breaking news
indhiramma beneficiaries
-
తొలి అడుగు..పడమర ఖండ్రికలోనే..
కపిలేశ్వరపురం (మండపేట): ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పార్టీల తమ అభ్యర్థులను గెలిపించే పనిలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులైతే గెలిచేందుకు కలిసి వచ్చే అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ దశలో ఎవరికి ఓటేద్దామా అనే ఆలోచన చేస్తున్న క్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనా తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో పలు సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పథకం అని పేరు పెట్టారు. ఆ రాష్ట్ర వ్యాప్త పథకానికి పునాది పడింది జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలోనే. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం అమలులో భాగంగా గ్రామంలోని దళిత కుటుంబమైన నేల సౌధామణి ఇంటి నిర్మాణ పనులకు వైఎస్సార్ కొబ్బరికాయ కొట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఆ చిరునవ్వు నేటికీ గ్రామంలో చెక్కు చెదరలేదు. ప్రజల గుండెలోతుల్లో ఇమిడిన ఆయన నడవడిక తీపి గుర్తులను ప్రజలు మననం చేసుకుంటున్నారు. పేదలకు ఎన్నటికీ సాధ్యం కావనుకున్న విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే చెల్లిందంటున్నారు. ఆయనే స్వయంగా కొబ్బరికాయ కొట్టారు వైస్ రాజశేఖర్‌రెడ్డిగారు పడమర ఖండ్రికలో ఇందిరమ్మ పథకాలను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు గృహ నిర్మాణ పథకం పనులను మా ఇంటితోనే ప్రారంభించారు. ఆయన మీ వైఎస్సార్ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మీ ఇంటికి వస్తారమ్మా అన్నప్పుడు పెద్దొళ్లు మనింటికేం వస్తారులే అనుకున్నాను. ఆ రోజు ఆయన ఎంతో ఆప్యాయతగా వచ్చి కొబ్బరికాయ కొట్టారు. నేను మా పిల్లలు ఆశ్చర్యపోయాం. నవ్వుతూ ఎంతో ఆప్యాయతతో పలకరించారు. ఆయన పుణ్యమా అని ఇల్లు కట్టుకోగలిగాం. నాలాంటి వాళ్లెందరికో మేలు చేసిన గొప్పాయన ఆయన. – నేల సౌదామణి, పడమర ఖండ్రిక -
‘ఇందిరమ్మ’ దారెటు!
లబ్ధిదారుల్లో అయోమయం - టీఆర్ఎస్ హామీతో.. - రూ.3 లక్షలతో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తానన్న కేసీఆర్ - ఇందిరమ్మ కింద వచ్చేది రూ. లక్ష లోపే సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ‘ఇందిరమ్మ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ‘120 గజాల స్థలంలో రెండు పడక గదులు, ఓ వంట గది, బాత్రూమ్ను రూ. 3 లక్షలతో మేమే ఇండ్లు నిర్మించి ఇస్తాం’ అన్న కేసీఆర్ ప్రకటన లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ రథసారథి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల నేపథ్యంలో ఇప్పటికే మంజూరైన ఇళ్ల ను నిర్మించుకోవడమా? లేక కొత్త మంజూరు కోసం వేచి చూడటమా? అన్న సందేహంలో పడ్డారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పలు విడతల్లో జిల్లాకు 2,41,887 ఇండ్లు ుంజూరయ్యాయి. ఇందులో 1,28,583 ఇండ్లు పూర్తయ్యాయి. పురోగతిలో 29,326 ఇండ్లు ఉన్నాయి.అసలు మొదలు కాని ఇండ్లు 29,687 వరకు ఉన్నాయి. జూన్ 2న నుంచి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుండగా... ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 120 గజాల స్థలంలో రెండు పడక, ఓ వంటగది, బాత్రూమ్ సహా నిర్మించుకోవచ్చన్న ఆలోచనలో ఇందిరమ్మ లబ్ధిదారులు పడ్డారు. కొత్త ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తుందా? ఇది వరకున్న ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులను మినహాయిస్తుందా? ఇంతకీ ‘ఇందిరమ్మ’ దారెటన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇండ్లను ప్రస్తుతం 240 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 16 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ ఇళ్లపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీయేతరులకు రూ.70 వేలు చెల్లిస్తుంది. షెడ్యూల్ తెగలకు రూ.1.05 లక్షలు, షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు రూ.1లక్ష వివిధ దశలు, రూపాల్లో చెల్లిస్తుంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 120 గజాల స్థలంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.3 లక్షలు వెచ్చించి ఇండ్ల నిర్మాణం చేసిస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక స్థానాలు సాధించుకుని జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో ఇంకా ఇండ్ల నిర్మాణం మొదలెట్టని లబ్ధిదారులు సందిగ్ధంలో పడ్డారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందా? లేక వాటి స్థానంలో కొత్తగా మంజూరు ఇస్తుందా? ఇంకా మొదలెట్టని ఇండ్ల స్థానంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.