మేమూ బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటాం!
స్కూల్ బస్సు రాగానే పిల్లలు పరుగెత్తుతూ పోయి బస్సెక్కడం మనం చూస్తూనే ఉంటాం. చిత్రంలో కనిపిస్తున్న ఒరాంగుటాన్ పిల్లలు కూడా తొట్టెలో కూర్చొని ఎంచక్కా బడికి పోతాయి. ఒరాంగుటాన్లు స్కూలుకి పోవడమేంటనుకుంటున్నారా! నిజమేనండీ బాబూ.. ఇండోనేషియాలోని కెటపాంగ్లో ఉన్న అంతర్జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంలో వీటికోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను తెరిచారు. అక్కడ ఈ పిల్ల ఒరాంగుటాన్లకు చెట్లెక్కడంతో పాటు ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే వాటిపై శిక్షణ ఇస్తారు. దీంతోపాటు అడవిలో అపాయాలను ఎదుర్కొని ఎలా జీవించాలనే దానిపై మెలకువలు నేర్పిస్తారు.
ఈ స్కూల్లో 102 ఒరాంగుటాన్ పిల్లలున్నాయి. వీటిలో అత్యధికం అనధికారికంగా పెంచుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నవే! ఇంత వరకూ మనుషుల మధ్య తిరగటం, గొలుసులతో బంధించి చిన్న చిన్న బోనుల్లో ఉంచటం వల్ల ఇవి చెట్లెక్కడానికి భయపడుతున్నాయని శిక్షకులు చెబుతున్నారు. ఒరాంగుటాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని, వీటి సంరక్షణపై దృష్టి పెట్టకపోతే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉందని ప్రొగ్రాం డెరైక్టర్ కర్మెలీ లెల్నో సంచీజ్ పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత వీటిని అడవిలో విడిచి పెడతామన్నారు.