్రమే. కొన్ని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్సుతో కుమ్మౖMð్క నేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. తక్కువ మజూరీలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. సహకార సంఘాల ద్వారా నేత కార్మికులతో చీరలు నేయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. ముడిసరుకుల ధరలు చుక్కలనంటడం, చేసిన అప్పులు పెరిగిపోవడంతో నేతన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఉప్పాడ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు మాత్రమే సొంతమైన పేటెంట్ హక్కును కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రకం చీరలను ఇతర ప్రాంతాల్లో నేయించడంతో ఇక్కడి చీరలకు గిరాకీ తగ్గుతోంది. పేటెంట్ హక్కును కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నేతన్న నేరుగా విక్రయించేలా చూడాలి అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర నేసిన ఘనత మా కార్మికులకుది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయడంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మా కళాకారుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. నేరుగా కార్మికులే ఆన్లైన్లో విక్రయాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
చేనేతకు సిసలైన చేవ్రాలు
అతివల మనస్సు దోచే తళుకుబెళుకుల ‘జాందాని’ చేనేత చీరలు... వీటి రూపకల్పన వెనుక శక్తిలాంటి ఒక వ్యక్తి కఠోర శ్రమ... అకుంఠిత దీక్ష... అంతకు మించిన నైపుణ్యం ఉన్నాయి! ఏదో సాధించాలనే తపన... పదిమందికి ఉపయోగపడాలనే తాపత్రయం... పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం ఉన్నాయి. తొమ్మిది పదులు మీద పడినా... చేనేత రంగ అభివృద్ధిపై ఉన్న పట్టుదల, హస్త కళలపై ఉన్న మక్కువ... చేనేత పారిశ్రామికవేత్త లొల్ల వెంకట్రావుకు ఇంకా ఈ రంగంలో కొనసాగేలా స్ఫూర్తి నింపుతున్నాయి... ఈ వయసులోనూ ఆయన అవిశ్రాంత కృషి చూస్తే ఎవరైనా సరే సలామ్ చేయక మానరు! తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక టేబుల్ మీద పెద్ద డ్రాయింగ్ షీటు పరుచుకుని డి జైన్లు వేస్తున్న తొమ్మిది పదుల వయస్సు నిండిన ఒక పండు యువకుడు దర్శనమిస్తారు. ఆయన అలా డిజైన్లు ఎందుకు వేస్తున్నారా అని చూసేలోపే, కుర్చీలోంచి లేచి, మగ్గం మీద కూర్చుని తాను ముందుగా గీసిన డిజైన్‌ను చీర మీద తయారుచేస్తూ కనపడతారు. పూవుకు తావి అద్దినట్టుగా చీరెలకు బంగారు లతలు, పూవులు పూయిస్తారు లొల్ల వెంకట్రావు. చేనేత చీరల తయారీలో విప్లవం తెచ్చిన ఘనత ఆయనది. తెల్లటి పంచె లాల్చీ, మందపాటి కళ్లద్దాలతో చాలా సాధారణంగా కనిపించే వెంకట్రావు చేనేత కళకు చేసిన కృషి అసాధారణమైనది. గుమస్తాగా ప్రారంభించి, ఎందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పాఠశాలకు వెళ్లి చదివింది ఎనిమిదో తరగతి వరకే అయినా, జీవితాన్ని మాత్రం నిండుగా చదివారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే ఉంది. గుమాస్తాగా... ఉప్పాడకు చెందిన చేనేత వ్యాపారి పుచ్చల రామలింగం వద్ద గుమస్తాగా చేనేత పని జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు, ఈ పనిలో చేరడానికి ముందు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నారు. స్థానికం