breaking news
india versus austrelia
-
మూడో టీ-20: ఆస్ట్రేలియాకు కెప్టెన్ మారాడు!
సిడ్నీ: భారత్‌తో జరుగనున్న మూడో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఆసిస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ శుక్రవారం మెల్బోర్న్లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి తోడ కండరాలు పట్టేడయంతో మూడో టీ-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని తేలింది. మూడు మ్యాచుల ట్వంటీ-20 ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్ జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఫించ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ఆసిస్ జట్టు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫించ్ స్థానంలో లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా జట్టులోకి వచ్చాడు. త్వరలో న్యూజిల్యాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోనూ అతను ఆసిస్ జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణమని, ఇప్పటికే సిరీస్ భారత్‌కు కోల్పోయినా.. వచ్చే ట్వంటీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. మూడో మ్యాచులో గెలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తామని కెప్టెన్ షేన్ వాట్సన్ చెప్పాడు. -
కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు!
మెల్బోర్న్: అడిలైడ్‌లో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు జరిగిన మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ తాజాగా స్పందించాడు. మ్యాచ్‌లో తన పట్ల కోహ్లి తీరు ఏం బాలేదని పేర్కొన్నాడు. మ్యాచ్ కొనసాగుతుండగా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కాసేపు టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా ముచ్చటించాడు. ఆ వెంటనే అతను కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ దిశగా వెళ్తున్న స్మిత్‌తో కోహ్లికి సంవాదం జరిగింది. 'కోహ్లి చాలా అల్పంగా భావోద్వేగాలను ప్రదర్శించాడు. ఎవరైనా ఔటైనా సందర్భంలో అలా స్పందించాల్సిన అవసరం లేదేమో. ఎవరైనా ఔటైతే కొంతవరకు ఎగతాళి చేయవచ్చేమో కానీ ఇలా ప్రవర్తించడం సరికాదు' అంటూ స్మిత్ కోహ్లిపై మండిపడ్డాడు. టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా మాట్లాడటం వల్లే స్మిత్ ఔటైనట్టు ఆయన అభిమానులు భావిస్తుండగా స్మిత్ మాత్రం దానిని కొట్టిపారేశాడు. షాట్ సెలెక్షన్లో పొరపాటు వల్లే తాను ఔటయ్యానని చెప్పాడు. నిజానికి మైదానంలో టీవీ కామెంటేటర్లతో స్మిత్ లైవ్ ముచ్చటించడంతో చిరాకుపడ్డటు కనిపించిన కోహ్లి అతనికి సెండాఫ్ ఇచ్చినట్టు వ్యవహరించాడు. అయితే భారత యువబౌలర్ల పట్ల స్మిత్ దురుసు వ్యాఖ్యలు చేయడంతోనే అతనితో సంవాదం పెట్టుకున్నానని, అతని వద్ద లైవ్ మైక్ ఉన్న విషయం కూడా తనకు తెలియదని కోహ్లి వివరణ ఇచ్చాడు. కాగా, స్మిత్ ఔటయ్యేందుకు కారణమైన ఈ లెటెస్ట్ టెక్నాలజీపై క్రికెట్ దిగ్గజాలు మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో టీవీ కామెంటేటర్లతో మాట్లాడే ఈ పద్ధతి క్రికెట్‌ను ధంస్వం చేస్తోందని అన్నారు.