breaking news
Indian currency.
-
రూపాయికి దేశీ, అంతర్జాతీయ భయాలు!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఏడవ ట్రేడింగ్ సెషన్లోనూ కిందకు జారింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ 71.99 వద్ద ముగిసింది. బుధవారం ముగింపు విలువతో పోలిస్తే 24 పైసలు పతనమయింది. ట్రేడింగ్‌లో ఒక దశలో 72ను దాటిపోయి, 72.11ను చేరింది. చివరకు కొంత రికవరీతో 71.99 వద్ద ముగిసింది. అటు ముగింపు, ఇంట్రాడే ట్రేడింగ్ విలువ... రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. రూపాయి తిరోగమనానికి కొన్ని కారణాలు చూస్తే... ►నిజానికి రూపాయి గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో 13 పైసలు లాభంతో 71.62 వద్ద ప్రారంభమైనా, ఆ స్థాయిలో నిలవలేకపోయింది. ►అంతర్జాతీయ, దేశీయ కారణాలు రెండూ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ►అంతర్జాతీయంగా చూస్తే, క్రూడ్ ధరలు తీవ్ర స్థాయిని చేరాయి. ఇవి దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ► దేశీ కంపెనీలు క్రూడ్‌ను డాలర్లలో కొనుగోలు చేస్తాయి కాబట్టి ఇది దేశీయ విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతుంది. వెరసి దేశంలోకి వచ్చీ– పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరుగుదలకు కారణమవుతుంది. ►క్రూడ్ ధరల పెరుగుదల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు... తద్వారా వడ్డీరేట్ల పెంపుదలకు దారితీసి దేశీయ వృద్ధిని దెబ్బతీస్తుంది. ► ఇక దేశంనుంచి విదేశీ నిధులు వెనక్కు వెళ్లిపోతుండడమూ ప్రతికూలాంశమే. ► వీటన్నింటికీ తోడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం సమస్యలను తెచ్చిపెడుతోంది. ► అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ విలువల పతనం... ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 95 స్థాయిలో పటిష్టంగా ఉండడం దేశీయ కరెన్సీ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ 13% పతనమయ్యింది. ►గురువారం పలు క్రాస్ కరెన్సీలలో కూడా రూపాయి పతనమయింది. పౌండ్ స్టెర్లింగ్‌పై 91.95 నుంచి 93.08కి జారింది. యూరోపై 83.12 నుంచి 83.70కి పడింది. -
‘అణా’దిగా చెలా‘మనీ’
మనీ.. మనిషి జీవితాన్నే శాసిస్తోంది. అణా నుంచి నేటి రెండు వేల రూపాయల నోటు దాకా కరెన్సీకి ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానంలో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైంది? ఏ పాలకుడి హయాంలో ఎన్ని రకాల నాణేలు, నోట్ల తయారీ జరిగింది? ఆయా కాలాల్లో మనీ.. చెలామణి ఎలా ఉండేది? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఆసక్తి కలిగించేవే. నిజాం హయాంలో పేపర్ కరెన్సీ మొదలుపెట్టి వందేళ్లు అవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం. హైదరాబాద్ సంస్థానం సొంత నాణేల ముద్రణ 1857లో మొగల్ రాజ్య పతనానంతరం ఐదో నిజాం అఫ్జలుద్దౌల్లా మొగల్ నాణేల వాడకాన్ని నిలిపి వేసి సొంతంగా సుల్తాన్ షాహీ ప్రాంతంలో నాణేల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నాణేలను ‘హలి సిక్కా’గా పిలిచేవారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో 1895లో యంత్రం ద్వారా తొలిసారి నాణేలను తయారు చేయడం ప్రారంభించారు. దీన్ని చర్ఖీ సిక్కా (చర్ఖీ(చక్రం) ద్వారా తయారు చేసిన నాణేలు) అని పిలిచేవారు. ఒకటో ప్రపంచ యుద్ధకాలం నాటికి వెండి ధర గణనీయంగా పెరిగింది. ఫలితంగా నాణేల ముద్రణ భారం కావడంతో ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి పేపర్ కరెన్సీ ముద్రణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు. కమిటీ సిఫారసుల మేరకు హైదరాబాద్ సంస్థానంలో 1918 ఏప్రిల్ 24వ తేదీన తొలిసారిగా పేపర్ కరెన్సీ విడుదల చేశారు. 1959 వరకే ఉస్మానియా కరెన్సీని ముద్రించారు. ఈ కరెన్సీపై ప్రభుత్వ ఖజానా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సంతకముండేది. హైదరాబాద్ కరెన్సీ చట్టం కింద జారీ చేసిన నోట్లను ఉస్మానియా కరెన్సీ అని పిలిచేవారు. 1918లో ఒక రూపాయి, ఐదు రూపాయల నోట్లు విడుదల చేశారు. 1926లో వెయ్యి రూపాయి నోట్లు జారీ చేశారు. 1959 వరకు హైదరాబాద్ స్టేట్ కరెన్సీ కొనసాగింది. హైదరాబాద్ సంస్థాన విలీనంతో భారత కరెన్సీ అమలులోకి వచ్చింది. 500 ఏళ్లకు పూర్వం .. గోల్కొండ సంస్థానంలో హున్ నాణేలు గోల్కొండ సంస్థానంలో బహమనీల పాలనా కాలంలో హున్ నాణేల వాడకం ఉండేది. వీరి పతనానంతరం కుతుబ్ షాహీ పాలన నుంచే సొంతంగా నాణేల తయారీ మొదలైంది. 1689లో తానీషా పాలన వరకు కుతుబ్ షాహీ నాణేల వాడకముంది. గోల్కొండను మొగల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనం చేసుకోవడంతో కుతుబ్‌షాహీ నాణేల వాడకం అంతరించి మొగల్ నాణేలు వాడుకలోకి వచ్చాయి. బంగారు, వెండి నాణేలు ఐదో నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సొంతంగా నాణేల తయారీ ఉండేది. వాటిని బంగారం, వెండి, రాగి, ఇత్తడితో తయారు చేసేవారు. 1905 నుంచి 1945 వరకు నాలుగు రకాలుగా బంగారు నాణేలు తయారు చేసి వినియోగించేవారు. ఇందులో 11.09 గ్రాముల బంగారు నాణేం చాలా గుర్తింపు పొందింది. నాణేలు, పేపర్ కరెన్సీ ఇలా... నాణేనికి ఒకవైపు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ బహదూర్ ఉంటే మరోవైపు ఫరకందా బునియాద్ హైదరాబాద్ అని ఉర్దూ అక్షరాల్లో ఉండేవి. ఇవి నాణేంపైన బయటికి వచ్చినట్లుగా ఉండేవి. ఇక వెండి, బంగారు నాణేలపై ఒకవైపు చార్మినార్, మరోవైపు అసఫ్ జాహీల ఫరకందా బునియాద్ ఉండేది. పేపర్ కరెన్సీపై ఉస్మానియా సిక్కా అని ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, కన్నడ, మరాఠీ భాషల్లో విలువ రాసి ఉండేది. భారత దేశ కరెన్సీతో కలిపిన నిజాం కరెన్సీ 1950లో భారత రూపాయిని స్థానిక ద్రవ్యంతో పరిచయం చేశారు, 7 హైదరాబాద్ రూపాయలు = 6 భారతీయ రూపాయలుగా వినియోగించేవారు. 1951లో హైదరాబాద్ రూపాయి వాడకాన్ని నిలిపివేశారు. దీంతో భారత రూపాయి ప్రధాన ద్రవ్య కరెన్సీగా మారింది, అయితే, హైదరాబాద్ రూపాయి 1959 వరకు చెల్లింది.