breaking news
injuctions
-
నా భర్తకు ఇంజెక్షన్లు ఇవ్వండి.. లేకపోతే చస్తా!
ఇండోర్: బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) బారినపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని బాంబే హాస్పిటల్లో సదరు మహిళ భర్త (40) చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షను ఇచ్చారు. మరికొన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ, అందుబాటులో లేవు. ఆందోళనకు గురైన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మంగళవారం వీడియో పోస్టు చేసింది. ‘‘బాంబే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా.. బ్లాక్ ఫంగస్ సోకడంతో నా భర్తను ఈ ఆసుపత్రిలోనే చేర్పించాం. ఆయనకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. ఇక్కడ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు లేవు. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లగలను? ఈ రోజు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా. అంతకు మించి మరో మార్గం లేదు’’ అని వీడియోలో ఆమె స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇండోర్ కలెక్టర్‌ను కూడా ఉద్దేశించి మాట్లాడింది. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చామని, భర్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మానసికంగా కలత చెందిందని బాంబే ఆసుపత్రి జనరల్ మేనేజర్ చెప్పారు. ఆమె భర్తకు ఇప్పటివరకు 59 ఇంజెక్షన్లు ఇచ్చామని, మరికొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి తమ వద్ద అవి అందుబాటులో లేవని ఆయన వివరించారు. (చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా) -
'ఇంజెక్షన్లతో మోకాళ్ల నొప్పులు తగ్గవు'
ఖమ్మం: 'మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే మేమిచ్చే ఇంజక్షన్లను వాడండి. కొద్ది గంటల్లోనే నొప్పులు మాయమవుతాయి' బాపతు ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. మోకాళ్ల నొప్పులకు చికిత్స పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ.. అనుమతిలేని ఉత్ప్రేరకాలను పేషెంట్లకు ఇంజెక్ట్ చేస్తున్నవైనాన్ని ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ వెలుగులోకి తెచ్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకూరపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోన్న ఆసుపత్రిలో ఈ నకిలీ ఇంజెక్షన్ల వ్యవహారం కొనసాగుతోంది. అత్యవసర సమయాల్లో.. అదికూడా ఆర్థోపెడిక్ పర్యవేక్షణలో ఇచ్చే 'హైడ్రో కార్టిజం' ఇంజెక్షన్ ను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. సదరు సంస్థ ప్రచారాన్ని నమ్మి ఆదిలాబాద్, కరీంగనగర్, వరంగల్, నల్లగొండ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది పేషెంట్లు ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం సదరు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఐఎంఏ ప్రతినిధులు.. పేషెంట్లకు వాస్తవాలను వివరించేప్రయత్నం చేశారు. ఉత్ప్రేరకాల ఇంజెక్షన్‌తో తాత్కాలికంగా మోకాళ్లనొప్పులు తగ్గినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.