breaking news
Insurance FDI
-
ఫాస్ట్‌ట్రాక్‌లో సంస్కరణలు..
బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర * మెడికల్ పరికరాల రంగంలో 100% ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్ రూట్ * బీమా ఎఫ్‌డీఐల పరిమితి 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు * బొగ్గు బ్లాకుల వేలానికి మార్గం సుగమం న్యూఢిల్లీ: ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంస్కరణల విషయంలో వెనక్కితగ్గేదిలేదని మోదీ సర్కారు నిరూపించింది. కీలకమైన బీమా, బొగ్గు రంగాల బిల్లులకు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా ఆమోదం లభించకపోవడంతో... ఆర్డినెన్స్‌లు జారీ చేసి వీటిని అమల్లోపెట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బుధవారం ఈ రెండు ఆర్డినెన్స్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు ఫార్మా రంగానికి సంబంధించి మెడికల్ పరికరాల తయారీ విభాగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆటోమేటిక్ రూట్లో అనుమతించేందుకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆటోమేటిక్ రూట్ అంటే.. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతి లేకుండానే నేరుగా విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది. ఒక విదేశీ సంస్థ భారత్‌లోని ఏదైనా ఈ రంగానికి చెందిన కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయడం.. లేదంటే కొత్తగా తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు వీలవుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో కీలక బిల్లుల ఆమోదం కోసం వేచిచూడకుండా మోదీ సర్కారు శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం విశేషం. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బీమా చట్టాల సవరణ బిల్లు-2008 రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు విపక్షాల అందోళనలు గండికొట్టడం తెలి సిందే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్(ఎఫ్‌పీఐ), ఎఫ్‌డీఐలతో కలిపి కాంపొజిట్ పరిమితి 49 శాతానికి మించకూడదన్న కాంగ్రెస్ సూచనలను సెలక్ట్ కమిటీ ఆమోదించడంతో ఈ బిల్లుకు లైన్ క్లియర్ అయింది. రాజ్యసభలో మోదీ సర్కారుకు మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అయితే, మతమార్పిడులు ఇతరత్రా అంశాలపై విపక్షాలు సభను స్తంభింపజేయడంతో బిల్లును సభ ప్రవేశపెట్టలేదు. మరోపక్క, బొగ్గు స్కామ్‌లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రద్దయిన 204 బొగ్గు క్షేత్రాలను తిరిగి వేలం వేయడానికి ప్రభుత్వం ఇదివరకే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీన్ని చట్టరూపంలో మార్చేందుకు వీలుగా బొగ్గు గనుల(ప్రత్యేక మార్గదర్శకాల) బిల్లు-2014ను లోక్‌సభలో ఆమోదింపజేయడంలో మోదీ సర్కారు సఫలీకృతమైంది. అయితే, రాజ్య సభలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఈ బిల్లు కూడా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో సంబంధిత ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయాలని కేబినెన్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కేటాయింపుల మార్గదర్శకాలకు కూడా ఆమోదముద్ర వేసింది. కాగా, ఈ రెండు ఆర్డినెన్స్‌లకు నిర్దేశిత గడువులోగా సంబంధిత బిల్లులకు పార్లమెంటులో ఆమోదముద్ర పడాలి. నేటి నుంచి బొగ్గు గనుల వేలం ప్రక్రియ షురూ... బొగ్గు ఆర్డినెన్స్‌ను పొడిగించడంతో పాటు వేలం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం లభించడంతో ప్రైవేటు కంపెనీలకు(సొంత అవసరాల కోసం) ఈ-వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపు, ప్రభుత్వ రంగ కంపెనీలకు నేరుగా గనులను కేటాయించేందుకు మార్గం సుగమం అయింది. తొలి విడతలో 24 బొగ్గు గనుల ఈ-వేలానికి సంబంధించిన ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. భారీగా బొగ్గునిల్వలున్న రాష్ట్రాలకు బొగ్గు గనుల పునఃకేటాయింపుల కారణంగా వచ్చే 30 ఏళ్లలో రాయల్టీ, వేలం నిధుల రూపంలో దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. సుప్రీం రద్దు చేసిన 204 బొగ్గు బ్లాకుల్లో ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న గనులకు వేలం ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయనున్నామని.. మిగతావాటికి మూడో విడతలో కేటాయింపులు చేస్తామని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. మా చిత్తశుద్ధికి నిదర్శనమిది: జైట్లీ కీలకమైన బీమా ఎఫ్‌డీఐలు, బొగ్గు గనుల కేటాయింపు బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్‌లను తీసుకురావడం సంస్కరణలపై తమ ప్రభుత్వ నిబద్ధత, చిత్తశుద్ధికి తార్కాణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. కేవలం పార్లమెంటులోని ఒక సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు మార్గం లేకుండా పోయినంతమాత్రాన సంస్కరణల విషయంలో దేశం వేచిచూసే ధోరణిని అనుసరించబోదని ప్రపంచానికి, ముఖ్యంగా ఇన్వెస్టర్లకు స్పష్టమైన సందేశం పంపించామని కూడా జైట్లీ పేర్కొన్నారు. కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల దేశంలోకి 6-8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.50 వేల కోట్లకుపైగా) విదేశీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, వచ్చే సమావేశాల్లో కూడా బీమా బిల్లును రాజ్య సభలో అడ్డుకుంటే.. పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని(లోక్ సభ, రాజ్యసభ) ఏర్పాటు చేస్తామని జైట్లీ సంకేతాలివ్వడం గమనార్హం. -
బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు రెడీ!
