breaking news
jana garjana sabha
-
సూర్యాపేట జనగర్జన సభ: సోనియా, కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. తాజాగా సూర్యాపేటలో బీజేపీ జన గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట బీజేపీ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్.. కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకుంటున్నారు. సోనియా గాంధీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేదలు, దళితుల, బీసీల వ్యతిరేక పార్టీలు. కుటంబ పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయలేవు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పటికన్నా దళితుడిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. మూడెకరాల భూమి ఏమైంది? దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది కేసీఆర్. ఇప్పుడైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?. బీసీ సంక్షేమం కోసం ఏటా పది వేలకోట్లు కేటాయిస్తామని అన్నారు ఏమయ్యాయి ఆ నిధులు. ఈ రెండు పార్టీలు కుటుంబ సభ్యుల కోసమే పనిచేసే పార్టీలు. తెలంగాణలో పసుపు రైతులు కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేశాం. సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేశాం. తెలంగాణ అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు. అయోధ్యకు మీరంతా రండి.. ఐదు వందల యాభై ఏళ్ల పోరాటం అయోధ్య రామాలయ నిర్మాణం. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా?. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయబోతున్నారు. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్యకు రావాలి. ప్రధాని మోదీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఎకరాకు ఆరు వేలు ఇస్తున్నాం. మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముప్పై లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతీ ఒక్కరికీ ఐదు కిలోల బియ్యాన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు. ఇది కూడా చదవండి: రేవంత్, ఉత్తమ్ కుమార్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ -
బీఆర్ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ: రాహుల్
సాక్షి, ఖమ్మం: భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్ ప్రకటించారు. గిరిజనులకు పోడు భూములు ఇస్తామని ఆయన తెలిపారు. ఖమ్మంలో జన గర్జన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శల వర్షం కురిపించారు. దేశాన్ని కలపడం మన విధానం.. విడదీయడం బీజేపీ విధానం.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘‘అనేక వర్గాల ప్రజలకు తెలంగాణ స్వప్నంగా ఉండేది. 9 ఏళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ తెలంగాణ తాను రాజుగా కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణితో ముఖ్యమంత్రి భూములు దోచుకుంటున్నారు. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. చదవండి: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ‘‘కర్ణాటకలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాం. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీకి తెలంగాణలో బీఆర్ఎస్ బీ టీమ్.. బీజేపీ బీ టీమ్‌తో మా పోరాటం కొనసాగుతోంది. కేసీఆర్ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి’’ అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. చదవండి: బండి సంజయ్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు? -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం జనగామ : కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. జనగామ జిల్లా సాధన కోసం పట్టణంలో మంగళవారం నిర్వహించిన జనగర్ఝన సభలో ఆయన మాట్లాడారు. నిపుణులతో కమిటీలు వేసి, అందరి సూచనలు, అభిప్రాయాలు తీసుకుని ప్రజల ముందు చర్చ పెడితే ఈ గందరగోళ పరిస్థితి ఉండేది కాదన్నారు. యాదాద్రికి తామెప్పుడూ వ్యతిరేకం కాదని, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని, అయితే చరిత్ర కలిగిన జనగామను కూడా జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ‘వద్దన్న హన్మకొండ వరంగల్ రూరల్ జిల్లాగా ఏర్పడుతుంది..కావాలన్న జనగామ ఎందుకు ఇవ్వడం లేదో అంతుచిక్కడం లేద’న్నారు. జిల్లాల ఏర్పాటు కోసం ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరుతూనే, హక్కు లేకుండా చేసే విచిత్ర పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి సాయుధ పోరాట చరిత్ర, జనగామ ప్రత్యేకతను గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల భావ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పాలన చేయాలే తప్ప.. ఉక్కుపాదంతో అణిచివేసే ధోరణి ఉండకూడదన్నారు. జనగర్జన సభ నిర్వహించుకుంటామని పోలీసులను అడిగితే అనుమతి నిరాకరించారు, హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాము కదా, మీరే అంగీకరిస్తే రెండు గంటలు మాట్లాడుకునే వెళ్లేవారమని అన్నారు. జనగామ జిల్లా అయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సీఎంకు దండపెట్టి వేడుకుంటున్నా: ముత్తిరెడ్డి ‘జనగామ జిల్లా న్యాయమైన కోరిక..బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రాంతాన్ని జిల్లా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు..వందేళ్ల క్రితమే జిల్లా కాకుండా ఆన్యాయం చేశారు’ అని స్థానిక, అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా ప్రతిపాదనను నాడే సీఎంకు దండం పెట్టి ఇచ్చానన్నారు. మంత్రిమండలి సమావేశంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి మద్దుతుగా తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారని గుర్తు చేశారు. గద్వాల జిల్లాను చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కేసీఆర్.. జనగామ విషయమై మాట్లాడకపోవడం అనుకూల సంకేతాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయన్నారు. జనగామ ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని, జిల్లాను అడ్డుకోవద్దని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. గర్జించిన జనగామ జిల్లా సాధన కోసం జనగామ గర్జించింది. పట్టణంలోని ప్రెస్టన్ మైదానంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరై ప్రసంగించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు సభ నిర్వహణకు హైకోర్టు అనుమతించడంతో చాలా మంది ముఖ్యులు మాట్లాడలేక పోయారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తమ ఆస్థిత్వం కోసం సాగిన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే జనగామ జిల్లా కోసం ప్రజలు పోరాడుతున్నారని అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు సలహా ఇస్తున్నానని, దీన్ని ఇగోగా తీసుకోవద్దని అన్నారు. పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణలో జనగామకు ఎందుకు అన్యాయం చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి సభకు వచ్చి మాట్లాడటం కాదు..సీఎంను ఒప్పించి జిల్లా తీసుకు రావాలని కోరారు. సీపీఎం శాసనసభ పక్ష నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. రాబోయే శాసన సభా సమావేశాల్లో జనగామ జిల్లాపై మొదటి ఎజెండాగా మాట్లాడతామని అన్నారు. ఏజెన్సీలోని భద్రాచలంతోపాటు జనగామ జిల్లా చేయాలని తమ పార్టీ నుంచి బలమైన నినాదం వినిపించామన్నారు. జిల్లాల నోటిఫికేషన్లో గందరగోళం ఏర్పడడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. జనగామ ఆందోళనలను గౌరవించాలని కేసీఆర్‌ను కోరారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ మడమ తిప్పను..మాట తప్పను..తప్పితే తల నరుక్కుంటా.. అన్న కేసీఆర్ మాటలు ఉత్తివేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో అణిచివేస్తూ సభకు అనుమతి నిరాకరించి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. కేసీఆర్ నయా నిజాంగా అవతారమెత్తాడని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఇవ్వకుంటే అధికార పార్టీ నేతలను తిరుగనివ్వబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాట తప్పుతున్న కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ప్రజల నిర్ణయాన్ని పాలకులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ రాష్ట్ర నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటులో పొలిటికల్ వ్యాపారమేంటని ప్రశ్నించారు. జనగామ చరిత్ర, ఇక్కడి వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాచేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాల మంటలో సీఎం కేసీఆర్ పతనం తప్పదని అన్నారు. తెలంగాణలో మరో నైజాంలా అవతరించి నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా చేసుకుంటూ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ జనగామ జిల్లా ఏర్పాటుకు బీజెపీ సంపూర్ణ మద్ధతు అందిస్తుందని అన్నారు. హన్మకొండ వద్దంటే వరంగల్ రూరల్ జిల్లా అంటూ పూటకో మాట మాట్లాడుతున్న ప్రభుత్వం ధ్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామన్నారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఆన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆమోదించుకొని వస్తే ఆయనతో కలసి జనగామలో నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నారు. అధికారంలోకి రాగానే 11వ జిల్లా జనగామ అని ఎన్నికల సభలో చెప్పిన సీఎం కేసీఆర్ మాట మరిచిపోయారన్నారు. మా పోరాటం న్యాయమైందే.. -జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి తమ ఆస్థిత్వాన్ని కాపాడుకునేందుకు జనగామ జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి అన్నారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని భావించి ప్రభుత్వం జనగామ జిల్లా చేస్తున్నట్లు ప్రకటించి ప్రజల ఆకాంక్షను విలువనివ్వాలని కోరారు. జన గర్జన సభకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్భంద కాండ స్వరాష్ట్రంలో తమపై మోపుతూ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.