breaking news
Jairam Sridharan
-
10.4 శాతం వడ్డీకే 20 ఏళ్ల గృహ రుణం
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్తగా 10.40 శాతం స్థిర వడ్డీ రేటుతో 20 ఏళ్ల గృహ రుణ పథకాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. రూ. 50 లక్షల దాకా రుణాలకు ఇది వర్తిస్తుంది. అందుబాటు ధర గృహాల కొనుగోలుకు ఉపకరించేలా ఈ పరిమిత కాలం ఆఫర్ను అందిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ (రిటైల్ రుణాల విభాగం) జైరామ్ శ్రీధరన్ చెప్పారు. బేస్ రేటు కన్నా ఈ వడ్డీ రేటు పావు శాతం అధికంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం బేస్ రేటు 10.15 శాతంగా ఉంది. బ్యాంకు ఖాతాదారులు కావాలనుకుంటే స్థిర వడ్డీ రేటు పథకం నుంచి చలన వడ్డీ రేటు పథకానికి మారొచ్చని శ్రీధరన్ పేర్కొన్నారు. ఇందుకోసం కొంత మొత్తం రుసుములైనా కట్టాలని, లేదా బాకీ ఉన్న అసలు మొత్తంపై 2% ఫోర్క్లోజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
అల్పాదాయవర్గాలకూ గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న అల్పాదాయ వర్గాల కోసం ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నెలవారి ఆదాయం రూ.8,000 ఉంటే చాలు గృహరుణం ఇస్తానంటోంది. సాధారణంగా పలు బ్యాంకులు నెలాదా యం రూ.25,000 ఉంటే కాని గృహరుణం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కాని యాక్సిస్ మాత్రం రూ,25,000లోపు ఉన్న వారికి కూడా రుణాలను ఇస్తానంటోంది. కాని వీరిపై మాత్రం కొద్దిగా అధిక వడ్డీరేటును వసూలు చేస్తానంటోంది. ఇలాంటి రుణాలపై 10.75% వడ్డీరేటును వసూలు చేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. అదే జీతం ఆదాయం కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారు మాత్రం 11% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాధారణ గృహరుణాలపై కాలపరిమితిని బట్టి 10.25% నుంచి 11.25% వరకు వడ్డీరేటును వసూలు చేస్తోంది. ఈ ఏడాది రూ.500 నుంచి రూ.1,000 కోట్ల విలువైన చిన్న గృహరుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ఇప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను చేపడుతుండగా, ఈ ఆదాయం పరిధిలోకి సుమారు 2.5 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటై 20 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.