breaking news
Janaki Puram Encounter
-
ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు
తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ దళాలు ఘటనాస్థలికి వెళ్లిన తమిళనాడు పోలీసులు సూర్యాపేట బస్టాండ్‌లో ముంబై ఏటీఎస్ స్క్వాడ్ తనిఖీలు దర్గా దగ్గరకు కూడా..! పది సెల్‌కంపెనీలు సిమ్‌లతో నెట్‌వర్క్‌లపై ఆరా? కర్నూల్‌కు ఫోన్లు వెళ్లినట్లు గుర్తింపు..పలువురి అరెస్ట్ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి, సోదరుడు ముష్కర ముఠా కోసం పోలీసుల విస్తృత గాలింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉగ్రవాద కోణంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన జానకీపురం ఎన్కౌంటర్ జరిగిన మూడో రోజు కూడా ముష్కరుల కోసం గాలింపు కొనసాగింది. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, మన పోలీసులు అర్వపల్లి గుట్టలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులెవరైనా ఇక్కడ ఉన్నారా.. లేదంటే ఎన్కౌంటర్లో హతమైన వారికి సం బంధించిన వివరాలు ఏమైనా లభిస్తాయా అనే కోణంలో ఈ కూంబింగ్ సాగుతోంది. కూంబింగ్‌లో 200 మందికిపైగా పోలీసులు, ఆరు బృందాలుగా విడిపోయి పాల్గొంటున్నట్టు సమాచారం. అర్వపల్లి గుట్ట,పెద్దగుట్ట, కంచగట్టుతోపాటు పలు గ్రామాల్లో కూడా ఈ కూంబింగ్ జరిగింది. అయితే, ఆదివారం జరిగిన కూంబింగ్‌లో ఎన్కౌంటర్ మృతులకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికినట్టు తెలుస్తున్నా.. సోమవారం కూంబింగ్‌లో ఎలాంటి ఆధారాలూ లభించలేదని సమాచారం. మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా తమ విచారణను వేగవంతం చేశాయి. ముంబైకి చెందిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు రెండోరోజు కూడా ఆధారాల సేకరణలో ఉన్నారు. అసలు తొలి ఘటన జరిగిన సూర్యాపేట బస్టాండ్‌కు సోమవారం వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అంతకంటే ముందు ఎన్కౌంటర్ ఘటన జరిగిన మోత్కూరు మండలం జానకీపురానికి తమిళనాడుకు చెందిన పోలీసులు వెళ్లారు. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. స్థానికులను, పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. దర్గా వద్దకు ఏటీఎస్.. అదే విధంగా ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు ఘటనకు ముందురోజు బస చేశారని భావిస్తున్న అర్వపల్లి దర్గాకు ముంబై ఏటీఎస్ పోలీసులు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఏటీఎస్ బృందం అసలు ఆ ప్రాంతంలో ఎన్ని కంపెనీల సెల్ఫోన్లు పనిచేస్తున్నాయనేది చెక్ చేసుకున్నారు. పది కంపెనీల సిమ్‌కార్డులు తీసుకెళ్లి ఫోన్లలో వేసి నెట్‌వర్క్‌లను ఆరా తీశారు. దర్గానుంచి కర్నూల్లోని కొందరికి ఫోన్లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారంతో కర్నూల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి, ఉగ్రవాదులకు సంబంధం లేదని, ఓ దొంగలముఠా వారిగా గుర్తించారు. అదే విధంగా దర్గాతో పాటు జిల్లాలోని కొన్ని మదర్సాలను కూడా దర్యాప్తు బృందాలు విచారిస్తున్నట్టు సమాచారం. దుండగులు మదర్సాలలో ఏమైనా షెల్టర్ తీసుకున్నారా.. తాము ఉగ్రవాదులమని చెప్పకుండా సాధారణ పౌరుల్లా మదర్సాలను ఆశ్రయించారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఎజాజ్‌ను తీసుకెళ్లారు.. కాగా, ఎన్కౌంటర్లో చనిపోయిన ఎజాజుద్దీన్ మృతదేహాన్ని ఆయన తండ్రి, సోదరుడు వచ్చి తీసుకెళ్లారు. ఘటన వివరాలు తెలుసుకున్న వారు మృతి చెందింది తమ కుమారుడేనని తెలుసుకుని నల్లగొండకు చేరుకున్నారు. ఎజాజ్ తండ్రిని నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఎడమచేతికి ఒక వేలు లేదని, గతంలో వరికోత యంత్రంలో పడి వేలు తెగిపోయిందని ఆయన చెప్పారు. ఎజాజ్ తండ్రి నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కామినేని ఆసుపత్రి నుంచి వారి స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో మధ్యాహ్నం సమయంలో వారు మృతదేహంతో మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు. ప్రజల్లో ఆందోళన.. ముష్కరులు ఇద్దరే కాదని, ఇంకా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు. సూర్యాపేట బస్టాండ్ ఘటన తర్వాత రెండు రోజులకు ఇద్దరు దుండగులు బయటకు వచ్చిన నేపథ్యంలో, ఇంకెవరైనా ఎక్కడయినా దాక్కున్నారా... బయటకు వస్తారా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసుబలగాలు పెద్ద ఎత్తున కనిపిస్తుండడంతో మళ్లీ కాల్పులు ఏమైనా జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది. ఇంకా దుండగులు ఉన్నారని, అయితే వారు జిల్లాలోనే ఉన్నారా లేక రాష్ట్రం దాటి వెళ్లిపోయారా అనే విషయంలో పోలీసుల నుంచి స్పష్టత వస్తేనే ఈ ఆందోళన తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడో వ్యక్తి వచ్చివెళ్లినట్లు నిర్ధారణ ఎజాజుద్దీన్, అస్లాంతోపాటు మూడో వ్యక్తి కూడా అర్వపల్లి దర్గాకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అతను వీరికి డబ్బులు ఇచ్చినట్లు భావిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడు..ఎలా వెళ్లాడనే కోణంపై దృష్టిసారించారు. కాగా, అర్వపల్లి దర్గానుంచి ఉగ్రవాదులు ఎవరెవరికి ఫోన్‌చేశారో సంబంధింత కాల్‌డేటాను హైదరాబాద్‌కు పంపించారు. -
