Jaggayya
-
జగమెరుగని జగ్గయ్య బహుముఖ ప్రతిభ
అది 1975 సంవత్సరం... కర్నూల్ మెడికల్ కాలే జీలో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు కాలేజీ వార్షికోత్సవానికి నేను మద్రాసు వెళ్లి జగ్గయ్యగారిని ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. అదే ఆయనతో నా మొదటి పరిచయం. ఆయనంటే నాకు వల్లమాలిన అభిమానం. నేను 1983లో విజయవాడలో సైకియాట్రిస్టుగా ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత జగ్గయ్యగారు బెజవాడ వచ్చినప్పుడల్లా కలిసేవాడిని.నేను రచించిన ‘మనో దర్పణం’ మనోవైజ్ఞానిక గ్రంథాన్ని 1996లో విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఆవిష్కరించేందుకు నా కోరిక మేరకు ఆయన మద్రాసు నుండి రావడం నా పైన, సాహిత్యం పైన ఆయనకున్న అభిమానానికి తార్కాణం. ఆయన చివరి వరకు చెన్నై వెళ్లినప్పుడల్లా మేం కలిసి పలు విషయాలు ముచ్చటించుకునేవాళ్లం. ఒక డాక్టర్‌గానే కాకుండా రచయితగా సాహిత్యం పైన మక్కువ ఉన్న వ్యక్తిగా నన్ను ఆయన ఇష్టపడేవారు. అదే నాకు, జగ్గయ్యగారికి ఉన్న సాహితీ బంధం.ఇది జగ్గయ్య శతజయంతి సంవత్సరం1926 డిసెంబర్ 31న జన్మించిన జగ్గయ్య 2004 మార్చి 4న మరణించారు. జగ్గయ్య చలనచిత్ర నటుడిగానే అందరికీ తెలుసు కానీ, మిగతా ఏ నటులకు లేనన్ని బహుముఖ ప్రతిభలు ఆయనకే సొంతం. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో ‘ప్రియురాలు’ (1952) సినిమాతో ప్రారంభమైన ఆయన దాదాపు 500 సినిమాల్లో నటించారు. ‘కుంతీపుత్రుడు’ (1993) ఆయన చివరి చిత్రం. జగ్గయ్య నిర్మించి, నటించిన ‘పదండి ముందుకు, కీలు బొమ్మలు’ చిత్రాలు అటు మాస్కో, కార్క్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ప్రశంసలు అందుకు న్నాయి. జగ్గయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్, సాఫ్ట్ విలన్ రోల్స్ వేస్తే అసలు హీరో కనబడకుండా పోయేవాడని ఆ కాలంలో ప్రతీతి. పాలిష్డ్ విలన్ రూపకర్తతెలుగు సినిమాల్లో ‘పాలిష్డ్ విలన్’ పాత్రలకు మొదట రూపకల్పన చేసింది జగ్గయ్యే! అసాధారణ సాత్విక భావ ప్రకటన, ఉచ్చారణ వైవిధ్యం ఆయన్ను తెలుగు సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని నటుడిగా నిలబెట్టాయి. హీరో అంటే స్టెప్పులు, డాన్స్, స్టంట్స్ కాకుండా నిజజీవితంలో ఒక హీరో ఎలా ఉండాలో అలాగే సినిమాల్లో కూడా హీరో పాత్ర సహజంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం.సావిత్రి, జమున సినిమాల్లోకి రాకముందు నాటక రంగానికి వారిని పరిచయం చేసింది జగ్గయ్యే! అలాగే ప్రముఖ హీరో కృష్ణను (actor krishna) ‘తేనె మనసులు’ చిత్రానికి ముందే జగ్గయ్య తాను 1962లో నిర్మించిన ‘పదండి ముందుకు’ ద్వారా పరిచయం చేసినది బహుశా చాలామందికి తెలియని విషయం. ఇక కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని రూథర్ ఫోర్డ్ పాత్రలో జగ్గయ్య నటన అమితంగా ఆకట్టుకుంది. ఇంకా జగ్గయ్య తెలుగుకి పరిచయం చేసినవారిలో కన్నడ నటి భారతి, నటుడు శ్రీధర్ ఉన్నారు. సంగీత దర్శకుడు కోదండపాణిని ‘పదండి ముందుకు, కన్న కొడుకు’ చిత్రాల ద్వారా పరిచయం చేసింది, ఇంకా పలువురు రచయితలను పరిచయం చేసిన ఘనత జగ్గయ్యదే.టీచర్ నుంచి న్యూస్ రీడర్‌గా...దుగ్గిరాల స్కూల్లో టీచర్‌గా ప్రారంభమైన జగ్గయ్య కెరీర్ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్‌గా వెళ్లడంతో జర్నలిస్ట్‌గా మలుపు తిరిగింది. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అనగానే ఆయన కంచు కంఠానికి అందరూ చెవులప్పగించేవారు. శివాజీ గణేశన్ (Sivaji Ganesan) నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో జగ్గయ్యే డబ్బింగ్ చెప్పారు. ఇక నాటక రంగానికి వస్తే చిన్న వయస్సు నుండే రంగస్థలం మీద నటుడిగా– దర్శకుడిగా రాణించారు. షేక్స్పియర్ ఇంగ్లిష్ నాటకాలను అనువదించి, ప్రదర్శించేవారు కూడా. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏలో సహవిద్యార్థి అయిన ఎన్టీఆర్, ముక్కామల, శివరావులతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించారు.చిన్న వయసులోనే రచయితగా...జగ్గయ్య తన 14వ ఏట నుండి కవితలు, నాటికలు రాయటం మొదలుపెట్టారు. ఆ చిన్న వయసులోనే హంపి వెళ్లి అక్కడి శిధిలావస్థను చూసి, చలించి తన స్వదస్తూరితో రాసుకున్న పద్యాలలో మచ్చుకు ఒకటి. విశ్వకవి రవీంద్రుడి ‘గీతాంజలి’ని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించి అందరి ప్రశంసలు అందుకున్నారు జగ్గయ్య. రాజకీయాలపై ఉన్న మక్కువతో ‘రాజకీయ విజ్ఞాన కోశం’గ్రంథాన్ని రాశారు. ‘దేశాభిమాని’ పత్రికకు 1944లో సబ్ ఎడిటర్‌గాను, ‘ఆంధ్రా రిపబ్లిక్’ అనే ఆంగ్ల పత్రికకు ఎడిటర్‌గాను బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభకు ఎన్నికైన తొలి నటుడుమొదటి నుండి జగ్గయ్యకు రాజకీయాలంటే మక్కువ. ఆచార్య నరేందర్ దేవ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉంటూ తదుపరి 1958లో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1962 జనరల్ ఎలక్షన్స్ లో తెనాలి లోక్‌సభ నుండి ఆచార్య ఎన్జీ రంగా మీద పోటీకి కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యను నిర్ణయించగా, ఆయన్ను నాటి ప్రధాని నెహ్రూ ఢిల్లీకి రప్పించి, రంగా మీద పోటీ వద్దని వారించారు.కమ్యూనిస్టుల చేతిలో రంగా ఎలాగైనా ఓడిపోతారని జగ్గయ్య చెప్పినా, రంగా ఓటమికి కాంగ్రెస్ పార్టీ కారణం కాకూడదు, రంగా లాంటివారు పార్లమెంటుకు రావడం అవసరం అని జగ్గయ్యను పోటీ నుంచి విరమింపజేశారు నెహ్రూ. తదుపరి 1967 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుండి జగ్గయ్య కమ్యూనిస్టు అభ్యర్థిపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి భారత దేశంలోనే సినీ రంగం నుండి లోక్‌సభకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్‌కి ఎక్కారు.