ప్రభుత్వం సంకేతాలు... నేడు కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై చర్చ! విపక్షాల ఆందోళనలతో బిల్లులను ప్రవేశపెట్టలేకపోవడమే కారణం.. న్యూఢిల్లీ: బీమా ఎఫ్‌డీఐలు, బొగ్గు రంగంలో సంస్కరణలను ఎలాగైనా అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రాజ్యసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం లభించకపోవడం... పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్‌ల ద్వారా ముందుకెళ్లాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ రెండు సంస్కరణలను అమలు చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చే ప్రతిపాదనలపై అతి త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాధ్యమైనంతవరకూ బుధవారం(నేడు) ఈ సమావేశం జరిపే అవకాశాలున్నాయని కూడా ఆయా వర్గాల సమాచారం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు విషయంలో అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూరుస్తోంది. ‘బీమా కంపెనీలకు విదేశీ దిగ్గజాల అనుభవం, నైపుణ్యాలు చాలా అవసరం. దేశ ప్రజలందరికీ బీమా ఉత్పత్తులు, సేవలను విస్తరించాలంటే భారీస్థాయిలో పెట్టుబడులు కూడా కావాలి. అందుకే ఈ బిల్లు విషయంలో సాధ్యమైనంతవరకూ విభిన్న ప్రత్యామ్నాలన్నింటినీ అన్వేషించాల్సిన అవసరం ఉంది’ అని సిన్హా పేర్కొన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. సభలో ప్రతిష్టంభన... దేశీ బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా చట్టాల సవరణ బిల్లు-2008కి పార్లమెంట్ సెలక్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు, ఎఫ్‌డీఐలు కలిసి మొత్తం పరిమితి(కాంపోజిట్ లిమిట్) 49 శాతానికి మించకూడదన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. దీంతో కేబినెట్ కూడా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అయితే, మత మార్పిడులు, ఇతరత్రా అంశాలపై రాజ్యసభలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఈ బిల్లును మోదీ సర్కారు ప్రవేశపెట్టలేకపోయింది. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. ఎగువ సభలో తగిన మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు పాస్ కావాలంటే విపక్షాల మద్దతు తప్పనిసరి. ఇదిలాఉంటే.. బొగ్గు గనుల వేలం, పునఃకేటాయింపులకు సంబంధించిన బొగ్గు గనుల(ప్రత్యేక మార్గదర్శకాలు) బిల్లు-2014కు లోక్‌సభలో ఆమోదముద్ర లభించినప్పటికీ.. రాజ్య సభలో ప్రవేశ పెట్టడం కుదరలేదు. దీనికి కూడా సభలో నెలకొన్న ప్రతిష్టంభనే కారణం. ప్రతిపక్షాలు సృష్టించిన రాజకీయపరమైన దుమారమే రాజ్య సభ సమావేశాల్లో కీలక బిల్లులకు గండికొట్టాయని సిన్హా దుయ్యబట్టారు. బొగ్గు స్కామ్ నేపథ్యంలో 1993 నుంచి 2010 వరకూ జరిపిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీం కోర్టు తన తీర్పులో రద్దు చేయడం తెలిసిందే. దీంతో కేంద్రం వీటికి మళ్లీ వేలం వేయడం కోసం ఈ బొగ్గు బిల్లును రూపొందించింది. కాగా, వేలం ముసాయిదా నిబంధనల రూపకల్పనతోపాటు వీటిని కేంద్రం ఇప్పటికే ఖరారు కూడా చేసింది. వచ్చే ఫిబ్రవరిలో వేలానికి కూడా ప్రభత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే, దీనికి పార్లమెంటులో బొగ్గు బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారానైనా వేలానికి ఆటంకం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... బీమా, బొగ్గు సంస్కరణల విషయంలో వెనకడుగు వేయబోమని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం తెలిసిందే.