మూడో రోజూ సాగిన కూంబింగ్
అర్వపల్లి: మండల కేంద్రంలోని స్థానిక దర్గా వద్ద ఉన్న పెద్ద గుట్ట ప్రాంతంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్పెషల్ పార్టీతో పాటు పోలీసులు సోమవారం మూడో రోజు కూడా కూంబింగ్ నిర్వహించారు. శనివారం మండల పరిధిలోని సీతారాంపురం వద్ద కాల్పులు జరిపిన అనంతరం తిరిగి అర్వపల్లిలో ఓబైక్తో పరారై మోత్కూర్ మండలం జానకీపుం వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు అస్లాం, ఎజాజుద్దీన్‌గా కేంద్ర భద్రత దళాలు గుర్తించిన విషయం తెలిసింది. ఈనెల 2న సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదులు రెండు రోజుల అనంతరం అర్వపల్లిలోనే ప్రత్యక్షం కావడం అందరినీ అశ్చర్యానికి గురిచేసిన విషయం విదితమే. ఆ రెండు రోజులు ఎక్కడున్నారు. వీరికి దర్గా వద్ద ఆశ్రయం ఎరైనా కల్పించారా లేదా కొత్త వ్యక్తులు అవటంచేత దర్గా వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుస్తున్న వార్తల్లో నిజమెంత అనే సందేహం వ్యక్తం అవుతోంది. సూర్యాపేట బస్టాండ్‌లో వారితో పాటు మరో వ్యక్తిబ్యాగుతో సంచరిస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో కన్పించిన మూడవ వ్యక్తి వారితో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న కీలక సమచారాన్ని ఆమూడో వ్యక్తి ఎక్కడికైనా తీసుకెళ్లాడా అనే అనుమానంతోనే జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి అణువణువునా సోదాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ఐడి పార్టీ చీఫ్, స్పెష్టల్ పార్టీ పోలీసులు సోమవారం దర్గా ప్రాంతాలోకి వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. అణువణువూ జల్లెడ తిరుమలగిరి : జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు ఈప్రాంతంలోనే తీరిగారని దాంతో పాటు మరో ఉగ్రవాది ఈప్రాంతంలోనే ఉన్నారనే సమాచారంతో నియోజకవర్గంలో సోమవారం గ్రేంహౌడ్స్, స్పేషల్ పార్టీతోపాటు సివిల్ పోలీసులు అణువణువూ సోదాలు నిర్వహించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన ఎజాజుద్దీన్, అస్లాం అర్వపల్లి దర్గాలో తలదాచుకున్నారని, దుండగులకు సంబంధించిన కొత్త సమాచారం ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తుల కూంబింగ్ నిర్వహించారు. అర్వపల్లి దర్గా పెద్ద గుట్ట, కంచగట్టు గుట్టలలో పోలీసులు జల్లెడ పట్టారు. ముష్కరులు బైక్‌పై వెళ్లిన కొత్తపల్లి, నాగారం, ఫణిగిరి, ఈటూరు, అనంతారం, మూసీ పరీవాహక ప్రాంతమైన చిర్రగూడూరు, జానకీపురం గ్రామాల్లో మృతుల బ్యాగులు, సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఆనవాల్లు దొరక్కుతాయనే కోణంలో గాలింపులు చేశారు. భయాందోళనలో ప్రజలు జానకీపురంలో చనిపోయిన అస్లాంఆయూబ్, మహ్మద్ ఎజాజుద్దీన్‌లు సిమి ఉగ్రవాద సంస్థకు చెందినవారని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరితో పాటు వచ్చిన మరో వ్యక్తి ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడనే పుకార్లు వస్తుండడం.. రాత్రి పగలు అనకుండా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఎన్కౌంటర్ జరిగి 48గంటలు కావస్తున్నా ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఎన్కౌంటర్ స్థలం పరిశీలన మోత్కూరు: మండలంలోని జానకీపురం గ్రామంలో ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన డాగ్, బాంబ్‌స్క్వాడ్ బృందాలతో పాటు తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం సోమవారం ఉదయం పరిశీలించింది. డాగ్, బాంబ్స్క్వాడ్బృందాలు ఎన్కౌంటర్ జరిగిన స్థలం, ఉగ్రవాదులు సంచరించిన బిక్కేరు ప్రాంతాన్ని అణువణువూ శోధించారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఏమైన ఆచూకి లభిస్తుందో ఏమోనని వారు సమగ్రంగా పరిశీలన చేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతెన్నులను, ఉగ్రవాదులు తిరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎస్ఐ పురేందర్‌భట్ వారికి వివరించి చూపించారు. తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం,సీఐడీ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను కెమెరాలు, సెల్ఫోన్లలో తీసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఘటన స్థలాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల పోలీసులు పరిశోధన బృందాలు సందర్శించనున్నట్లు తెలిసింది.