చిత్రకారుడుగానూ...జగ్గయ్య మంచి చిత్రకారుడు కూడా. అడవి బాపిరాజు (Adivi Baapiraju) దగ్గర శిక్షణ పొంది పలు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు. ఇన్ని రంగాల్లో ఉంటూ కూడా సినీ కార్మికుల సంక్షేమం కోసం దక్షిణ భారత సినీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయనకు వాస్తు శాస్త్రంపై మక్కువ ఎక్కువ. అయితే మూఢనమ్మకాలతో ఇల్లు గుల్ల చేసుకోకుండా వాస్తును శాస్త్రీయ కోణంలో మాత్రమే చూసి ఆచరించాలనేవారు.ఆత్రేయతో అనుబంధంఆచార్య ఆత్రేయ (Acharya Aatreya) అంటే జగ్గయ్యకు వల్ల మాలిన అభిమానం. ఆత్రేయ గురించి ‘మాది మనసులు కలిసిన అనుబంధం’ అనేవారు. ఆత్రేయ కడపటి కోర్కెను తీర్చడం కోసం ‘మన స్విని ట్రస్టు’ తరపున జగ్గయ్య సంపాదకత్వం వహించి, ప్రచురించిన ‘ఆత్రేయ సాహితి’ ఏడు సంపుటాల సెట్ జగ్గయ్యకు ఆత్రేయతో ఉన్న అనుబంధానికి ఒక నిదర్శనం. ‘మనస్విని’ సంస్థ ఎంపిక చేసిన పాటలకే పలుమార్లు ప్రభుత్వ నంది అవార్డులు కూడా రావటం ఆయన ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా జరిగే ఎంపికే అన్నది పరిశీలకుల అభిప్రాయం. అభిమాన సంఘాలకు, ప్రచారాలకు, ఆర్భాటాలకు ఆమడ దూరం ఉండేవారు. 1992లో పద్మ భూషణ్ తెనాలి ఆర్ట్స్ కాలేజీకి, వరంగల్ మెడికల్ కాలేజీకి, మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు ఉదారంగా విరాళమిచ్చారు. పురస్కారాల విష యానికొస్తే.. 1967లో అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుండి ‘కళావాచస్పతి’ పురస్కారం, 1991లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1992లో తెలుగు చిత్రసీమలో నేరుగా పద్మభూషణ్ గౌరవాన్ని రాష్ట్రపతి నుండి పొందిన ఘనత జగ్గయ్యదే.ప్రతిభలు అనేకంజనానికి తెలియని జగ్గయ్య బహుముఖ ప్రతిభలు అనేకం. ఆయన కేవలం నటుడే కాదు గొప్ప సాహితీవేత్త, మంచి ఉపన్యాసకుడు, అధ్యాపకుడు, రాజకీయ నాయకుడు, ట్రేడ్ యూనియనిస్ట్, చిత్రకారుడు, రేడియో ప్రవక్త, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే జగ్గయ్య ఇన్ని కళల్లో ఆరితేరినా ఆయన ప్రేమించినది సాహిత్యాన్ని, పెళ్ళాడింది నటనను. ఒక సందర్భంలో మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఇచ్చే సందేశం అని అడగ్గా ‘బ్రతుకు మనకీయబడిన వరమ్ము... తిరిగి పరులకిచ్చిననే దాని ఫలము దక్కు’ అని రవీంద్రుని సూక్తి రూపంలో చెప్పారు. ఇలాంటి బహుముఖ ప్రతిభగల మహోన్నత వ్యక్తి కొంగర జగ్గయ్యకి ఆయన శతజయంతి సందర్భంగా నా దివ్యాంజలి!– డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, విజయవాడ ప్రముఖ మానసిక వైద్యులు, రచయితindlas2@gmail.com -
ప్రచారం చేయకుండానే జగ్గయ్య గెలుపు
