breaking news
ITI course
-
డ్రోన్ శక్తి.. ఐటీఐల్లో కొత్త కోర్సు.. ప్రయోజనాలు ఇవే
న్యూఢిల్లీ: వివిధ అప్లికేషన్స్ ద్వారా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ (డ్రాస్), ’డ్రోన్ శక్తి’ని ప్రాచుర్యంలోకి తెచ్చే విధంగా స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ఐటీఐలలో నైపుణ్యాలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. రక్షణ రంగ సంబంధించి పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాల్లో (ఆర్అండ్డీ) పాలుపంచుకునేందుకు పరిశ్రమ, స్టార్టప్‌లు, విద్యావేత్తలకు కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు, ఇందుకు డిఫెన్స్ ఆర్అండ్డీ బడ్జెట్ లో 25% కేటాయిస్తున్నట్లు సీతారామన్ చెప్పారు. స్టార్టప్‌లకు చేయూత అంకుర సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. 2023 మార్చి 31 వరకూ ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు పన్నుపరమైన ప్రోత్సాహకాలు లభిస్తాయని ప్రకటించారు. వాస్తవానికి 2022 మార్చి 31 వరకూ ఏర్పాటైన వాటికే ఈ అర్హత ఉండేది. దీన్ని మరో ఏడాది పొడిగించారు. ఏర్పాటైన తర్వాత పదేళ్ల వ్యవధిలో ఈ సంస్థలకు వరుసగా మూడేళ్ల పాటు పన్ను ప్రోత్సాహకాలు పొందే వీలు ఉంటుంది. 2016 ఏప్రిల్ 1 తర్వాత ప్రారంభమైన స్టార్టప్ సంస్థలు ఆదాయ పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్మంత్రిత్వ శాఖల బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన సంస్థలు పదేళ్ల కాలవ్యవధిలో వరుసగా మూడేళ్ల పాటు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు. -
After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్!
కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైన దశ. అందుకే టెన్త్ను ‘టర్నింగ్ పాయింట్’ అంటారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థికి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందా.. సైన్స్‌లో మంచి మార్కులు వచ్చాయా.. అతని స్కిల్ సెట్ ఏంటి అనే దానిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా ఏ కోర్సులో చేరాలో, ఏ కెరీర్ ఎంచుకోవాలో సలహా ఇస్తుంటారు. పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు/ ఇంటర్మీడియట్లో చేరే గ్రూప్.. భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ మార్గాలపై ప్రత్యేక కథనం.. ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవాలని; ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. కొందరు డాక్టర్, మరికొందరు ఇంజనీర్, ఇంకొందరు లాయర్.. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్.. ఇలా ఎన్నో కలలు కంటారు. ఈ కలలు సాకారం అవ్వాలంటే.. లక్ష్య సాధనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం! ఆ టర్నింగ్ పాయింటే.. పదో తరగతి!! పదో తరగతి తర్వాత విద్యార్థుల ముందు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఐటీఐ కోర్సులు కనిపిస్తాయి. వీటిలో ఒక కోర్సు ఎక్కువ.. మరో కోర్సు తక్కువ కాదు. అన్నింటికీ చక్కటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే, విద్యార్థి తన భవిష్యత్ లక్ష్యం ఏమిటి.. ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకొని.. దాన్ని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నాలుగు గ్రూపులు ► పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే మార్గం.. ఇంటర్మీడియట్. వారివారి ఆసక్తులకు అనుగుణంగా గ్రూపులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. ► ఎంపీసీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు చేరుతుంటారు. వీరు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్‌లు రాసి ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్లో బీటెక్/బీఈలో ప్రవేశం పొందొచ్చు. ఇక ఏపీ/టీఎస్ ఎంసెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో చేరవచ్చు. ► బైపీసీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే.. ఈ గ్రూప్ చదివినవారు ‘నీట్’ ఎంట్రన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్,ఫార్మసీ, ఫిజియోథెరఫీ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ► సీఈసీ/ఎంఈసీ: కామర్స్ అంటే ఇష్టపడేవారు; చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు ఈ గ్రూపులు ఎంచుకుంటారు. ఇందులో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ► హెచ్ఈసీ: టీచింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారు, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చేయాలనుకునేవారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాయాలనుకునే వారు ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్ ఎంచుకుంటారు. ఇంటర్లో ఈ నాలుగు గ్రూపులతోపాటు రెండేళ్లు, ఏడాదిన్నర కాలవ్యవధి గల పలు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకేషన ల్ కోర్సులు పదో తరగతి తర్వాత సంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సులే కాకుండా.. సత్వర ఉపాధికి అవకాశం కల్పించే ఒకేషనల్ కోర్సుల్లో కూడా చేరొచ్చు. ► అగ్రికల్చర్ విభాగం: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డెయిరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్ కోర్సులు. ► బిజినెస్ అండ్ కామర్స్ విభాగం: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్. ► ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ. ► హోమ్‌సైన్స్ విభాగం: కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్. ► వీటితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా సంబంధిత పాలిటెక్నికల్ కోర్సు రెండో ఏడాదిలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉపాధికి భరోసా–ఐటీఐ ► ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్(ఐటీఐ).. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి అందుబాటులో ఉన్న కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా» టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్(మెకానికల్) ఇంజనీరింగ్ » డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్ (సివిల్) ఇంజనీరింగ్ » పంప్ ఆపరేటర్ » ఫిట్టర్ ఇంజనీరింగ్ » మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్ » టర్నర్ ఇంజనీరింగ్ » మ్యానుఫ్యాక్చరర్ ఫుట్‌వేర్ ఇంజనీరింగ్ » రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్ » మెషినిస్ట్ ఇంజనీరింగ్ » హెయిర్ అండ్ స్కిన్ కేర్ » ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ » సర్వేయర్ ఇంజనీరింగ్ » షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు ► పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. పాలిటెక్నికల్. ఈ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదం చేస్తాయి. మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు పూర్తికాగానే కంపెనీల్లో సూపర్వైజర్ స్థాయి కొలువులు దక్కించుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి ఉంటే.. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు. ► పాలిసెట్‌తో ప్రవేశాలు: తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ పాలిసెట్/ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. ► పాలిటెక్నిక్ కోర్సులివే: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డెయిరీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, గ్లాస్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్ అండ్ డిజైన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్, డిప్లొమా ఇన్ హోమ్‌సైన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ తదితర పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
లబోదిబోమంటున్న ఆంధ్రా యువత
సాక్షి, విజయవాడ: రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్‌లో ఆంధ్రా అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులను రైల్వే శాఖ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ విద్యార్థులుగా తీసుకుంటోంది. వారికి శిక్షణ ఇచ్చి తరువాత అర్హత పరీక్ష నిర్వహించి క్లాస్–4 ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలను ఉత్తర భారతదేశం యువకులు తన్నుకుపోతున్నారు. ఐటీఐ అర్హత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక యాక్ట్ అప్రెంటిస్ చేయడానికి రైల్వే బోర్డు జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. గతంలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి అర్హత పరీక్ష నిర్వహించి అప్పుడు అప్రెంటిస్‌కు తీసుకునేవారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యాగన్ వర్క్ షాపు, కోచింగ్ అండ్ వ్యాగన్, డీజిల్ మెకానిక్ షెడ్స్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. అది పూర్తయిన తరువాత పోస్టింగ్‌లు ఇచ్చేవారు. అయితే కొన్నేళ్ల క్రితం దీన్ని మార్పుచేసి ఐటీఐలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం ప్రారంభించారు. అప్రెంటిస్ పూర్తిచేసిన వారికి రైల్వే క్లాస్–4 ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఐటీఐలను ప్రోత్సహించేందుకు అక్కడి విద్యార్థులకు భారీగా మార్కులు వేస్తున్నారు. దీంతో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చితే అక్కడి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీంతో వారు యాక్ట్ అప్రెంటిస్‌కు ఎంపికవుతున్నారు. విజయవాడ మెకానికల్ విభాగంలో 184 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుంటే 70 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే ఉన్నారు. ఇతర విభాగాల్లోనూ ఉత్తర భారత అభ్యర్థుల శాతమే ఎక్కువగా ఉంటోంది. ఆయా రాష్ట్రాల్లోని ఐటీఐలలో శిక్షణ కోసం తెలుగు విద్యార్థులు వెళితే.. వారిని ఇబ్బందులకు గురిచేసి వెనక్కి పంపుతున్నారు. యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన తరువాత కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికే క్లాస్–4 ఉద్యోగాలు లభిస్తున్నాయి. వారంతా ఇక్కడే ఉద్యోగాలు పొంది కొంతకాలానికి తమ రాష్ట్రాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టులు తిరిగి ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా ఇక్కడ పనిచేసే సిబ్బందిపై పనిభారం పడుతోంది. నాకు ఉద్యోగం రాలేదు 2013లో విజయవాడలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేశాను. కానీ.. నాకు రైల్వేలో ఉద్యోగం రాలేదు. కనీసం మన రాష్ట్రంలో శిక్షణ పొందిన వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. ఇతర రాష్ట్రాల వారే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. – పి.దేవేంద్రనాయక్, విశాఖ శిక్షణ పూర్తి చేసుకుంటున్నాను మెకానికల్‌లో అప్రెంటిస్ షిప్ చేస్తున్నాను. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా ఏ జోన్ వారికి ఆ జోన్లోనే ఇస్తే మాలాంటి వారికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. – కె.కిరణ్, అప్రెంటిస్ అభ్యర్థి -
ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు!
న్యూఢిల్లీ: ఐటీఐల కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల సీబీ ఎస్ఈ వంటి బోర్డుల తరహాలోనే ఐటీఐ విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు, సర్టిఫికెట్లు అందజేసేందుకు వీలేర్పడుతుంది. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు సీబీఎస్ఈ వంటి రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పది, పన్నెండు తరగతుల సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుంది. తాజా ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏటా 13 వేల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్(ఐటీఐల)లలో విద్య నభ్యసిస్తున్న 20 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అంతేగాక ఐటీఐ కోర్సుల విద్యార్థులు ఇతర స్కూళ్లు, కళాశాలల్లోని రెగ్యులర్ కోర్సులు చేసేందుకూ వీలేర్పడుతుంది. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతిపాదిత ఐటీఐ బోర్డు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పదోతరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుందన్నారు.