breaking news
jai prakash agarwal
-
ఈశాన్య ఢిల్లీ ఎన్నికల చిత్రం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల జోరు
అనుభవం, నిరాడంబరత, స్థానికుల్లో మంచి పేరున్నా ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైప్రకాశ్ అగర్వాల్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుండడమే. ఇదే బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ గెలుపు అవకాశాలను మెరుగుపర్చవచ్చంటున్నారు. ఇక ఆప్ అభ్యర్థి ఆనంద్‌కుమార్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కొంతమేర ప్రభావం చూపవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటైంది. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గంలోని ప్రాంంతాలతో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన జైప్రకాశ్ అగర్వాల్, బీజేపీకి చెందిన బి.ఎల్. శర్మ ప్రేమ్‌ను 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అయితే కొత్తగా ఢిల్లీ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి జేఎన్‌యూ ప్రొఫెసర్ అనంద్కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టింది. సమాజశాస్త్ర నిపుణుడిగా ఆనంద్‌కుమార్‌కు విద్యారంగంలో మంచి పేరుంది. ఆయన ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ఆప్ జాతీయ కార్యవర్గంలోనూ సభ్యుడు. అయితే సైద్ధాంతిక ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞుడైన ఆనంద్‌కుమార్ ఈశాన్య ఢిల్లీలోని కుల, మత రాజకీయాలలోఎలా నెట్టుకురాగలరన్న సందేహం ఆప్ కార్యకర్తలను వేధిస్తోంది. అదీకాక బయటి వ్యక్తిని లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కొందరు స్థానిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌కు రాజకీయాలలో అనుభవం లేకపోవడం కూడా ఆప్ విజయానికి ప్రతికూలాంశమని అంటున్నారు. అయితే నిజాయితీపరుడన్న పేరు, ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీ ఆనంద్‌కుమార్‌ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజవర్గం ఇదే. ఇక్కడి ఓటర్లలో 27 శాతం మంది ముస్లింలున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నందున ఇక్కడి నుంచి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ పార్టీ వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన అభ్యర్థిత్వం ప్రైమరీ ఎన్నికల ద్వారా ఖరారైంది. కాంగ్రెస్ ఢిల్లీలో ప్రైమరీ ఎన్నికల ద్వారా అభ్యర్థులను ఖరారు చేసిన రెండు నియోజకవర్గాలలో ఇదొకటి. జేపీ అగర్వాల్ సరళస్వభావం, నిరాడంబరత, అనుభవం ఈశాన్య ఢిల్లీ ఓటర్లకు నచ్చినప్పటికీ నగరంలో తీవ్రంగా వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, స్థానిక సమస్యలు ఆయన విజయానికి అడ్డంకిగా మారవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో అనధికార కాలనీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గం మిగతా ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నట్లు ఉంటుంది. మెట్రో సదుపాయం లేదు. ఇతర ప్రజారవాణా సదుపాయాల లభ్యత కూడా తక్కువే. బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం దేశమంతటా రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని, మైనారిటీల ఓట్లు దక్కకపోయినా పూర్వాంచలీయుల ఓటర్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆపార్టీ భోజ్‌పురి గాయకుడు, నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. ఈ నియోజవర్గం జనాభాలో 45 శాతం మంది పూర్వాంచలీయులున్నారు. పూర్వాంచలీ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయటివాడన్న వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ఆనంద్‌కుమార్‌కు టికెట్ ఇచ్చిందని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. ఆనంద్‌కుమార్ వారణాసిలో జన్మించారని, ఆయన కొంతకాలం బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా పనిచేశారని వారు అంటున్నారు. ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హజ్ కమిటీ సభ్యుడు సమీ సల్మానీకి బీఎస్పీ టికెట్ ఇచ్చింది. బురాడీ, తిమార్పుర్, సీమాపురి, రోహతాస్‌నగర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకుల్పూర్, ముస్తఫాబాద్, కరావల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందకు వస్తాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పది నియోజకవర్గాలలో ఐదింటిలో బీజేపీ, మూడింటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. -
హస్తిన హస్తానికి మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తినలో పదిహేనేళ్లుగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవడంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యం లో పార్టీకి మరమ్మతులు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేయడంతోపాటు కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సీనియర్ నాయకులను పక్కన పెట్టి 46 ఏళ్ల అర్విందర్‌సింగ్ లవ్లీకి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిద్వారా ఢిల్లీలో పార్టీకి యువరక్తం ఎక్కించనున్నట్టు సంకేతాలు పంపింది. పార్టీలో ఏళ్లుగా పాతుకుపోయిన నాయకులపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణంగా అధిష్టానం భావిస్తోందని కొందరు నాయకులు పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో షీలాసర్కార్ 15ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలే కపోయామని రాహూల్ గాంధీ స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిపారు. డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న జైప్రకాశ్ అగర్వాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ మధ్య అంతరాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టు సమచారం. కొత్తగా డీపీసీసీ పగ్గాలు చేపట్టిన అర్విందర్‌సింగ్ లవ్లీకి షీలాదీక్షిత్‌కి సాన్నిహిత్యం ఉండడంతో ఇకపై ఎలాంటి విభేదాలు ఉండబోవన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. యువతకు చేరువయ్యేందుకే... ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా ఉన్న యువతకు చేరువ కాలేకపోవడమూ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీంతో యువతకు ప్రాధాన్యం పెంచితే కొత్త ఉత్సాహాన్ని పార్టీలో నింపవచ్చన్నది వారి భావన. 1987 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న అర్విందర్‌సింగ్ లవ్లీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ నాయకులతో లవ్లీకి ఉన్న సాన్నిహిత్యం అంతర్గత విభేదాలు తొలగించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే వీలైనంత మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ షీలాదీక్షిత్‌పై ఉన్న నమ్మకంతో ఆమె సలహా మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఎక్కువ స్థానాల్లో పోటీకి దింపారు. సరిగ్గా అదే వ్యూహం బెడిసికొట్టడంతో పార్టీ నాయకత్వం మరోమారు ఆలోచనలో పడింది. కత్తిమీద సామే... పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితుల్లో డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అర్విందర్‌సింగ్ లవ్లీ ఎంతో నేర్పుగా వ్యవహరించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నిక లకు గడువు చాలా తక్కువగా ఉండడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడం అంతసులువైన పనేంకాదు. ఇన్నాళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లో, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఆ ప్రాంతాలను తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడం అంత సులువేం కాదు. ఇన్నాళ్లు అధికార మంత్ర దండంతో ప్రజలను ఆకర్షించినట్టు చేసేం దుకు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం లేదు. వీట న్నింటి నడుమ పార్టీ పూర్వవైభవం తేవడంలో లవ్లీ ఏమేరకు సఫలమవుతారో మరికొద్ది నెలల్లో తేల నుంది. మరోవైపు పార్టీ అధిష్టాన వర్గం తనపై ఉంచిన అంచనాలు అందుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని అర్విందర్‌సింగ్ లవ్లీ వ్యక్తం చేస్తున్నారు.