ఎన్నికలంటేనే ప్రచారం.. హంగూ ఆర్భాటాలు.. కానీ, ఏ ప్రచారం చేయకుండానే సినీ నటుడు కొంగర జగ్గయ్య భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరి కంటే ముందు రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో గెలిచిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. సినీ నటుడు కావడంతో పెద్దగా ప్రచారం చేయకపోయినా ఎంపీగా గెలుపొందారు. జగ్గయ్య ప్రత్యర్థులు మాదాల నారాయణస్వామి (సీపీఎం), జాగర్లమూడి లక్ష్మీనారాయణ (సీపీఐ)లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా గెలవలేకపోయారు. జగ్గయ్య కేవలం నాలుగు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినా ఆయన పోటీ చేయలేదు. -
పెద్ద వ్యాఖ్యానం
సినీనటుడు జగ్గయ్య అరుదైన సాహితీవేత్త అని కొందరికే తెలుసు. తండ్రి సీతారామయ్య దగ్గర బాల్యంలో సంస్కృతాంధ్రాలను అభ్యసించిన జగ్గయ్య 15వ యేటే పద్యాలు రాశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ టాగూరు వివిధ కవితా సంపుటాల్లోంచి 137 ఖండికలను యెంచుకొని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించారు. 1980లో అవి పుస్తకంగా వచ్చాయి. పురాణ ప్రబంధ కావ్యాలలోని విశేష ప్రయోగాల గురించి జగ్గయ్య షూటింగ్స్ లేని సమయాల్లో ఆ పరిజ్ఞానం గల విద్యావంతులతో చర్చించేవారు. అలా ఆయనకు దగ్గరైన వారిలో ‘ముత్యాలముగ్గు’ నిర్మాత, నూజివీడు కళాశాలలో ప్రధాన ఆంధ్రోపన్యాసకుడు అయిన ‘ఎమ్వీయల్’ ఒకరు. ఒకనాడు వాళ్లిద్దరి మధ్య ‘మను చరిత్ర’ ప్రథమాశ్వాసంలోని ప్రవరుని గుణగణాలకు సంబంధించిన ప్రసక్తి రాగా, ఎమ్వీయల్ ‘ఆపురి బాయకుండు’ పద్యంలో పెద్దన శైలిని ప్రశంసించారట. అప్పుడు జగ్గయ్య కలిగించుకుని పద్యాంతంలో ‘ప్రవరాఖ్యు డలేఖ్య తనూ విలాసుడై’ అనే ప్రయోగానికి తనదైన భాష్యం చెప్పారు. సంస్కృతంలో ‘తనూ’ శబ్దం స్త్రీ వాచకమనీ, అనేక పర్యాయ పదాలుండగా పెద్దన తనూ శబ్దం వాడ్డం ప్రవరుడు స్త్రీ అంతటి సౌకుమార్యం కలిగినవాడని సూచించడమేనని జగ్గయ్య ఆ పద ప్రయోగ రహస్యం గురించి వ్యాఖ్యానిస్తే ఆయన పాండిత్య పటిమకు ఎమ్వీయల్ అవాక్కయ్యారట! - డాక్టర్ పైడిపాల -
బలరాజ్ సహానీ....
గ్రేట్ యాక్టర్ బలరాజ్ సహానీని మన దగ్గర కొంగర జగ్గయ్యతో పోల్చవచ్చా? ఇద్దరూ రేడియోలో అనౌన్సర్లుగా పని చేశారు. జగ్గయ్య ఆల్ ఇండియా రేడియోలో. బలరాజ్ సహాని బిబిసి లండన్‌లో. పాకిస్తాన్- రావల్పిండిలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎం.ఎ చేసిన బలరాజ్ సహాని లండన్ నుంచి దేశ విభజనకు ముందే ముంబై చేరుకున్నాడు. అక్కడే ఆయన నటుడిగా తన ప్రస్థానం మొదలెట్టాడు. ధర్తీ కా లాల్ (1946), దో భిగా జమీన్ (1953), కాబూలీవాలా (1961) వంటి సినిమాలు ఆయన ఒక గొప్ప నటుడని నిరూపించడమే కాక భారతీయ సినిమాని ప్రపంచ సినిమా రంగంలో సగౌరవంగా నిలబెట్టాయి. గొప్ప గొప్ప చలన చిత్రోత్సవాల్లో బలరాజ్ సహానీ నటించిన సినిమాలు ప్రదర్శితమై ఆయనకు పేరు తెచ్చాయి. ఆ తర్వాత సహానికి క్యారెక్టర్ నటుడిగా మారినా వక్త్, గరం హవా వంటి మంచి సినిమాలు చేసినా ఆయన