breaking news
INSAT -3 DR
-
ఇన్శాట్-3డీఆర్ ప్రయోగం సక్సెస్
జాతీయం కేంద్రం, నాబార్డ్, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 6న కర్నాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసింది. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ (కేఆర్ఎస్), హారంగి, కబిని, హేమావతి డ్యామ్‌ల నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున పది రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేస్తోంది. గ్రామీణ పారిశుధ్యంలో అగ్ర భాగాన సిక్కిం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే లో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న సర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ 14వ స్థానంలో, ఏపీ 16వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పారిశుధ్య పరిస్థితిపై సేకరించిన వివరాలతో క్రోడీకరించిన నివేదికలోనూ సిక్కిం (99.1 శాతం) అగ్రస్థానంలో నిలవగా, బిహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో మరుగుదొడ్లు కలిగి వాడుతున్న వారి శాతం 42.13గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ.. నివేదికలో పేర్కొంది. తొలి ద్వీప ప్రాంత జిల్లాగా మజులీ దేశంలో తొలి ద్వీప ప్రాంత జిల్లాగా అసోంలోని మజులీ ఏర్పడింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సెప్టెంబర్ 8న ప్రకటన చేశారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులీ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ. మజులీ అసోంలో 35వ జిల్లా. అంతర్జాతీయం ఆసియాన్ సదస్సు ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్-ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6-8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ‘వన్ ఆసియాన్, వన్ రెస్పాన్స్’ అనే ఆసియాన్ డిక్లరేషన్‌పై నేతలు సంతకాలు చేశారు. ఈ ప్రాంతంతోపాటు వెలుపలి ప్రాంతంలో సంభవించే విపత్తులపై ఆసియాన్ ఒకటిగా స్పందించాలని నిర్ణయించారు. ఆసియాన్-భారత్ సదస్సు ఆసియాన్ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 8న 14వ ఆసియాన్-భారత్ సదస్సు జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ ఉగ్రవాదం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆసియాన్ సభ్యదేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి. 2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసిన నాటి నుంచి భారత్ అందులో సభ్యురాలిగా ఉంది. పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన అమెరికా, చైనా పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్శాట్-3డీఆర్ ప్రయోగం సక్సెస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెప్టెంబర్ 8న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి చేపట్టిన ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. వాతావరణ అధ్యయనానికి ఉద్దేశించిన ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్05 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్శాట్-3డీఆర్: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆధునిక ఉపగ్రహం. ఇది వాతావరణ శాస్త్ర అధ్యయనంతోపాటు మరింత కచ్చితత్వంతో పరిశోధన చేస్తుంది. సముద్ర గాలి దిశలను గమనించి వాతావరణ పరిశోధనలకు చేయూతనందిస్తుంది. ఈ ప్రయోగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ అప్పర్ స్టేజ్‌ని వినియోగించారు. దీంతో తొలిసారి పూర్తిస్థాయి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ఉపయోగించినట్లయింది. అణు పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా అణు పరీక్షలను (ఐదో) విజయవంతంగా నిర్వహించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సెప్టెంబర్ 8న వెల్లడించింది. ఉత్తర కొరియా న్యూక్లియర్ పరీక్ష జరిపిన ప్రాంతంలో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అణు పరీక్షలుగా ప్రపంచ దేశాలు అనుమానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటన చేసింది. ఆర్థికం జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ(122) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ చట్టం 2017, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం జీఎస్టీ మండలిని ఏర్పాటు చేయనుంది. పన్నురేటు, సెస్, సర్ఛార్జీలు వంటివాటిని ఈ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్టీ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రాల ఆమోదానికి పంపారు. ఈ క్రమంలో 17 రాష్ట్రాలు బిల్లును ఆమోదించాయి. వార్తల్లో వ్యక్తులు అరుణాచల్ గవర్నర్ రాజ్‌ఖోవా తొలగింపు అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాను సెప్టెంబర్ 12న పదవి నుంచి తొలగించారు. కేంద్రం రాజ్‌ఖోవాను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అయితే దానికి ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడలు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకం, వరుణ్‌సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించారు. పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌కు రజతం రియో పారాలింపిక్స్‌లో మహిళల షాట్‌పుట్(ఎఫ్-53)లో సెప్టెంబర్ 12న భారత క్రీడాకారిణి దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించింది. దీంతో పారాలింపిక్స్ లో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 6 రెడ్ చాంపియన్‌షిప్‌లో అద్వానీకి కాంస్యం భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రతిష్టాత్మక 6 రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. వావ్రింకా, కెర్బర్లకు యూఎస్ ఓపెన్ టైటిల్స్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించి తొలిసారి ఈ టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) గెలుచుకుంది. ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను జమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్), బ్రూనో సోరెస్ (బ్రెజిల్); మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథాన్ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్); మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను లారా సీజ్ మండ్ (జర్మనీ), మేట్ పావిచ్(క్రొయేషియా) దక్కించుకున్నారు. ఇండియన్ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టైటిల్ 90వ ఆల్ ఇండియా ఎంిసీసీ-మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను సెప్టెంబర్ 11 ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది. -
