breaking news
innova vehicle
-
పెళ్లింట పెను విషాదం
కొణిజర్ల: పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఇన్నోవా వాహనం చెట్టుకు ఢీకొనడంతో వరుడు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి అనంతరం.. వీరంతా వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్ (36) వివాహం.. ఏపీ రాష్ట్రం రాజమండ్రికి చెందిన భావన దుర్గతో గురువారం రాత్రి తణుకులోని పాతూరు కేశవస్వామి ఆలయంలో జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులతో సహా 10 మంది ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. పెళ్లి కొడుకు రామకృష్ణ ప్రసాద్ స్వతహాగా డ్రైవర్ కావడంతో తానే డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కొణిజర్ల సమీపానికి రాగానే అతి వేగంగా ఉన్న వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్, అతడి అక్క పద్మ (42), బావ శరత్ (39), చెల్లి శ్రీదేవి, డ్రైవర్ వడ్లకొండ వేణు (37) అక్కడికక్కడే మృతి చెందారు. వధువు దుర్గ సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వరుడి బావ చలపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనాస్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ జె.సదానిరంజన్, వైరా ఏసీపీ డి.ప్రసన్నకుమార్, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ సందర్శించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అప్రమత్తమన మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే ...పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు ఇన్నోవాను అటకాయించారు. దీంతో వాహనాన్ని వదిలేసిన మావోయిస్టులు, అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. ఏటూరు నాగారం వైపు వారు పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.