ఉండాల్సినంత బిజీగా మాత్రం ఉండలేదు. దానికి కారణం ఆయనకు ఉన్న పేరు కావచ్చు... కమ్యూనిస్టు పార్టీలో ఆయన చాలా పెద్దస్థాయి పేరున్న వ్యక్తి కావడం వల్ల కావచ్చు. సహానీ నటనతో పాటు రచననూ సాధన చేశాడని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పంజాబీలో ఆయన రాసిన పుస్తకాలు ఆయనను పెద్ద రచయితను చేశాయి. చనిపోయేనాటికి (1973) సహాని వయసు 59 ఏళ్లు. మన రాజ్‌కుమార్ హిరాణి సినిమాల్లో తప్పకుండా కనిపించే పరిక్షిత్ సహాని ఈయన కొడుకే. -
మనుషులు చేసిన దేవుడు
ఇంటికి తీసుకొచ్చి... ప్రతిష్ఠించి... మనస్ఫూర్తిగా ఆరాధించి... తనకి నచ్చినవన్నీ వడ్డించి... భజన చేసి... గుంజీలు తీసి... పండగ చేసి... అదేంటో... తీసుకె ళ్లి నీళ్లల్లో వేసేస్తాం. పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించిన గణపతిని... ఆయనతో కొద్దిరోజుల్లోనే పెంచుకున్న అపార మైన ఆప్యాయతని... అంత సులువుగా తెంపుకుని... ఎలా? దేవాలయంలో ప్రతిష్ఠిస్తే మనం మునకలు తీస్తాం. ఏంటో... బొజ్జ గణపయ్యని... అలా?! ఈ సినిమాలో వినాయకుడి బొజ్జలో స్మగుల్డ్ గూడ్స్ పెడతారు. కథ రాసేటప్పుడు అపచారం అనిపించే ఉంటుంది. సెంటిమెంట్‌ని దెబ్బతీస్తామేమో అన్న భయం కూడా ఉండే ఉంటుంది. అయినా... అలా చేశారంటే... దేవుడు... దేవుడు చేసిన మనుషుల్లోనే ఉంటాడు... మనుషులు చేసిన దేవుళ్లలో ఇహబంధాలే ఉంటాయి... వాటిని నిమజ్జనం చేయగలిగితేనే... పరిహారం అవుతుందని కావచ్చు. నిమజ్జనాలు మొదలయ్యాయి. పెద్ద నిమజ్జనం... వచ్చే ఆదివారం. కానీ ఈ ఆదివారం ఫ్యామిలీలో మీరు కనులారా వీక్షించబోయే నిమజ్జనం దానికన్నా పెద్దది! సొసైటీలో పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్నవారు సర్వసంగ పరిత్యాగుల్లా తయారై దేవుణ్ని తలకెత్తుకుని నిర్వహిస్తున్న మహాయజ్ఞంలాంటి మహా నిమజ్జనం ఇది. కొద్ది క్షణాల్లో రథంపై ఊరేగబోతున్న ఈ వినాయకుడిని అడుగుల్లో కాదు, తులాల్లో కొలవాలి. విగ్రహంలోని మట్టిని కాదు, బంగారాన్ని తూచాలి. గోల్డ్ గణేశ! ఊరేగింపు ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో స్కెచ్ గీసి చెబుతున్నాడు కొంగర జగ్గయ్య. శ్రద్ధగా వింటున్నాడు విదేశీ ఏజెంటు. ‘వెల్. హియర్ ఇటీజ్. వినాయకుడి రథం ఈ స్పాట్ నుంచి బయల్దేరుతుంది. పురవీధుల గుండా ఊరేగిస్తాం. చిట్టచివరకు ఈ సముద్రపుపాయ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ ప్రజలందరూ చూస్తుండగా... ఈ విగ్రహాన్ని నీళ్లల్లో తోసేస్తాం. నీళ్ల అడుగున మీ మనుషులు హుక్స్‌తో రెడీగా ఉంటారు. నీళ్లలో పడగానే విగ్రహానికి ఆ హుక్స్ తగిలిస్తారు. అటు తర్వాత నీళ్ల అడుగు నుంచి దాన్ని షిప్ వరకు లాక్కెళతారు. దట్సాల్. ‘డన్’ అన్నాడు ఏజెంటు. లోపల ఉన్నది కోటి రూపాయల సరుకు! వట్టి సరుకు కాదు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపద. జగ్గయ్య స్మగ్లర్. ఎప్పుడూ పూల కుండీల్లో