నింగిలోకి ఇన్శాట్-3డీఆర్
స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగంలో ఇస్రో హ్యాట్రిక్ విజయం శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం జీఎస్ఎల్వీ-ఎఫ్05 ఉపగ్రహ వాహకనౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఆర్‌ను రోదసిలోని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక దశల ప్రయోగంలో వరుసగా మూడో విజయం సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4:50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్05 రాకెట్.. 17 నిమిషాల తర్వాత ఇన్శాట్-3డీఆర్‌ను భూ సమాంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇన్శాట్-3డీఆర్ పనిచేయని ఇన్శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ప్రయోగం ఇలా జరిగింది...: జీఎస్ఎల్వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11:10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 29:40 గంటల పాటు కొనసాగింది. గురువారం సాయంత్రం 4:10 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. క్రయోజనిక్ దశలో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియలో ఒక సేఫ్టీవాల్వ్ క్లోజ్ కాకపోవడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ నిలిచిపివేసి.. లోపాన్ని సవరించారు. దీంతో ప్రయోగం 40 నిమిషాలు ఆలస్యమైంది. లోపం సవరించాక 4:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. స్వదేశీ క్రయోజనిక్‌లో ఇస్రో హ్యాట్రిక్ జీఎస్ఎల్వీ శ్రేణిలో ఇస్రో పది ప్రయోగాలు చేయగా.. తాజా ప్రయోగంతో ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. దేశీయంగా అభివృద్ధి చేసిన సంక్లిష్ట క్రయోజనిక్ దశ ప్రయోగంలో విజయాల హాట్రిక్ సాధించింది. అయితే.. తాజా ప్రయోగంలో.. దేశీయంగా రూపొందించిన క్రయోజనిక్ అప్పర్ స్టేజ్‌ను వినియోగించటంతో ఇది ఇస్రోకు చాలా ప్రధానమైన ప్రయోగంగా నిలిచింది. ఇంతకుముందు 2014 జనవరిలో జీశాట్-14 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపిన జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్‌లోను, 2015 ఆగస్టులో జిశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ-డి6 రాకెట్‌లోనూ దేశీయంగా రూపొందించిన సీయూఎస్ను ఉపయోగించారు. అయితే.. అవి రెండూ అభివృద్ధి దశలో ఉన్నాయని.. వాటిలో రష్యా ఇంజన్లను ఉపయోగించామని.. తాజా ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సీయూఎస్ను ఉపయోగించామని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ ఇంజన్‌కు సంబంధించి 2010లో జంట వైఫల్యాల అనంతరం 2014లో ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ఈ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరింది. వాతావరణ విపత్తులపై నింగిలో నిఘా నేత్రం భూమి, సముద్రాలపై వస్తున్న విపత్తులను ముందుగా కనిపెట్టి హెచ్చరించేందుకు వాతావరణ అధ్యయనం కోసమే ఇన్శాట్-3డీఆర్‌ను ప్రయోగించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ వాతావరణ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చి పంపారు. భూమిపై, సముద్రాలపై జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసేందుకు 6 చానల్ ఇమేజర్‌ను ఉపయోగిస్తారు. వాతావరణం మీద అధ్యయనం చేయడానికి కల్పన-1, ఇన్శాట్-3ఏ అనే ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. అయితే.. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటంతో గత ఉపగ్రహాల కంటే ఇందులో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను అమర్చారు. ‘సముద్రం అడుగు నుంచి విమాన సంకేతాలు అంతరిక్షానికి చేరవు’ బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం విషయంలో.. సముద్రం అడుగు నుంచి విమానం సంకేతాలు అంతరిక్షం వరకు చేరవని ఇస్రో చైర్మన్ కిరణ్ చెప్పారు. ‘విమానం సముద్రం లోపలికి వెళితే, దాని సంకేతాలు అంతరిక్షం వరకూ చేరవు. భూమిపై విపత్తు సంభవిస్తే విమానంలోని బీకన్లు సంకేతాలు పంపుతాయి. వాటిని ఈ ఉపగ్రహంలోని ట్రాన్స్‌పాండర్ అందుకుంటాయి.’ అన్నారు. ‘ఆదిత్య’కు సిద్ధం శ్రీహరికోట (సూళ్లూరుపేట): భవిష్యత్తులో సూర్యుడి మీద పరిశోధనలు చేయడానికి ఆదిత్య, చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి చంద్రయాన్-2, అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మంగళ్యాన్-2 ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోందని చైర్మన్ కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రయోగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది మోదీ ఆలోచనలకు అనుగుణంగా ‘మేకిన్ ఇండియా’ ప్రయోగం. క్రయో దశతో వరుసగా 3ప్రయోగాలు చేసి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంపై ‘ఇస్రో’ శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రజ్ఞులు మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా చేయాలని ఆయన ఆకాంక్షించారు.