పాఠశాలలో ఆరు నెలలపాటు ఉపాధ్యాయ శిక్షణ పొంది, ట్రెయినీగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ‘‘మా నాన్నగారు కులవృత్తిని విడిచిపెట్టవద్దని చెప్పడంతో ఆయన ఆవేదనను అర్థం చేసుకుని కులవృత్తి వైపు అడుగులు వేశాను’’ అని చెబుతారు వెంకట్రావు. గుమస్తాగా పని చేస్తున్న రోజుల్లోనే అంటే 1983 నుంచి జాందాని చీరల తయారీలో విప్లవం తీసుకువచ్చారు. దాంతో అక్కడక్కడ మాత్రమే కనిపించే జాందాని మగ్గాల సంఖ్య వందలకు చేరుకుంది. వేల మంది కార్మికులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడిని. జాందాని చీరలలో కొత్త విప్లవం తీసుకురావడానికి ఆ కళ చాలా ఉపయోగపడింది. చీరలపై తీగలు, ఆకులు, జంతువులు, కాయల వంటి కళాకృతులను నేత ద్వారా సృష్టించాను. ఆకృతిని ముందుగానే గ్రాఫ్‌పై తయారుచేసి, దాని మీద నుంచి చీరలపై ఆ డిజైన్ వచ్చేవిధంగా తయారుచేయడం ప్రారంభించాను’’ అని వివరించారు వెంకట్రావు. భవిష్యత్తరాలకు అందించాలని... చేనేతపై ఇంతటి అభిమానం కలగడానికి బీజం స్వాతంత్య్రానికి ముందే వెంకట్రావులో నాటుకుంది. మహాత్మాగాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపుతో స్వదేశీ వస్తువుల మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ తర్వాత జాందాని కళాభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో ఆ కళ గుర్తింపు పొందడానికి కారణమైంది. తాను మక్కువ పెంచుకున్న కళాభివృద్ధికోసం ఆయన చేసిన అచంచల కృషే ఆ కళపై ఆయన పేటెంట్ హక్కును పొందేలా చేసింది. ‘‘జాందాని కళను భవిష్యత్తరాలకు అందించాలని నా సంకల్పం. అందుకే ఈ కళకు సంబంధించి, ‘జాతీయ హస్తకళలలో జాందాని చేనేత హస్తకళ, దాని ప్రత్యేకత - నా అనుభవాలు’ పేరుతో ఒక పుస్తకం రాశాను’’ అంటారు వెంకట్రావు. చేనేత అభివృద్ధి ధ్యేయంగా... నేత కార్మికుడి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు వెంకట్రావు. ‘‘చేనేత రంగం అభివృద్ధి దిశలో పయనిస్తోంది కానీ, కార్మికులు మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన సుమారు వంద మంది నిరుపేద చే నేత కార్మికులకు నెలకు 200రూపాయల చొప్పున పింఛను అందిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను’’ అంటారు వెంకట్రావు. ఈ వయసులో కూడా చీరలకు అవసరమైన డిజైన్లను తానే తయారుచేసుకోవడాన్ని బట్టే ఆయన దీక్ష, పట్టుదల ఎలాంటివో అర్థమవుతుంది. కళల అభివృద్ధికి ఇలాంటి కార్యశూరులే కదా కావాల్సింది! - ఎల్ శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ ఫొటోలు: ఎస్వివివిఎస్ ప్రసాద్, పిఠాపురం జాందాని అంటే... సాధారణంగా ఏదైనా చీరలకు డిజైన్ ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. జాందాని చీరలపై మాత్రం రెండు వైపులా డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. జాందాని అనేది పర్షియన్ పదం. సంస్థానాధీశుల కాలంలో దీనిని వాడుకలోకి తీసుకువచ్చారు. రాణుల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయించేవారు. కాలక్రమంలో వీటిని మన రాష్ట్రంలో కొత్తపల్లిలో నేయడం ప్రారంభించాక వీటికి విస్తృత ప్రాచుర్యం లభించింది. వెండి బంగారు జరీలతో నేత నేయడం వలన ఈ చీరల ధర రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ చీర చిరిగినా, పాడైనా సగం ధర తిరిగి రావడం వీటి విశిష్టత.