దేవతా విగ్రహాలు పెట్టి స్మగుల్ చేసే జగ్గయ్య... ఈసారి హోల్‌సేల్‌గా బొజ్జ గణపయ్య కడుపులో ఉండ్రాళ్లలా దాచి బంగారు విగ్రహాలను విదేశాలకు తరలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సీన్ క్లైమాక్స్‌కి వచ్చింది! అడ్డు పడేవాళ్లెవరూ లేరు. అడ్డు పడబోయిన ఎన్టీఆర్ ఆల్రెడీ జగ్గయ్య డెన్‌లో బందీగా చిక్కుకొని ఉన్నాడు. ఎన్టీఆర్‌తో పాటు అతడికి మనసిచ్చిన చిన్నది జయలలిత కూడా అతడితోపాటు బందీగా ఉంది. ఎన్టీఆర్ చెల్లెలు కాంచన మరో సెల్లో బందీగా ఉంది. కాంచన ప్రియుడు జగ్గయ్య అదే సెల్లో బందీగా ఉన్నాడు. జగ్గయ్య అంటే స్మగ్లర్ జగ్గయ్య కాదు. సాఫ్ట్ క్యారెక్టర్ జగ్గయ్య. (డబుల్ యాక్షన్). ఎన్టీఆర్‌ను ‘బావా’ అంటుండే తాగుబోతు సత్యనారాయణ సేమ్ డెన్‌లో తప్పతాగి పడి ఉన్నాడు. అప్పుడొచ్చాడు కృష్ణ. దారి వెతుక్కుంటూ డెన్లోకి ప్రవేశించాడు. ‘అన్నయ్యా’ అన్నాడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి. ‘తమ్ముడూ.. ఆ దుర్మార్గులు మమ్మల్నందర్నీ అంతం చెయ్యడానికి టైమ్ బాంబ్ పెట్టారు’ చెప్పాడు ఎన్టీఆర్. ఎక్కడుందా టైమ్బాంబ్? స్పృహలేకుండా పడివున్న సత్యనారాయణ చేతుల్లో ఉంది. ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఇంకో టైమ్ బాంబ్! అక్కడ నిమజ్జనం స్టార్ట్ అయింది. వినాయకుడి భారీ విగ్రహం ఊరేగింపునకు సిద్ధమైంది. అదీ ఒక టైమ్ బాంబులా ఉంది. బొజ్జ గణపయ్య కడుపులో బోలెడంత గోల్డ్. ఎన్టీఆర్, కృష్ణ... సమయానికి అక్కడికి చేరుకోలేకపోతే అది విదేశాలకు తరలి వెళుతుంది. ఆపాలి. ఎలా? ఎన్టీఆర్‌లో టెన్షన్. కృష్ణలో టెన్షన్. ప్రేక్షకులలో టెన్షన్. విలన్ జగ్గయ్య మాత్రం కూల్‌గా ఉన్నాడు. ఎప్పుడూ కనిపించే దానికి భిన్నంగా సూటూబూటులో కాకుండా తెల్లటి లాల్చీ పైజమాలో ఉన్నాడు. మెడలో మాల. ముఖంపై చిరునవ్వు. నుదుటిపై నిలుపు బొట్టు. ‘భక్త మహాజనురాలా... పవిత్రమైన మన భారతదేశం ఈనాడు అనేక ఈతిబాధలకు గురవుతున్నదంటే అందుకు కారణం ప్రజల్లో దైవభక్తి లోపించడమే. అందుచేత దేశక్షేమం, ప్రజాక్షేమం కోరి ఈ ఆస్తికతా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు’ అని ప్రారంభోపన్యాసం చేశాడు. జై విఘ్నరాజా... జై గణాధిపా... ఊరేగింపు మొదలైంది. ఊరేగింపు చాటున బంగారు విగ్రహాల తరలింపూ మొదలైంది. బందిఖానా బద్దలు కొట్టుకుని వచ్చేశారు మన హీరోలు! ‘పాపం బద్దలు కావాలి. మోసం బయటికి రావాలి’ అని పాడారు. ‘నాటి గణపతికి పొట్ట పగిలితే రాలేను ఉండ్రాళ్లు... ఉండ్రాళ్లు. నేటి గణపతికి బొజ్జ పగలితే రాలను రత్నాలు... రత్నాలు’ అని జనానికి హింట్ ఇచ్చారు. జగ్గయ్య షాక్ తిన్నాడు. ‘భక్తులారా... వీళ్లెవరో మన ఆస్తికత్వాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన మతద్రోహులు. జాతిద్రోహులు. ఇలాంటి దైవద్రోహులను ఊరికే విడిచిపెట్టకూడదు. కొట్టండి. పెడ రెక్కలు విరవండి. రథచక్రాలకు కట్టిండి. ఈ నాస్తికుల శవాల మీదుగా మన జగన్నాథ రథాన్ని నడపండి. జై గణాధిపా...’ అని పిలుపునిచ్చాడు జగ్గయ్య. కలకలం మొదలైంది. భక్తజనం కకావికలం అయ్యారు. కోపోద్రిక్తులు అయ్యారు. గాలిలోకి రెండు కాల్పులు కాల్చి వారి దారికి తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ. టెంకాయతో గణపతి పొట్టను పగులగొట్టారు. రత్నాలు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు బయటపడ్డాయి. జగ్గయ్య బండారమూ బద్దలైంది. ఎన్టీఆర్‌దే కీ రోల్ దేవుడు చేసిన మనుషులు 1973లో విడుదలైంది. క్లైమాక్స్‌లో నిమజ్జనం సీన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మాటలు త్రిపురనేని మహారథి. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి. నిమజ్జనం సీన్, మాటలు, పాటలు... ఈ మూడూ... సినిమాను సూపర్ హిట్ చేశాయి. వాటితో పాటు రమేశ్‌నాయుడు సంగీతం. అప్పటి వరకు మాయాబజార్, గుండమ్మ కథ, పాండవ వనవాసం... ఇవే తెలుగు సినిమా హిట్స్. ఆ వరుసలోకి దేవుడు చేసిన మనుషులు కూడా చేరింది. నిజానికప్పుడు ఎన్టీఆర్ ఏవరేజ్లో ఉన్నాడు. కృష్ణ సాహసం చేసి ఎన్టీఆర్‌ని హీరోగా తీసుకున్నాడు. సినిమా ఎన్టీఆర్‌తో మొదలౌతుంది. ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాటతో ప్రారంభం అవుతుంది. ఎండ్ సీన్లో కూడా ఎన్టీఆర్‌దే కీ రోల్. దేవుడు చేసిన మనుషుల్లారా.. అనేదే కీ సాంగ్. అలా అడుగుడుగునా... ఇరవై రీళ్ల పాటు చిక్కగా కథలను అల్లుకొచ్చారు దర్శకుడు వి.రామచంద్రరావు. ‘పోయిన’ కొడుకుపై ఎస్వీఆర్ బెంగ ఎస్వీరంగారావు పెద్ద జమీందారు. టీ ఎస్టేట్ ఓనర్. ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఎన్టీఆర్. చిన్నకొడుకు కృష్ణ. కూతురు కాంచన. భార్య ఎస్. వరలక్ష్మి. వారితో పాటు వాళ్ల ఇంట్లో భార్యగారి తమ్ముడు సాక్షి రంగారావు. ఎన్టీఆర్ చిన్నప్పుడే తప్పిపోతాడు. (తిప్పిపోలేదు, సాక్షి రంగారావే తప్పిస్తాడని తర్వాత తెలుస్తుంది). ‘పోయిన’ కొడుకు కోసం ఎస్వీఆర్ బెంగపెట్టుకుంటాడు. చివర్లో తను చేరదీసిన రామూనే ఎన్టీఆర్ అని తెలుస్తుంది. ఎస్వీరంగారావు (చనిపోయిన) మొదటి భార్య కొడుకే ఎన్టీయార్. చిన్నప్పుడు ఎన్టీఆర్ బర్త్‌డే పార్టీ జరుగుతుంటే... ఆస్తి దక్కకుండా ఉండడం కోసం సాక్షి రంగారావే అక్కతో కలిసి ప్లాన్ వేసి, అతణ్ణి నీళ్లలో తోసేస్తాడు. అలా నిర్మలమ్మకు దొరుకుతాడు ఎన్టీఆర్. కథ మొత్తం ఎస్వీఆర్, ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుంది. ఇంకో ట్రాక్‌లో జగ్గయ్య అండ్ గ్యాంగ్. కామెడీ ఉండీలేనట్లు ఉంటుంది. అల్లురామలింగయ్యకు, సత్యనారాయణకు మధ్య నాలుగు ముక్కలేవో ఉంటాయి. సినిమా అంతా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఒక రొమాంటిక్ సాంగ్ (దోరవయసు చిన్నది). ఒక ఐటమ్ సాంగ్ (మసక మసక చీకట్లో). ఒక లవర్‌బాయ్ సాంగ్ (ఏ తారలోనూ, నీ తీరు లేదు...) దీన్ని కృష్ణ పాడతాడు. కాసేపు జమునతో, కాసేపు మంజులతో. ఆ తర్వాత వాళ్లిద్దరూ కనిపించరు. గెస్ట్‌రోల్‌లో ఇలా మెరిసి, అలా వెళ్లిపోతారు. ఇవి కాకుండా, ఒక ఉద్వేగ గీతం.. ‘అలనాటి వేణుగానం మోగింది మరల...’ ఇంకోసాంగ్... ‘నీ దగ్గర ఏదో ఏదో ఉంది...’ వలపు సంకెల వేసే పాట. కాంతారావును మాయ చేసి ధ్యాస మళ్లించడానికి జయలలిత పాడుతుంది. నాన్నగారిపై కృష్ణ కినుక ఎన్టీఆర్ మొదట దొంగ! ఇంటినుంచి తప్పిపోయాక, ఎక్కడెక్కడో పెరిగి, దొంగల సావాసం పట్టి అలా అవుతాడు. ఓ సంఘటనతో అతడికి జయలలిత పరిచయం అవుతుంది. అమె జగ్గయ్య చెల్లెలు (సొంత చెల్లి కాదు). ఇంకో సంఘటనతో అతడు ఎస్వీరంగారావు ఇంటి మనిషి అవుతాడు. ఇది కృష్ణకు ఇష్టం ఉండదు. ఎవడినో తెచ్చి నాన్నగారు ఇంట్లో పెట్టుకున్నారు అనే కోపంతో ఉంటాడు. ఎన్టీఆరే తన అన్న అని తెలిసేంతవరకు అలానే ఉంటాడు. ఈ వాస్తవాలన్నీ ఎన్టీఆర్‌కు తెలిసినా, సమయం వచ్చే వరకు బయటపెట్టడు. చెడపకురా చెడేవు ఇక విజయనిర్మల పేదింటి అమ్మాయి. సత్యనారాయణ చెల్లెలు. ఎస్టేట్‌లో పని చేస్తుంటుంది. కృష్ణ ఆమె మీద మనసు పడతాడు. ఆ అమ్మాయి కాదంటుంది. ఇతడి పంతం పెరుగుతుంది. అదో ట్రాక్. విజయనిర్మల తల్లి నిర్మలమ్మ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కృష్ణ వెళ్లి ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సత్యనారాయణ తన అలవాటుగా రోడ్డుపై నాడా విసిరి, కృష్ణ కారుకు పంక్చర్ వేయడానికి వస్తాడు. టైరు మార్చడానికి వచ్చి కారులో ఉన్న తల్లిని చూసి కుప్పకూలిపోతాడు. సినిమాలో ఇదొక హృద్యమైన సన్నివేశం. చెరపకురా చెడేవు అన్నది నీతి. ఇన్ని ట్విస్టులతో సాగే ఈ కథలో మొదట చెడ్డవాళ్లుగా ఉన్న ఒక్కొక్కరూ ఒక్కో గుణపాఠంతో మారుతూ వస్తారు. ఎట్ ది ఎండ్... చెడ్డవాళ్లు జైలుకు వెళతారు. మంచివారు అనుబంధాలలో చిక్కుకుంటారు. ఎన్టీఆర్‌కి జయలలితకి, కృష్ణకి విజయనిర్మలకి, కాంచనకీ, మంచి జగ్గయ్యకి పెళ్లి. ఎస్వీరంగారావు ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతుంది. స్మగ్లర్లు దొంగిలించుకెళ్లిన శ్రీకృష్ణుడి విగ్రహం తిరిగి ఆ ఇంటికి చేరి శ్రీరామరక్షలా ఉంటుంది. దేవుడు చేసిన మనుషులు రకరకాలు. ఆ మనుషుల్లో కొందరు సాటి మనుషులకు దేవుళ్లలా అనిపిస్తారు. అలాంటి ఒక దేవుడే... కుటుంబాన్ని చక్కదిద్ది, సమాజాన్ని మేల్కొలిపిన ‘రాము’ పాత్రధారి ఎన్టీఆర్. విశేషాలు ఎన్టీఆర్ తొలిసారిగా బెల్‌బాటమ్ ప్యాంట్‌తో ఈ సినిమాలో కనిపిస్తారు. కాంతారావు (స్మగ్లింగ్ ముఠా సభ్యుడు)ఇందులో చిన్నపాటి విలన్. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఆయన్ని హీరోగా మాత్రమే చూశారు. ఈ చిత్రంలో సూటు బూటుతో కనిపించే కాంతారావు ఆ తర్వాత జానపద చిత్రాలలో నటించడం తగ్గించారు. ఈ చిత్రం సమయంలోనే ఎన్టీఆర్ నా అభిమాన నటుడని కృష్ణ ప్రకటించారు. దేవుడు చేసిన మనుషులు 29 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్


