breaking news
Iran nuclear
-
యురేనియం నిల్వల కోసం భూతల దాడులు?
వాషింగ్టన్: ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అక్కడినుంచి ఎలాగైనా తరలించాలని అమెరికా భావిస్తోంది. అక్కడి అణుకేంద్రాలపై అమెరికా వాయుసేన కన్నేసింది. అందుకోసం సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఇజ్రాయెల్ సాయంతో భూతల దాడులకు దిగాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. ఎన్బీసీ న్యూస్ వార్తాసంస్థ ఈ మేరకు ఒక కథనంలో పేర్కొంది. అణు కేంద్రాలపై భారీ స్థాయిలో బాంబులు వేసే బదులు ప్రత్యేక సైనిక బృందాన్ని రహస్యంగా తరలించి యురేనియం నిల్వలను ఎత్తుకొచ్చే అవకాశాలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోందని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వెల్లడించారు. ఇటీవల అమెరికా ఉభయ చట్టసభల సభ్యులకు యుద్ధ వివరాలను నివేదిస్తూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో పరోక్షంగా ఈ మేరకు వెల్లడించారు.‘కొందరు వెళ్లి అక్కడున్న వాటిని పట్టుకొస్తారు’ అని అన్నారు. యురేనియం నిల్వలకు సంబంధించి అమెరికా రెండు ప్రణాళికలను సిద్ధంచేసుకుంది. నిల్వలను జాగ్రత్తగా ఎత్తుకొచ్చేయడం. లేదంటే శుద్ద యురేనియంను ఇతర మలినాలతో కలిపేసి దాని గాఢత తగ్గించి పరీక్షలకు శాశ్వతంగా పనికి రాకుండా చేయడం. అయితే యురేనియాన్ని నిరుపయోగం చేయడం సాధారణ సైనికుల వల్ల కాదు.కనుక అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లోని అణు శాస్త్రవేత్తలు, సహాయక సిబ్బందిని కూడా సైనికులతో పాటు ఇరాన్ భూగర్భ అణుకేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి వారితో పని పూర్తి చేయించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోందని తెలుస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ గడ్డ మీదకు పంపుతారా అని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా ‘‘వాళ్లను భూతల దాడులకు పంపించే యోచన లేదు. వాళ్లు వెళ్తేనే పని అవుతుందన్న సందర్భంలో మాత్రమే రంగంలోకి దింపుతా. లేదంటే వాయుసేన, డ్రోన్లతోనే ఇరాన్ కథ ముగిస్తా’’ అని బదులిచ్చారు. -
నేనొస్తే ధ్వంసం చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుపోతున్న ఆయన ఏమాత్రం తన వాగ్దాడిని తగ్గించడం లేదు. అంతకంటే వేగంగా ఆయన మాటలు జారవిడుస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే విదేశాంగ విధానంలో తన తొలి ప్రాధాన్యం ఇరాన్ అణుఒప్పందం అంశమే ఉంటుందని, ఆ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తానని అన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే ప్రపంచ ఉగ్రవాద నెట్ వర్క్‌కు టెహ్రాన్ మాత్రమే కీలక స్థావరంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను ఎంతో కాలంగా వ్యాపార రంగంలో ఉన్నానని, ఒప్పందాన్ని ఎలా చేసుకుంటారో తనకు తెలుసని అన్నారు. ఇరాన్ తో జరిగిన అణుఒప్పందం ఒక దురదృష్టకరం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని ప్రకటించారు.


