breaking news
infrastructures
-
‘స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’
న్యూఢిల్లీ: ‘‘లా అంటే నేటికి కూడా ధనవంతులు మాత్రమే చదవగలిగే కోర్సుగానే చూస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. అలానే న్యాయవాద వృత్తిని స్వీకరించే మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. దేశంలోని పలు కోర్టుల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే హైకోర్టులలో ఉన్న ఖాళీల్లో 90శాతం పోస్టులను మరో నెల రోజుల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు ఎన్వీ రమణ తెలిపారు. ఎలాంటి వివాదం లేకుండానే కేవలం ఆరు రోజుల్లోనే సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియాకమానికి అనుమతులిచ్చినందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి జస్టిస్ రమణ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘లా కోర్సు అనగానే కేవలం ధనవంతులు మాత్రమే చదవగలిగేదిగా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అవకాశాలు పెరుగుతున్నాయి. న్యాయవాద వృత్తి నేటికి కూడా పట్టణ వాసులకు సంబంధించిన వృత్తిగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వృత్తిల్లో స్థిరంగా కొనసాగవచ్చు అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే న్యాయవాద వృత్తిని స్వీకరించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది’’ అన్నారు. అలానే కోర్టుల్లో మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రికి నివేదిక సమర్పించారు. (చదవండి: ఇదేం బాధ్యతారాహిత్యం) ఈ సందర్భంగా ఎన్వీ రమణ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. నేను హైకోర్టులో పని చేసే రోజుల్లో మహిళా జడ్జీల కోసం కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను’’ అన్నారు. దేశవ్యాప్తంగా పది హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!) -
మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నీటిపారుదల, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీష్రావు చెప్పారు. యార్డుల్లో రైతుల కోసం విశ్రాంతి గదులు, సబ్సిడీ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన శనివారం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మద్దతుధర, కనీససౌకర్యాలు ఉండేలా మార్కెట్ యార్డులు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతీ సీజన్లో యార్డులపై రైతులు వివిధ కారణాల వల్ల దాడులు చేసే పరిస్థితి చూస్తున్నామనీ.. ఇక నుంచి అటువంటి పరిస్థితి తలెత్తబోదని చెప్పారు. యార్డులు వ్యాపారుల కోసం కాకుండా రైతులకు సహకరించేలా ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన జరగడంతో కమిషనరేట్ రెండుగా విడిపోయిందనీ.. దీన్ని పటిష్టపరిచేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. రైతుల పంట దళారుల చేతికి సగం వెళ్లాకే ప్రభుత్వ సంస్థలు ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై అలా జరగకుండా మొట్టమొదటి రోజునుంచే పంటను కొనే విధంగా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. రైతుల నుంచి తగు సూచనలు తీసుకొని రైతు బంధు పథకాన్ని పటిష్టపరుస్తామని చెప్పారు. పంట మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు అది ఆన్లైన్ ద్వారా కంప్యూటరైజేషన్ జరిగితే రైతుకు లాభం జరుగుతుందన్నారు. కర్ణాటకలో ఈ పద్ధతి విజయవంతమైందని తెలి పారు. అందువల్ల కొన్ని యార్డుల్లో ఆన్లైన్ మెకానిజమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతులకు విశిష్ట సేవలు అందించే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే రైతుబజార్లు సరిగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రైతుబజార్లను వినియోగంలోకి తెస్తామని, డిమాండ్ ఉన్నచోట్ల కొత్తవాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పన్ను వసూళ్లలో దుర్వినియోగం జరుగుతుందనీ... వాటిపై దృష్టిపెట్టి ప్రతీ పైసా రైతుకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడ్తామని ఆయన వివరించారు. రుణమాఫీపై మాట తప్పం రుణమాఫీపై ఎట్టి పరిస్థితుల్లో తాము మాట తప్పమని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హరీష్రావు చెప్పారు. బ్యాంకర్ల నుంచి సమాచారం కోరినట్లు వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ఏ హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. తొమ్మిది గంటల ఉచిత కరెంటు అని చెప్పి అమలుచేయలేదన్నారు. రైతుల ఉసురు పోసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు.