ఆగని చైనా దురాక్రమణ
లేహ్/న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. భారత సైన్యం పదేపదే చేస్తున్న హెచ్చరికలను బేఖాతరుచేస్తూ మన భూభాగంలోకి చొచ్చుకొస్తోంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్న చుమార్‌లో ఓ చోట 35 మంది చైనా సైనికులు తిష్ట వేయగా తాజాగా ఆదివారం చుమార్లోని మరో ప్రాంతంలో మరికొందరు సైనికులు ఏడు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
లేహ్‌కు 300 కి.మీ. దూరంలో ఉన్న చుమార్కు శనివారం వాహనాల్లో చేరుకున్న దాదాపు 100 మంది చైనా సైనికులు పాయింట్ 30ఆర్ వద్ద గుడారాలు వేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని వీడాల్సిందిగా భారత సైన్యం డిమాండ్ చేయగా మీరు వెనక్కి వెళ్తేనే మేమూ వెనక్కి వెళ్తామంటూ చైనా సైనికులు పట్టుబట్టారు. చైనా వైఖరి నేపథ్యంలో ఇరు దేశాల జర్నలిస్టుల మధ్య బుధవారం జరగాల్సిన సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం అర్ధంతరంగా రద్దు చేసింది. చైనా ఎడిటర్లకు అనుమతులను ఉపసంహరించుకుంది.