breaking news
Indian Air Force AN-32 plane
-
2016లో గల్లంతు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ
ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది. 2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే.. ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు. అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు. విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్. -
భగవంతుడా మాకేంటీ కష్టం..!
పరామర్శించడానికి ఎవరు ఇంటికొచ్చినా ఏదైనా శుభవార్త చెబుతారేమోనని ఆ కుటుంబాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఏ క్షణాన్నైనా తమ డాడీ తలుపు తడతారేమోనని ఆ చిన్నారుల కళ్లు ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడూ ధైర్యం చెప్పే కుమారుడి కోసం ఆ వృద్ధ తల్లిదండ్రుల హృదయం తపిస్తోంది. వారమైనా.. ఎటువంటి జాడ దొరకని ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల దయనీయ పరిస్థితి ఇది. గోపాలపట్నం : గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఉన్న ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ దుర్వార్త విని వారం రోజులైపోయింది. ఇంతకీ విమానం ఏమైంది.. ఎక్కడైనా క్షేమంగా ఉందా.. ఉంటే అందులో వారు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు..? ఇవీ బాధిత కుటుంబాలను దహించేస్తున్న ప్రశ్నలు. భగవంతుడా మాకేంటీ కష్టం.. అంటూ ఆ కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్.వి.ప్రసాద్‌బాబు, పూర్ణచంద్రసేనాపతి, చరణ్మహరాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు గత శుక్రవారం ఉదయం ఎయిర్‌ఫోర్స్ విమానంతో గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి నేటి వరకూ ఆయా కుటుంబాలు అంతులేని ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ఏ క్షణాన తలుపుకొడతారేమోని ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ నేవీ ఉన్నతాధికారుల పరామర్శలు చేస్తే.. ఇప్పుడు ఎన్ఏడీ ఉన్నతాధికారులు రోజూ ఆయా కుటుంబాలను కలిసి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. షిప్పులు, సబ్మెరైన్లు, కోస్టుగార్డులు, ఎయిర్‌ఫోర్సు, నేవీ, హెలికాఫ్టర్లు.. శాటిలైట్, రాడార్లతో సంద్రంలో, తీరమంతటా...ఇలా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నా స్పష్టమైన సమాచారం రాలేదని చెబుతున్నారు. ధైర్యంగా ఎలా ఉండగలం బాబూ.. ఎన్ఏడీ ఉన్నతాధికారులు, యూనియన్ నేతలు బుధవారం ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వేపగుంట బీసీ కాలనీలో గంట్ల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించినపుడు ఆయన తల్లి రోదించింది. నాఒక్కగానొక్క కొడుకు గల్లంతయి వారమవుతుంది. ఎక్కడ గల్లంతయ్యాడో.. ఎక్కడున్నాడో తెలియడం లేదు.. ఇలాంటి పరిస్థితిలో మేమెలా ధైర్యంగా ఉండగలం బాబూ.. అంటూ ఆందోళన వెలిబుచ్చింది. శ్రీనివాసరావు భార్య ఈశ్వరి మాత్రం ఇంటి నుంచి ప్రయాణానికి బయల్దేరినపుడు భర్తకు ఎదురొచ్చిన పరిస్థితినే కళ్లలో పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఈశ్వరి.. అమ్మా.. బైబై.. మరో పది రోజుల్లో వచ్చేస్తా.. ధైర్యంగా ఉండండన్న శ్రీనివాసరావు మాటలనే గుర్తు చేసుకుంటున్నారు. లోపల ఆందోళన ఎంతున్నా భర్త తిరిగొస్తాడనే మాటే ఆమె నుంచి వ్యక్తమవుతోంది. ఆమె రెండేళ్ల బిడ్డ డాడీ.. ఇదిగో.. అంటూ ఆల్బమ్ ఫొటోలను చూపుతుంటే అందరికీ కళ్లు చెమరుస్తున్నాయి. గోపాలపట్నం శ్రీనివాసనగర్‌లో ఉన్న పాటి నాగేంద్ర భార్యదీ అదే పరిస్థితి. ఆమె పిల్లలు అమ్మా.. నాన్న ఎక్కడ.. ఎపుడొస్తారంటూ ప్రశ్నిస్తుంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. భగవంతుని దయతో గల్లంతైన వారు ప్రాణాలతో రావాలని జనమంతా ప్రార్థనలు చేస్తున్నారు. అప్పట్లో తండ్రి.. ఇప్పుడు కుమారుడు వేపగుంట బీసీ కాలనీకి చెందిన గంట్ల నూకరాజు(42) ఎన్ఏడీలో డ్రైవరుగా పనిచేసేవారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు. 2001 డిసెంబరు 26న నూకరాజు విధి నిర్వహణలో ఉండగా.. 24 గంటల కడుపునొప్పి వచ్చి హఠాన్మరణం చెందారు. ఆయన ఉద్యోగం శ్రీనివాసరావుకు వచ్చింది. దీంతో శ్రీనివాసరావు ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. రక్షణ రంగానికి సంబంధించి మంచి నైపుణ్యం సంపాదించాడు. ఆ రకంగా ఈ నెల 20న ఇంటి నుంచి పోర్టుబ్లెయర్కు సహచర ఏడుగురు ఉద్యోగులతో బయలుదేరిన ఆయన గల్లంతైన సమాచారం ఇంటిల్లిపాదినీ కుదిపేస్తోంది.