కరాచీ టు సిటీ వయా షార్జా!
- అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
- ముగ్గురు నిందితుల అరెస్టు, రూ. 9 లక్షలు సీజ్
- తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. పాకిస్తాన్లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారా హైదరాబాద్‌కు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ గతంలో సౌదీ, షార్జాల్లో కార్పెంటర్‌గా పనిచేశాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా షార్జా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలనుకున్నాడు.
కరాచీలో ఉంటున్న తన మేనమామ యాసీన్‌కు ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాడు. పాకిస్తాన్లో ముద్రితమయ్యే భారత నకిలీ నోట్లను మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని ‘సలహా’ ఇచ్చాడు. తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణీ చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు.
గుర్తించని కస్టమ్స్ అధికారులు...
ప్రయాణం నేపథ్యంలో నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను లగేజ్‌లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ కస్టమ్స్ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్ల బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులపాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. ఈ ముగ్గురూ కలసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు.